యోబు 33
33
1“యోబూ, ఇప్పుడు నా మాటలు విను;
నేను చెప్పే ప్రతిదాన్ని ఆలకించు.
2నేను నోరు తెరిచి మాట్లాడబోతున్నాను;
నా మాటలు నా నాలుక చివర ఉన్నాయి.
3యథార్థమైన హృదయం నుండి నా మాటలు వస్తున్నాయి;
నాకు తెలిసిన దానిని నా పెదవులు నిష్కపటంగా పలుకుతాయి.
4దేవుని ఆత్మ నన్ను సృష్టించింది;
సర్వశక్తిమంతుని ఊపిరి నాకు జీవమిచ్చింది.
5నీకు చేతనైతే నాకు జవాబు చెప్పు;
నా ముందు నిలబడి నీ వాదన వినిపించు.
6దేవుని దృష్టిలో నీవెంతో నేను అంతే;
నేను కూడా మట్టితో చేయబడ్డాను.
7నా భయం నిన్ను భయపెట్టకూడదు,
నా చేయి నీ మీద భారంగా ఉండకూడదు.
8“నేను వింటుండగా నీవు మాట్లాడావు
నీ మాటలు నేను విన్నాను.
9అవేమిటంటే, ‘నేను పవిత్రుడను, ఏ తప్పు చేయలేదు;
నేను శుద్ధుడను పాపం లేనివాడను.
10అయినా దేవుడు నాలో తప్పును కనుగొన్నారు;
నన్ను తన శత్రువుగా భావిస్తున్నారు.
11నా కాళ్లకు సంకెళ్ళు బిగించాడు.
నా మార్గాలన్నిటిని దగ్గర నుండి గమనిస్తున్నాడు.’
12“కాని ఈ విషయంలో నీవు తప్పు,
ఎందుకంటే దేవుడు మానవుల కంటే గొప్పవాడు.
13ఒకని మాటలకు ఆయన స్పందించరని
ఎందుకు నీవు ఆయనకు ఫిర్యాదు చేస్తావు?
14ఎందుకంటే దేవుడు ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడతారు,
అయితే ఎవరు దానిని గ్రహించలేరు.
15ప్రజలు పడకపై పడుకుని,
గాఢనిద్రలో ఉన్నప్పుడు,
రాత్రి వచ్చే కలలో,
16-18నరులను గర్విష్ఠులు కాకుండచేయాలని
వారు చేయదలచిన తప్పులను చేయకుండా వారిని ఆపడానికి,
గోతిలో పడకుండ వారిని కాపాడడానికి,
ఖడ్గం ద్వార వారి ప్రాణాలు పోకుండ వారిని తప్పించాలని#33:16-18 లేదా నది దాటుట నుండి
ఆయన వారి చెవుల్లో మాట్లాడవచ్చు
హెచ్చరికలతో వారిని భయపెట్టవచ్చు.
19“లేదా ఒకరు ఎముకల్లో నిరంతరం బాధ కలిగి
నొప్పితో మంచం పట్టడం ద్వారా శిక్షించబడతారు.
20అప్పుడు వారికి అన్నం సహించదు
వారికి ఇష్టమైన భోజనమైనా సరే అసహ్యంగా ఉంటుంది.
21వారి మాంసం కృషించిపోయి,
ఇంతకుముందు కనిపించని ఎముకలు ఇప్పుడు బయటకు కనబడతాయి.
22వారు సమాధికి దగ్గరవుతారు,
వారి ప్రాణాలు మరణ దూతలకు#33:22 లేదా మృతుల స్థలానికి దగ్గరవుతాయి.
23అయినాసరే వారికి ఒక దేవదూత ఉంటే,
వేలాది దేవదూతల్లో ఒక దూతను,
మనుష్యులు యథార్థంగా ఎలా ఉండాలో చెప్పడానికి పంపితే,
24ఆ దూతకు వారిపై దయ కలిగి దేవునితో,
‘వారిని సమాధిలోనికి దిగిపోకుండా కాపాడండి;
వారి కోసం క్రయధనం నాకు దొరికిందని చెప్తాడు.
25అప్పుడు వారి దేహం చిన్నపిల్లల దేహంలా ఉంటుంది;
వారికి తమ యవ్వనకాలం తిరిగి వస్తుంది.’
26అప్పుడు వారు దేవునికి ప్రార్థించి ఆయన దయను పొందవచ్చు,
వారు దేవుని ముఖం చూసి ఆనందంతో కేకలు వేస్తారు;
ఆయన వారి నీతిని వారికి తిరిగి ఇస్తారు.
27వారు ఇతరుల దగ్గరకు వెళ్లి ఇలా చెప్తారు,
‘నేను పాపం చేశాను, సరియైన దానిని వంకరగా మార్చాను,
అయినా దానికి తగిన శిక్ష నాకు విధించబడలేదు.
28సమాధికి వెళ్లకుండ దేవుడు నా ప్రాణాన్ని విమోచించారు.
జీవిత వెలుగును ఆస్వాదించడానికి నేను బ్రతుకుతాను.’
29-30“జీవిత వెలుగు వారి మీద ప్రకాశించేలా
వారిని సమాధి నుండి తప్పించడానికి,
దేవుడు మానవుల కోసం వీటన్నిటిని
రెండు, మూడు సార్లైనా చేస్తారు.
31“యోబూ, నా మాటలు విను; శ్రద్ధగా ఆలకించు,
మౌనంగా ఉండు, నేను మాట్లాడతాను.
32నీవు చెప్పవలసినది ఏదైనా ఉంటే నాతో చెప్పు;
మాట్లాడు, నీ దోషమేమీ లేదని నేను నిరూపించదలిచాను.
33కాని ఒకవేళ ఏమిలేకపోతే, నేను చెప్పేది విను;
మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 33: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.