యోబు 7
7
1“భూమి మీద మానవులకు ఉండేది కఠినమైన సేవ కాదా?
వారి రోజులన్నీ కూలివారి రోజులవంటివి కావా?
2చల్లనినీడ కోసం ఎంతో ఆశపడే దాసునిలా,
కూలిడబ్బుల కోసం ఎదురు చూసే కూలివానిలా,
3నిరర్థకమైన నెలలు నాకు కేటాయించబడ్డాయి,
దుఃఖంతో నిండిన రాత్రులు నాకు నియమించబడ్డాయి.
4నేను పడుకున్నప్పుడు ‘నేను ఎప్పుడు లేస్తాను రాత్రి ఎప్పుడు ముగుస్తుంది?’
అని ఆలోచిస్తాను తెల్లవారే వరకు నేను అటూ ఇటూ దొర్లుతూ ఉంటాను.
5నా శరీరం పురుగులతో కురుపులతో కప్పబడింది,
నా చర్మం పగిలి చీము పట్టింది.
6“నేతగాని మగ్గం కంటే వేగంగా నా రోజులు గడుస్తున్నాయి,
నిరీక్షణ లేకుండానే అవి ముగిసిపోతున్నాయి.
7దేవా! నా జీవం వట్టి ఊపిరి వంటిదేనని జ్ఞాపకం చేసుకోండి;
నా కళ్లు మంచిని మరలా చూడలేవు.
8ఇప్పుడు నన్ను చూస్తున్నవారి కన్ను ఇకమీదట నన్ను చూడదు;
మీరు నా కోసం చూసినా నేను ఇక ఉండను.
9మేఘం విడిపోయి మాయమైపోయిట్లు,
సమాధిలోనికి దిగిపోయినవాడు మరలా తిరిగి రాడు.
10అతడు తన ఇంటికి మరలా తిరిగి రాడు;
అతని స్వస్థలం అతన్ని మరచిపోతుంది.
11“కాబట్టి నేను మౌనంగా ఉండను;
నా ఆత్మలోని వేదన బట్టి మాట్లాడతాను.
నా మనస్సులోని బాధను బట్టి నేను ఫిర్యాదు చేస్తాను.
12మీరు నాకు కాపలా పెట్టడానికి
నేనేమైనా సముద్రాన్నా లేదా సముద్రపు క్రూరజంతువునా?
13నా పడక నాకు ఆదరణ ఇస్తుందని
నా మంచం నా బాధను తగ్గిస్తుందని నేను అనుకుంటే,
14అప్పుడు కూడా కలలతో మీరు నన్ను బెదిరిస్తున్నారు.
దర్శనాలతో నన్ను భయపెడుతున్నారు.
15ఈ శరీరంతో ఇలా జీవించడం కంటే
ఊపిరాడకుండా చనిపోవడాన్నే నేను కోరుకుంటాను.
16నా జీవితాన్ని తృణీకరిస్తున్నాను; నేను ఎల్లకాలం బ్రతకను.
నన్ను ఒంటరిగా విడిచిపెట్టండి; నా దినాలు అర్థం లేకుండా ఉన్నాయి.
17“మీరు మానవులను ఘనపరచడానికి,
వారిపై మీరు అంతగా శ్రద్ధ చూపించడానికి,
18ప్రతి ఉదయం వారిని దర్శించడానికి,
అనుక్షణం వారిని పరీక్షించడానికి వారెంతటివారు?
19ఎంతకాలం మీరు నన్ను చూడడం మానకుండ ఉంటారు?
నా ఉమ్మిని మ్రింగేంత వరకు కూడ నన్ను విడిచిపెట్టరా?
20మనుష్యులను గమనించేవాడా, నేను పాపం చేస్తే,
మీకు నేను ఏమి చేశాను?
మీరెందుకు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు?
మీకు నేనే భారమైపోయానా?
21ఎందుకు మీరు నా అపరాధాలను క్షమించరు?
ఎందుకు నా పాపాలను తీసివేయరు?
త్వరలోనే నేను మట్టిలో కలిసిపోతాను,
మీరు నా కోసం వెదికినా నేనిక ఉండను.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 7: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.