యోబు 8
8
బిల్దదు
1అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా అన్నాడు:
2“ఎంతకాలం నీవు ఇలాంటి మాటలు మాట్లాడతావు?
నీ మాటలు సుడిగాలిలా ఉన్నాయి.
3దేవుడు న్యాయాన్ని తలక్రిందులు చేస్తారా?
సర్వశక్తిమంతుడు ధర్మాన్ని వక్రీకరిస్తారా?
4నీ పిల్లలు ఆయనకు విరోధంగా పాపం చేసి ఉండవచ్చు,
అందుకే ఆయన వారి పాపానికి తగ్గ శిక్షకు వారిని అప్పగించారు.
5కాని నీవు జాగ్రత్తగా దేవుని వెదికితే,
సర్వశక్తిమంతుడైన దేవుని వేడుకుంటే,
6నీవు పవిత్రంగా యథార్థంగా ఉంటే,
ఇప్పుడే ఆయన నీ పక్షాన లేస్తారు,
నీ సంపన్న స్థితిని తిరిగి ఇస్తారు.
7నీ స్థితి మొదట మామూలుగా ఉన్నా,
చివరకు అది ఎంతో అభివృద్ధి చెందుతుంది.
8“గత తరం వారిని అడుగు,
వారి పూర్వికులు చేసిన శోధనను గమనించు,
9ఎందుకంటే మనం నిన్న పుట్టినవారం, మనకు ఏమి తెలియదు,
భూమిపై మన రోజులు నీడ వంటివి.
10వారు నీకు బోధించి చెప్పరా?
వారు తమ అనుభవంతో మాట్లాడరా?
11బురద లేకుండ జమ్ము పెరుగుతుందా?
నీళ్లు లేకుండ రెల్లు ఎదుగుతుందా?
12అవి కోయకముందు పచ్చగా ఉంటాయి
గడ్డి కంటే త్వరగా వాడిపోతాయి.
13దేవుడిని మరచిపోయే వారందరి గతి ఇలాగే ఉంటుంది;
భక్తిహీనుల ఆశ అడుగంటిపోతుంది.
14వారు నమ్మేది పెళుసుగా ఉంటుంది.
వారి ఆశ్రయం సాలెగూడు వంటిది.
15వారు సాలెగూడును ఆశ్రయిస్తారు కాని అది నిలబడదు,
వారు దానిని అంటిపెట్టుకుంటారు కాని అది విడిపోతుంది.
16వారు సూర్యరశ్మిలో సమృద్ధి నీరు కలిగిన వాటిలా పచ్చగా ఉంటూ,
వాటి తీగలు వారి తోటమీద అల్లుకుంటూ విస్తరిస్తారు.
17దాని వేర్లు రాళ్ల చుట్టూ చుట్టుకొని,
రాళ్ల మధ్యకు చొచ్చుకుపోవాలని చూస్తుంది.
18ఆ చోటు నుండి అది తెంచివేయబడినప్పుడు,
ఆ చోటు ‘నేను నిన్నెప్పుడు చూడలేదు’ అంటూ దానిని నిరాకరిస్తుంది.
19ఖచ్చితంగా అది వాడిపోతుంది,
భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి.
20“దేవుడు నిర్దోషిని త్రోసివేయరు
దుర్మార్గుల చేతులను బలపరచరు.
21ఆయన నీ నోటిని నవ్వుతో,
నీ పెదవులను ఆనంద ధ్వనులతో నింపుతారు.
22నీ శత్రువులు అవమానాన్ని ధరిస్తారు,
దుర్మార్గుల గుడారాలు ఇక ఉండవు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 8: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.