సంఖ్యా 21

21
అరాదు నాశనం చేయబడింది
1ఇశ్రాయేలీయులు అతారీముకు వెళ్లే మార్గాన వస్తున్నారని దక్షిణ ప్రాంతంలో ఉన్న అరాదులో ఉన్న కనానీయ రాజు విని, ఇశ్రాయేలీయులపై దాడి చేసి, కొంతమందిని చెరగా తీసుకెళ్లాడు. 2అప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు ఈ మ్రొక్కుబడి చేసుకున్నారు: “మీరు ఈ ప్రజలను మా చేతులకు అప్పగిస్తే, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేస్తాము.”#21:2 ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది, తరచుగా వాటిని పూర్తిగా నాశనం చేయడమే; సంఖ్యా 21:3 కూడా ఉంది. 3యెహోవా ఇశ్రాయేలు మనవి విని కనానీయులను వారికి అప్పగించారు. వారు వారిని, వారి పట్టణాలను సర్వనాశనం చేశారు; కాబట్టి ఆ స్థలానికి హోర్మా#21:3 అంటే నాశనం అనే పేరు వచ్చింది.
ఇత్తడి సర్పం
4ఎదోము చుట్టూ తిరిగి రావాలని వారు హోరు పర్వతం నుండి ఎర్ర సముద్రం మార్గాన ప్రయాణం చేశారు. అయితే ప్రజలు ఈ ప్రయాణంలో ఓపిక కోల్పోయారు; 5దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడుతూ, “ఈ అరణ్యంలో మేము చావాలని ఈజిప్టు నుండి మమ్మల్ని ఎందుకు తెచ్చారు? ఇక్కడ తినడానికి తిండి లేదు! త్రాగడానికి నీళ్లు లేవు! ఈ పిచ్చి ఆహారమంటే మాకు అసహ్యం!” అని అన్నారు.
6అప్పుడు యెహోవా వారి మధ్యకు విషసర్పాలను పంపారు; అవి ప్రజలను కాటు వేశాయి, చాలామంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. 7ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాము. యెహోవా మా మధ్య నుండి సర్పాలను తీసివేసేలా ప్రార్థన చేయండి” అన్నారు. కాబట్టి మోషే ప్రజల కోసం ప్రార్థన చేశాడు.
8యెహోవా మోషేతో, “ఒక సర్పం చేసి స్తంభం మీద పెట్టు; పాము కాటేసినప్పుడు ఎవరైనా దానిని చూస్తే, వారు బ్రతుకుతారు” అని చెప్పారు. 9కాబట్టి మోషే ఇత్తడి సర్పాన్ని చేసి, దాన్ని ఒక స్తంభం మీద పెట్టాడు. అప్పుడు ఎవరైనా పాము కాటేసినప్పుడు, ఇత్తడి సర్పాన్ని చూస్తే, వారు చావలేదు.
మోయాబుకు ప్రయాణం
10ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసి, ఓబోతులో దిగారు. 11తర్వాత ఓబోతు నుండి ప్రయాణం చేసి, ఈయ్యె-అబారీములో దిగారు. అది మోయాబుకు ఎదురుగా, సూర్యోదయ దిక్కున ఉన్న అరణ్యము. 12అక్కడినుండి ప్రయాణం చేసి జెరెదు లోయలో దిగారు. 13వారు అక్కడినుండి బయలుదేరి, అమోరీయుల భూభాగంలో విస్తరించి ఉన్న అరణ్యంలో ఉన్న అర్నోను ప్రక్కన విడిది చేశారు. అర్నోను మోయాబు అమోరీయుల మధ్య మోయాబు సరిహద్దు. 14-15అందుకే యెహోవా యుద్ధాల గ్రంథంలో:
“సుఫాలోని వాహేబు,#21:14-15 గ్రీకు అనువాదంలో ఈ పదం జాహబ్
అర్నోను లోయలు
ఆరు పట్టణం వరకు ఉన్న పల్లపు లోయలు
మోయాబు సరిహద్దులో ఉన్నాయి”
అని వ్రాయబడి ఉంది.
16అక్కడినుండి వారు బెయేర్‌కు వెళ్లారు, ఈ బావి గురించి యెహోవా మోషేతో, “ప్రజలను సమకూర్చు, నేను వారికి నీళ్లిస్తాను” అని అన్నారు.
17అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ పాట పాడారు:
“ఓ బావి ఉప్పొంగు!
దాని గురించి పాడండి.
18రాకుమారులు ఆ బావిని త్రవ్వించారు,
ప్రజల సంస్థానాధిపతులు
తమ రాజదండాలతో కర్రలతో త్రవ్వారు.”
తర్వాత వారు అరణ్యం నుండి మత్తానకు వెళ్లారు, 19మత్తాన నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు, 20బామోతు నుండి మోయాబు లోయకు వెళ్లారు. అక్కడే పిస్గా పర్వతం ఉంది.
సీహోను, ఓగుల ఓటమి
21ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపారు:
22“మీ దేశం మీదుగా మమ్మల్ని వెళ్లనివ్వండి. మీ పొలాల వైపు, ద్రాక్షతోటల పొలాల వైపు తిరగము, మీ బావులలోని నీళ్లు త్రాగము. మీ దేశం పొలిమేర దాటే వరకు రాజమార్గంలోనే వెళ్తాము.”
23అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన దేశం గుండా వెళ్లడానికి అనుమతించలేదు. అతడు తన సైన్యమంతటిని పోగు చేసి, ఇశ్రాయేలుపై దాడి చేయడానికి అరణ్యంలోకి వెళ్లాడు. అతడు యాహాజుకు చేరినప్పుడు, ఇశ్రాయేలుతో పోరాడాడు. 24అయితే ఇశ్రాయేలు అతన్ని ఖడ్గంతో చంపి అతని దేశాన్ని అర్నోను నది నుండి యబ్బోకు వరకు ఆక్రమించారు, కానీ అమ్మోనీయుల సరిహద్దు వరకు మాత్రమే ఎందుకంటే వారి సరిహద్దు పటిష్టమైనది. 25ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణాలన్నిటిని, హెష్బోను దాని చుట్టూరా ఉన్న గ్రామాలతో సహా స్వాధీనం చేసుకుని ఆక్రమించారు. 26హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. సీహోను అంతకుముందు మోయాబు రాజుతో యుద్ధం చేసి, అర్నోను నది వరకు ఉన్న ప్రదేశమంతా వశం చేసుకున్నాడు.
27అందుకే సామెతలు చెప్పేవారు ఇలా అంటారు:
హెష్బోనుకు రండి అది తిరిగి కట్టబడనివ్వండి;
సీహోను పట్టణం పూర్వస్థితికి వచ్చును గాక.
28హెష్బోను నుండి అగ్ని బయలుదేరింది,
సీహోను పట్టణం నుండి మంటలు వచ్చాయి.
అది మోయాబులోని ఆరు పట్టణాన్ని కాల్చివేసింది.
అర్నోను యొక్క ఎత్తైన స్థలాల యజమానులను దహించివేసింది.
29మోయాబూ, నీకు శ్రమ!
కెమోషు ప్రజలారా! మీరు నాశనమయ్యారు.
అతడు తన కుమారులను పారిపోయేవారిగా,
అతని కుమార్తెలను అమోరీయుల రాజైన సీహోను దగ్గర
చెరగా అప్పగించాడు.
30“అయితే మేము వారిని కూల్చివేసాము;
హెష్బోను అధికారం దీబోను వరకు నాశనమైంది.
నోఫహు వరకు వారిని పడగొట్టాము,
మెదెబా వరకు అది వ్యాపించింది.”
31కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల స్థలంలో స్థిరపడ్డారు.
32యాజెరు ప్రాంతాన్ని చూసి రమ్మని మోషే వేగులవారిని పంపిన తర్వాత, ఇశ్రాయేలీయులు ఆ పట్టణాన్ని, దాని చుట్టూరా ఉన్న గ్రామాలను స్వాధీనపరచుకుని అక్కడ ఉన్న అమోరీయులను తరిమేశారు. 33తర్వాత వారు తిరిగి బాషానుకు వెళ్లే మార్గంలో వెళ్లాము, అప్పుడు బాషాను రాజైన ఓగు తన సైన్యమంతటితో ఎద్రెయీ దగ్గర యుద్ధంలో వారిని ఎదుర్కోడానికి బయలుదేరాడు.
34యెహోవా మోషేతో, “అతనికి భయపడకండి, ఎందుకంటే అతన్ని, అతని సైన్యమంతటిని, అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. హెష్బోనులో పరిపాలించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు అతనికి చేయండి” అని ఆజ్ఞాపించారు.
35కాబట్టి వారు ఓగును, అతని కుమారులను, అతని సైన్యమంతటిని, ఏ ఒక్కరు మిగలకుండా హతం చేశారు. అతని దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యా 21: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి