సంఖ్యా 6

6
నాజీరు నియమం
1యెహోవా మోషేతో, 2“ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘పురుషుడు గాని స్త్రీ గాని ఒక ప్రత్యేకమైన మ్రొక్కుబడి చేయాలనుకుంటే అనగా, యెహోవాకు నాజీరుగా ప్రతిష్ఠించుకునే మ్రొక్కుబడి చేయాలనుకుంటే, 3వారు ద్రాక్షరసం, మద్యానికి వేరుగా ఉండాలి, ద్రాక్షరసం నుండి గాని మద్యం నుండి గాని తయారుచేసిన చిరక త్రాగవద్దు. వారు ఏ ద్రాక్షరసం త్రాగకూడదు, పండు ద్రాక్షలు గాని ఎండు ద్రాక్షలు గాని తినకూడదు. 4వారు నాజీరుగా ఉన్నంత కాలం ద్రాక్షరసం నుండి వచ్చే ఏవైన, విత్తనాలైనా లేదా వాటి ఎండిన తినకూడదు.
5“ ‘నాజీరుగా మ్రొక్కుబడి చేసుకున్న కాలమంతా, వారి వెంట్రుకలు కత్తిరించకూడదు. తమను తాము యెహోవాకు ప్రత్యేకించుకున్న కాలమంతా వారు ముగిసేవరకు పవిత్రులుగా ఉండాలి; వారి వెంట్రుకలు పెరిగేలా వదిలేయాలి.
6“ ‘వారు యెహోవాకు తాము ప్రత్యేకించుకున్న కాలమంతా శవం దగ్గరకు వెళ్లకూడదు. 7వారి సొంత తండ్రి లేదా తల్లి లేదా సోదరుడు లేదా సోదరి మరణించినా కూడా, వారు తమను తాము ఆచారబద్ధంగా అపవిత్రం చేసుకోవద్దు, ఎందుకంటే దేవునికి వారు అంకితం చేసుకున్న చిహ్నం వారి తలపై ఉంటుంది. 8వారి సమర్పణ కాలం అంతా, వారు యెహోవాకు ప్రతిష్ఠించబడ్డారు.
9“ ‘నాజీరు చేయబడినవారు ఉన్నచోట ఎవరైనా చనిపోయి, తాము ప్రతిష్ఠించుకున్న దానికి సూచనగా ఉన్న వారి వెంట్రుకలు అపవిత్రం అయితే, వారు ఏడవ రోజున, శుభ్ర పరచుకునే రోజున తమ తల గొరిగించుకోవాలి. 10తర్వాత ఎనిమిదవ రోజు రెండు తెల్ల గువ్వలను, రెండు పావురపు పిల్లలను సమావేశ గుడారం ద్వారం దగ్గర యాజకుడి దగ్గరకు తేవాలి. 11నాజీరు శవం దగ్గర ఉండడం పాపమవుతుంది, కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా,#6:11 లేదా శుద్ధీకరణ అర్పణ అలాగే 1; 16 వచనాల్లో కూడా ఇంకొక దానిని దహనబలిగా అర్పించాలి. అదే రోజు తమ తలను మరలా పవిత్రం చేసుకోవాలి. 12వారు ప్రత్యేకించుకున్న కాలాన్ని నియమించుకొని తిరిగి తమను తాము యెహోవాకు ప్రత్యేకించుకుని ఒక ఏడాది గొర్రెపిల్లను అపరాధపరిహారబలి కోసం తేవాలి. ప్రత్యేకించుకున్న కాలంలో అపవిత్రులయ్యారు కాబట్టి మునుపటి రోజులు లెక్కకు రావు.
13“ ‘ప్రత్యేకించుకున్న కాలం ముగిసినప్పుడు నాజీరు పాటించవలసిన నియమమేదంటే వారు సమావేశ గుడారం ద్వారం దగ్గరకు రావాలి. 14అక్కడ వారు యెహోవాకు తమ అర్పణలు అర్పించాలి: దహనబలి కోసం లోపం లేని ఏడాది మగ గొర్రెపిల్ల, పాపపరిహారబలి కోసం లోపం లేని ఆడ గొర్రెపిల్ల, సమాధానబలి కోసం లోపం లేని పొట్టేలు, 15వీటితో పాటు భోజనార్పణలు, పానార్పణలు, ఒక గంపెడు నూనె కలిపిన పులుపు కలపకుండ చేసిన నాణ్యమైన పిండి వంటలు ఒలీవనూనె కలిపిన మందమైన రొట్టెలు, ఒలీవనూనె పూసిన అప్పడాలు తీసుకురావాలి.
16“ ‘ఇవన్నీ యాజకుడు యెహోవా ఎదుట ఉంచి పాపపరిహారబలి, దహనబలి అర్పించాలి. 17అతడు గంపెడు పులియని రొట్టెలతో పాటు పొట్టేలును భోజనార్పణ పానార్పణంతో పాటు యెహోవాకు సమాధానబలిగా అర్పించాలి.
18“ ‘అప్పుడు సమావేశ గుడారం ద్వారం దగ్గర, నాజీరు తాను ప్రత్యేకించుకున్న దానికి చిహ్నంగా ఉన్న తల వెంట్రుకలను గొరిగించుకోవాలి. ఆ వెంట్రుకలు సమాధానబలి అగ్నిలో వేసేయాలి.
19“ ‘నాజీరు తాను ప్రత్యేకించుకున్న దానికి చిహ్నంగా ఉన్న తల వెంట్రుకలను గొరిగించుకున్న తర్వాత వండిన పొట్టేలు జబ్బను, గంపలోని ఒక పులుపు కలపకుండ చేసిన మందమైన రొట్టెను, ఒక అప్పడాన్ని యాజకుడు నాజీరు చేయబడిన వాని చేతిలో పెట్టాలి. 20యాజకుడు అప్పుడు వాటిని యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి; పైకెత్తబడి అర్పించబడిన రొమ్ము, ప్రత్యేక అర్పణగా సమర్పించబడిన తొడ పరిశుద్ధమైనవి, అవి యాజకునికి చెందినవి. ఆ తర్వాత, నాజీరు చేయబడిన వాడు ద్రాక్షరసం త్రాగవచ్చు.
21“ ‘తాము ప్రత్యేకించుకున్న దాని ప్రకారం యెహోవాకు అర్పణలను తెస్తామని మ్రొక్కుబడి చేసే నాజీరుల నియమము. వారు తేగలిగితే అధనపు అర్పణలను కూడా తీసుకురావచ్చు. నాజీరు నియమం ప్రకారం వారు చేసిన మ్రొక్కుబడులను వారు తప్పక నెరవేర్చాలి.’ ”
యాజక దీవెన
22యెహోవా మోషేతో ఇలా చెప్పారు, 23“అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి:
24“ ‘ “యెహోవా నిన్ను ఆశీర్వదించి
కాపాడును గాక;
25యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి
నిన్ను కరుణించును గాక;
26యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక
సమాధానం ఇచ్చును గాక.” ’
27“ఇలా అహరోను అతని కుమారులను ఇశ్రాయేలీయులను నా నామమున దీవించినప్పుడు, నేనే స్వయంగా ఆశీర్వదిస్తాను.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సంఖ్యా 6: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి