కీర్తనలు 139
139
కీర్తన 139
ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన.
1యెహోవా మీరు నన్ను పరిశోధించారు,
మీరు నన్ను తెలుసుకొన్నారు.
2నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు;
దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు.
3నేను బయటకు వెళ్లడాన్ని పడుకోవడాన్ని మీరు పరిశీలిస్తారు;
నా మార్గాలన్నీ మీకు బాగా తెలుసు.
4యెహోవా, నా నాలుక మాట పలుకక ముందే,
అదేమిటో మీకు పూర్తిగా తెలుసు.
5నా వెనుక నా ముందు మీరు చుట్టి ఉంటారు,
మీ దయగల చేతిని నా మీద ఉంచుతారు.
6అటువంటి జ్ఞానం నా గ్రహింపుకు మించింది,
నేను అందుకోలేనంత ఎత్తులో అది ఉంది.
7మీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్లగలను?
మీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను?
8ఒకవేళ నేను ఆకాశానికి ఎక్కి వెళ్తే, అక్కడా మీరు ఉన్నారు;
నేను పాతాళంలో నా పడకను సిద్ధం చేసుకుంటే, అక్కడా మీరు ఉన్నారు.
9ఒకవేళ నేను ఉదయపు రెక్కలపై ఎగిరిపోయి,
నేను సముద్రం యొక్క సుదూరాన స్థిరపడితే,
10అక్కడ కూడా మీ చేయి నన్ను నడిపిస్తుంది,
మీ కుడిచేయి నన్ను గట్టిగా పట్టుకుంటుంది.
11“చీకటి నన్ను దాచివేస్తుంది,
నా చుట్టూ ఉన్న వెలుగు రాత్రిగా మారుతుంది” అని నేననుకుంటే,
12చీకటి కూడ మీకు చీకటి కాదు;
రాత్రి పగటివలె మెరుస్తుంది,
ఎందుకంటే చీకటి మీకు వెలుగు లాంటిది.
13నా అంతరంగాన్ని మీరు సృష్టించారు;
నా తల్లి గర్భంలో మీరు నన్ను ఒక్కటిగా అల్లారు.
14నేను అద్భుతంగా, ఆశ్చర్యంగా సృజించబడ్డాను కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
మీ క్రియలు ఆశ్చర్యకరమైనవి,
అది నాకు పూర్తిగా తెలుసు.
15రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు,
భూమి అగాధ స్థలాల్లో నేను ఒక్కటిగా అల్లబడినప్పుడు,
నా రూపము మీ నుండి మరుగు చేయబడలేదు.
16నేను పిండంగా ఉన్నప్పుడు మీ కళ్లు నన్ను చూశాయి;
నాకు నియమించబడిన రోజుల్లో ఒక్కటైనా రాకముందే
అవన్నీ మీ గ్రంథంలో వ్రాయబడ్డాయి.
17దేవా, మీ ఆలోచనలు#139:17 నా గురించిన మీ ఆలోచనలు ఎంత అద్భుతం! నాకెంతో అమూల్యమైనవి!
వాటి మొత్తం ఎంత విస్తారమైనది!
18వాటిని లెక్కించడానికి నేను ప్రయత్నిస్తే,
అవి ఇసుకరేణువుల కంటే లెక్కకు మించినవి,
నేను మేల్కొనినప్పుడు నేను ఇంకా మీ దగ్గరే ఉన్నాను.
19ఓ దేవా, మీరే దుష్టులను హతం చేస్తే మంచిది;
హంతకులారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి.
20వారు చెడు ఉద్దేశ్యంతో మీ గురించి మాట్లాడతారు;
మీ శత్రువులు మీ నామాన్ని దుర్వినియోగం చేస్తారు.
21యెహోవా, మిమ్మల్ని ద్వేషించేవారిని నేను ద్వేషించనా,
మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిని అసహ్యించుకోనా?
22వారి పట్ల ద్వేషము తప్ప ఇంకొకటి లేదు;
వారిని నా శత్రువులుగా లెక్కగడతాను.
23దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోండి;
నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోండి.
24చెడుమార్గమేదైనా నాలో ఉన్నదేమో చూడండి,
నిత్యమైన మార్గంలో నన్ను నడిపించండి.#139:24 కీర్తన 3:8 ఫుట్‌నోట్ చూడండి
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 139: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.