కీర్తనలు 140
140
కీర్తన 140
ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన.
1యెహోవా, కీడుచేసే మనుష్యుల నుండి నన్ను రక్షించండి;
హింసించేవారి నుండి నన్ను కాపాడండి,
2వారు హృదయాల్లో చెడు విషయాలే కల్పించుకుంటారు
రోజు యుద్ధము రేపుతారు.
3వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు;
వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. సెలా
4యెహోవా, దుష్టుల చేతుల నుండి నన్ను కాపాడండి;
దౌర్జన్యపరుల నుండి నన్ను కాపాడండి,
నా కాళ్లను పట్టుకోవాలని పన్నాగాలు చేస్తున్నారు.
5అహంకారులు చాటుగా వల ఉంచారు;
వారు వల దాడులు పరచారు,
నా మార్గం వెంట ఉచ్చులు పెట్టారు. సెలా
6నేను యెహోవాతో, “నా దేవుడు మీరే” అని చెప్తాను.
యెహోవా, దయతో మొరను ఆలకించండి.
7ప్రభువైన యెహోవా, బలాడ్యుడవైన నా రక్షకా,
యుద్ధ దినాన మీరు నా తలను రక్షిస్తారు.
8యెహోవా, దుష్టుల కోరికలను వారికి ఇవ్వకండి;
వారి ప్రణాళికలు విజయవంతం కానివ్వకండి. సెలా
9నన్ను చుట్టుముట్టినవారు గర్వముతో తలలు ఎత్తుతారు;
వారి పెదవుల కీడు వారిని మ్రింగివేయాలి.
10మండుతున్న నిప్పు రవ్వలు వారిపై పడాలి;
వారు అగ్నిలో పడవేయబడాలి,
తిరిగి లేవకుండా మట్టి గొయ్యిలో పడవేయబడాలి.
11దూషకులు భూమి మీద స్థిరపడకుందురు గాక;
విపత్తులు, దౌర్జన్యపరులను వేటాడతాయి.
12యెహోవా దరిద్రులకు న్యాయం చేకూరుస్తారని,
అవసరతలో ఉన్నవారికి న్యాయం సమకూరుస్తారని నాకు తెలుసు.
13నిశ్చయంగా నీతిమంతులు మీ నామాన్ని స్తుతిస్తారు,
యథార్థవంతులు మీ సన్నిధిలో ఉంటారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 140: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.