కీర్తనలు 77

77
కీర్తన 77
సంగీత దర్శకుడైన యెదూతూనుకు. ఒక ఆసాపు కీర్తన.
1నేను సహాయం కోసం దేవునికి మొరపెట్టాను;
ఆయన వింటాడని నేను దేవునికి మొరపెట్టాను.
2నేను బాధలో ఉన్నప్పుడు నేను ప్రభువును ఆశ్రయించాను;
అలసిపోకుండా రాత్రంతా నేను చేతులు చాచాను,
నాకు ఆదరణ కలుగలేదు.
3దేవా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దుఃఖించాను;
నేను ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ సొమ్మసిల్లింది. సెలా
4మీరు నా కనురెప్పలు తెరిచి ఉంచారు
నేను మాట్లాడడానికి ఇబ్బంది పడ్డాను.
5మునుపటి రోజులను గురించి,
చాలా కాలంనాటి సంవత్సరాలను గురించి నేను ఆలోచించాను.
6రాత్రివేళ నేను నా పాటలు జ్ఞాపకం చేసుకున్నాను.
నా హృదయం ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ అడిగింది:
7“ప్రభువు నన్ను శాశ్వతంగా తృణీకరిస్తారా?
ఆయన ఎప్పటికీ తన దయను చూపించరా?
8ఆయన మారని ప్రేమ శాశ్వతంగా పోయినట్లేనా?
ఆయన వాగ్దానం ఎప్పటికీ నెరవేరదా?
9దేవుడు కరుణించడం మరచిపోయారా?
ఆయన తన కోపంలో కనికరాన్ని చూపకుండ ఉంటారా?” సెలా
10అప్పుడు నేను ఇలా అనుకున్నాను, “ఇది నా విధి:
మహోన్నతుడు నాకు వ్యతిరేకంగా చేయి ఎత్తారు.
11యెహోవా కార్యాలను గుర్తు చేసుకుంటాను;
అవును, చాలా కాలంనాటి మీ అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను.
12మీ కార్యాలన్నిటిని నేను తలంచుకుంటాను,
మీ గొప్ప క్రియలన్నిటిని నేను ధ్యానిస్తాను.”
13దేవా, మీ మార్గాలు పరిశుద్ధమైనవి.
మన దేవునిలాంటి గొప్ప దేవుడెవరున్నారు?
14మీరు అద్భుతాలు చేసే దేవుడు;
మీరు ప్రజలమధ్య మీ శక్తిని చూపిస్తారు.
15మీ శక్తివంతమైన చేతితో యాకోబు, యోసేపు సంతతివారైన
మీ ప్రజలను విమోచించారు. సెలా
16దేవా, జలాలు మిమ్మల్ని చూశాయి,
జలాలు మిమ్మల్ని చూసి త్రుళ్ళిపడ్డాయి;
అగాధాలు వణికిపోయాయి.
17మేఘాలు వర్షించాయి.
ఆకాశాలు ఉరుములతో ప్రతిధ్వనించాయి.
మీ బాణాలు అన్నివైపులా తళుక్కుమన్నాయి.
18మీ ఉరుము సుడిగాలిలో వినిపించింది,
మీ మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది;
భూమి వణికి కంపించింది.
19మీ అడుగుజాడలు కనిపించనప్పటికీ,
మీ మార్గం సముద్రం గుండా,
శక్తివంతమైన జలాల గుండా వెళ్లింది.
20మోషే అహరోనుల ద్వార
మీరు మీ ప్రజలను మందలా నడిపించారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 77: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి