రోమా పత్రిక 10
10
1సహోదరీ సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడాలనేది నా హృదయవాంఛ, దాని గురించి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. 2అప్పుడు వారు దేవుని పట్ల అత్యాసక్తి కలిగి ఉన్నారని అయితే వారి అత్యాసక్తి జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదని నేను సాక్ష్యమివ్వగలను. 3దేవుని నీతి వారికి తెలియకపోయినా తమ స్వనీతిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వారు దేవుని నీతికి లోబడలేదు. 4విశ్వసించే వారందరికి నీతిగా ఉండడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపుగా ఉన్నారు.
5ధర్మశాస్త్రం వలన నీతిని జరిగించే వారి గురించి మోషే, “వీటిని చేసేవారు వాటి వల్లనే జీవిస్తారు”#10:5 లేవీ 18:5 అని వ్రాశాడు. 6అయితే విశ్వాసం ద్వారా వచ్చే నీతి ఇలా చెప్తుంది: “క్రీస్తును క్రిందకు తేవడానికే ‘పరలోకంలోకి ఎవరు ఎక్కి వెళ్తారు?’ అని మీ హృదయంలో అనుకోవద్దు.”#10:6 ద్వితీ 30:12 7“లేదా ‘క్రీస్తును మృతులలో నుండి పైకి తేవడానికే అగాధం లోనికి ఎవరు దిగి వెళ్తారు?’ ”#10:7 ద్వితీ 30:13 అని మీ హృదయాల్లో అనుకోవద్దు. 8అయితే ఇది ఏమి చెప్తుంది? “వాక్యం మీకు దగ్గరగా ఉంది, అది మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.”#10:8 ద్వితీ 30:14 అది మేము ప్రకటిస్తున్న విశ్వాస వాక్యమే. 9మీరు మీ నోటితో “యేసు ప్రభువు” అని ఒప్పుకుని, మీ హృదయాల్లో “దేవుడు ఆయనను మరణం నుండి లేపాడు” అని నమ్మితే మీరు రక్షించబడతారు. 10అంటే, మీరు మీ హృదయంలో నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు మీ నోటితో మీ విశ్వాసాన్ని ఒప్పుకున్నప్పుడు రక్షించబడతారు. 11“ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు”#10:11 యెషయా 28:16 అని లేఖనం చెప్తుంది. 12యూదులకు, యూదేతరులకు భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఆయనకు మొరపెట్టిన వారందరిని ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. 13ఎందుకంటే, “ప్రభువు పేరట మొరపెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు.”#10:13 యోవేలు 2:32
14అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిని ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు? 15ప్రకటించేవారిని పంపకపోతే ఎలా ప్రకటించగలరు? దీని గురించి, “సువార్తను తెచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి!”#10:15 యెషయా 52:7 అని వ్రాయబడి ఉంది.
16అయితే, “ప్రభువా, మా సందేశాన్ని ఎవరు నమ్ముతారు?”#10:16 యెషయా 53:1 అని యెషయా చెప్పిన ప్రకారం, సువార్తను ఇశ్రాయేలు ప్రజలందరూ అంగీకరించలేదు. 17కాబట్టి, సువార్తను వినడం వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తును గురించిన వాక్యం ద్వారా సువార్తను వినగలరు. 18కాని నేనడిగేదేంటంటే: వారు సువార్తను వినలేదా? వారు ఖచ్చితంగా విన్నారు:
“వారి స్వరం భూలోకమంతా వినబడింది,
వారి మాటలు భూదిగంతాల వరకు వ్యాపించాయి.”#10:18 కీర్తన 19:4
19నేను మళ్ళీ అడుగుతున్నా: ఇశ్రాయేలు ప్రజలు దానిని గ్రహించలేదా? మొదట మోషే ఇలా అన్నాడు,
“జనులు కాని వారిచేత నేను మిమ్మల్ని అసూయపడేలా చేస్తాను,
అవగాహన లేని జనుల వలన మీకు కోపం వచ్చేలా చేస్తాను.”#10:19 ద్వితీ 32:21
20యెషయా ఇలా ధైర్యంగా చెప్పాడు,
“నన్ను వెదకనివారికి నేను దొరికాను,
నన్ను అడగని వారికి నన్ను నేను బయలుపరచుకున్నాను.”#10:20 యెషయా 65:1
21అయితే ఇశ్రాయేలు ప్రజల గురించి అతడు ఇలా చెప్పాడు,
“అవిధేయులు మూర్ఖులైన ప్రజలకు
నేను దినమంతా నా చేతులు చాపాను.”#10:21 యెషయా 65:2
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
రోమా పత్రిక 10: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.