1 రాజులు 20
20
సమరయ మీద బెన్-హదదు దాడి
1తర్వాత అరాము రాజైన బెన్-హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకున్నాడు. అతనితో ముప్పై రెండు మంది రాజులు తమ గుర్రాలు రథాలతో ఉన్నారు. అతడు వచ్చి సమరయను ముట్టడించి దాడి చేశాడు. 2-3అతడు పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరకు దూతలను పంపి, “బెన్-హదదు చెప్పేది ఇదే: ‘నీ వెండి బంగారాలు నావే, నీ భార్యల్లో నీ పిల్లల్లో ఉత్తమమైన వారు నా వారే’ ” అని కబురు పంపాడు.
4అందుకు ఇశ్రాయేలు రాజు, “నా ప్రభువా, రాజా, మీరు చెప్పినట్టే నేనూ, నాకు కలిగినదంతా మీ వశంలో ఉన్నాం” అని జవాబిచ్చాడు.
5తర్వాత బెన్-హదదు దూతలు తిరిగివచ్చి ఇలా చెప్పారు: “బెన్-హదదు చెప్పేదేంటంటే, ‘నీ వెండిని, నీ బంగారాన్ని, నీ భార్యలను, నీ పిల్లలను నా స్వాధీనం చేయాలని నేను కబురు పంపాను. 6అయితే రేపు ఇదే వేళకు, నా సేవకులను నీ దగ్గరకు పంపిస్తాను. వారు నీ రాజభవనాన్ని, నీ అధికారుల ఇళ్ళను వెదుకుతారు, నీకు విలువైన ప్రతిదాన్ని వారు తీసుకెళ్తారు.’ ”
7అప్పుడు ఇశ్రాయేలు రాజు ఆ దేశంలోని పెద్దలందరినీ పిలిపించి వారితో అన్నాడు, “ఈ మనిషి ఎలా కీడును తలపట్టాడో చూడండి! నా భార్యలు, నా పిల్లలు, నా వెండి బంగారాలు కావాలంటూ నాకు కబురు పంపినప్పుడు, నేను కాదనలేదు.”
8పెద్దలు, ప్రజలు అందరు, “మీరు అతని మాట వినకండి, అతడు అడిగిన వాటికి ఒప్పుకోకండి” అని అన్నారు.
9కాబట్టి అతడు బెన్-హదదు యొక్క దూతలతో ఇలా అన్నాడు, “నా ప్రభువా, రాజుతో చెప్పండి, ‘మీ సేవకుడనైన నాకు మీరు మొదట చెప్పిన మాట ప్రకారం చేస్తాను. కాని, ఈసారి మీరు కోరినట్టు నేను చేయలేను.’ ” వారు వెళ్లి బెన్-హదదుతో ఆ వార్త చెప్పారు.
10అప్పుడు బెన్-హదదు అహాబుకు ఇంకొక వార్త పంపాడు: “నా సైనికుల్లో ప్రతి ఒకరు తీసుకెళ్లడానికి సమరయలో పిడికెడు ధూళి మిగిలితే, దేవుళ్ళు నన్ను ఇంతగా, ఇంతకంటే తీవ్రంగా శిక్షించును గాక.”
11అందుకు ఇశ్రాయేలు రాజు అన్నాడు, “అతనికి చెప్పండి: ‘యుద్ధానికి ఆయుధాలు ధరించినవాడు, యుద్ధం తర్వాత వాటిని తీసివేసే వానిలా అతిశయించకూడదు.’ ”
12ఈ వార్త వచ్చినప్పుడు బెన్-హదదు, అతనితో ఉన్న రాజులు తమ గుడారాల్లో#20:12 లేదా సుక్కోతు; 16 వచనంలో కూడా త్రాగుతూ ఉన్నారు. అతడు తన మనుష్యులతో, “దాడికి సిద్ధపడండి” అని ఆదేశించాడు. కాబట్టి వారు పట్టణం మీద దాడి చేయడానికి సిద్ధపడ్డారు.
అహాబు బెన్-హదదును ఓడించుట
13ఈలోగా, ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరకు ఒక ప్రవక్త వచ్చి, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘ఈ గొప్ప సైన్యాన్ని చూస్తున్నావా? దానిని ఈ రోజు నీ చేతికి అప్పగిస్తాను, అప్పుడు యెహోవాను నేనని నీవు తెలుసుకుంటావు’ ” అని ప్రకటించాడు.
14“కాని ఇది ఎవరు చేస్తారు?” అని అహాబు అడిగాడు.
అందుకు ప్రవక్త అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు చేస్తారు.’ ”
“ఎవరు యుద్ధం ఆరంభిస్తారు?” అని అహాబు అడిగాడు.
“నీవే” అని ప్రవక్త జవాబిచ్చాడు.
15కాబట్టి అహాబు ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే 232 యువ అధికారులను పిలిపించాడు. తర్వాత అతడు మిగితా ఇశ్రాయేలీయులను, మొత్తం 7,000 మందిని సమకూర్చాడు. 16మధ్యాహ్నం వారు బయలుదేరి వెళ్లారు, అప్పుడు బెన్-హదదు, అతనికి అండగా వచ్చిన ఆ ముప్పై రెండు మంది రాజులు గుడారాల్లో త్రాగుతూ మత్తులో ఉన్నారు. 17ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు మొదట బయటకు వెళ్లారు.
బెన్-హదదు కొందరు సైనికులను పంపించినప్పుడు వారు, “సమరయ నుండి మనుష్యులు ఎదురుగా వస్తున్నారు” అని చెప్పారు.
18అందుకతడు అన్నాడు, “వారు సమాధానం కోరి వస్తే ప్రాణాలతో వారిని పట్టుకోండి; వారు యుద్ధానికి వస్తే, ప్రాణాలతో వారిని పట్టుకోండి.”
19ప్రాంతీయ అధికారుల దగ్గర పని చేసే యువ అధికారులు, పట్టణం బయటకు వెళ్లారు, సైన్యం వారి వెనుక వెళ్లింది. 20ప్రతి ఒకడు తన ప్రత్యర్థిని కూలగొట్టాడు. అకస్మాత్తుగా ఇశ్రాయేలీయులు తరుముతూ ఉంటే, అరామీయులు పారిపోయారు. అరాము రాజైన బెన్-హదదు గుర్రమెక్కి కొంతమంది రౌతులతో పాటు తప్పించుకున్నాడు. 21అప్పుడు ఇశ్రాయేలు రాజు నగరం నుండి వెళ్లి గుర్రాలను, రథాలను స్వాధీనం చేసుకుని, అరామీయులను చాలామందిని హతం చేశాడు.
22తర్వాత ఇశ్రాయేలు రాజు దగ్గరకు ఆ ప్రవక్త వచ్చి అన్నాడు, “ధైర్యం తెచ్చుకుని నీవు ఏం చేయాలో నిర్ణయించుకో, ఎందుకంటే, వచ్చే వసంతకాలంలో అరాము రాజు మళ్ళీ నీ మీద దాడి చేస్తాడు.”
23ఇంతలో అరాము రాజు పరివారం అతనితో, “ఇశ్రాయేలు దేవుళ్ళు కొండల దేవుళ్ళు. అందుకే వారు మనకంటే బలంగా ఉన్నారు. కాని మనం సమతల మైదాన ప్రాంతంలో వారితో పోరాడితే మనం తప్పనిసరిగా గెలుస్తాము. 24ఇలా చేయండి: రాజులందరినీ తొలగించి వారికి బదులు అధిపతులను నియమించండి. 25మీరు పోగొట్టుకున్న సైన్యంలాంటి మరో సైన్యాన్ని సమకూర్చండి అంటే గుర్రానికి గుర్రం, రథానికి రథం. తద్వారా ఇశ్రాయేలుతో మైదాన ప్రాంతంలో యుద్ధం చేయవచ్చు. అప్పుడు మనం వారిపై గెలుస్తాం” అని చెప్పారు. అతడు వారి సలహా అంగీకరించి అల చేశాడు.
26మరుసటి వసంతకాలంలో, బెన్-హదదు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి అరాము సైన్యాన్ని పోగుచేసి, ఆఫెకు ప్రాంతానికి వెళ్లాడు. 27ఇశ్రాయేలీయులు కూడా తమ సైన్యాన్ని పోగుచేసుకుని సామాగ్రి పొందుకున్నప్పుడు, వారిని ఎదుర్కోడానికి వెళ్లారు. ఇశ్రాయేలీయులు రెండు చిన్న మేకల మందలా వారికి ఎదురుగా బస చేశారు, మరోవైపు అరామీయులు గ్రామీణ ప్రాంతాల్లో నిండి ఉన్నారు.
28దైవజనుడు ఒకడు ఇశ్రాయేలు రాజు దగ్గరకు వచ్చి అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెహోవా కొండ దేవుడే గాని లోయ దేవుడు కాదని అరామీయులు అనుకుంటున్నారు కాబట్టి, ఈ గొప్ప సైన్యాన్ని మీ చేతికి అప్పగిస్తాను, అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
29వారు ఏడు రోజులు ఎదురెదురుగా గుడారాలు వేసుకుని ఉన్నారు, ఏడవ రోజున యుద్ధం ఆరంభమైంది. ఆ ఒక్క రోజున ఇశ్రాయేలీయులు అరాము కాల్బలంలో లక్ష మందికి ప్రాణనష్టం కలిగించారు. 30మిగతావారు ఆఫెకు పట్టణముకు పారిపోయారు, వారిలో ఇరవై ఏడు వేలమంది మీద ప్రాకారం కూలింది. బెన్-హదదు పట్టణానికి పారిపోయి లోపలి గదిలో చొరబడ్డాడు.
31అతని అధికారులు అతనితో అన్నారు, “చూడండి, ఇశ్రాయేలు రాజులు దయ గలవారని విన్నాము. ఇప్పుడు మేము నడుముకు గోనెపట్ట కట్టుకుని, తల చుట్టూ త్రాళ్లు వేసుకుని, ఇశ్రాయేలు రాజు దగ్గరకు వెళ్తాము. బహుశ అతడు మిమ్మల్ని బ్రతుకనీయవచ్చు.”
32వారు నడుముకు గోనెపట్ట కట్టుకుని, తలమీద త్రాళ్లు వేసుకుని, ఇశ్రాయేలు రాజు దగ్గరకు వెళ్లి అన్నారు, “మీ సేవకుడైన బెన్-హదదు ఇలా చెప్తున్నాడు: ‘దయచేసి నన్ను బ్రతకనివ్వండి.’ ”
రాజు జవాబిస్తూ, “అతడు ఇంకా ప్రాణంతో ఉన్నాడా? అతడు నా సోదరుడు” అని అన్నాడు.
33ఆ మనుష్యులు దీనిని మంచి సూచనగా తీసుకుని, అతని మాటను త్వరగా అందుకున్నారు. “అవును, బెన్-హదదు మీ సోదరుడు” అని వారు అన్నారు.
అప్పుడు రాజు, “మీరు వెళ్లి అతన్ని తీసుకురండి” అన్నాడు. బెన్-హదదు బయటకు వచ్చినప్పుడు, అహాబు అతన్ని తన రథంలో ఎక్కించుకున్నాడు.
34అప్పుడు బెన్-హదదు, “మీ తండ్రి నుండి నా తండ్రి తీసుకున్న పట్టణాలను మీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి సమరయలో చేసినట్టుగా మీరు దమస్కులో మీ సొంత వ్వాపార కేంద్రాలు ఏర్పరచుకోవచ్చు” అని అన్నాడు.
అందుకు అహాబు, “ఈ ఒప్పందం మీద నేను నిన్ను విడుదల చేస్తాను” అని అన్నాడు. కాబట్టి అతడు ఒప్పందం చేసుకుని అతన్ని పంపించాడు.
ప్రవక్త అహాబును ఖండించుట
35యెహోవా మాటచేత, ప్రవక్త బృందంలో ఒకడు తన తోటి ప్రవక్తతో, “నీ ఆయుధంతో నన్ను కొట్టు” అన్నాడు, కాని అతడు నిరాకరించాడు.
36కాబట్టి ప్రవక్త అన్నాడు, “నీవు యెహోవాకు లోబడలేదు కాబట్టి నన్ను విడిచి వెళ్లిన వెంటనే సింహం నిన్ను చంపుతుంది.” ఆ మనిషి వెళ్లిన తర్వాత ఒక సింహం అతనిపై దాడి చేసి అతన్ని చంపింది.
37ఆ ప్రవక్త మరొకరి కనుగొని అతనితో, “దయచేసి నన్ను కొట్టు” అన్నాడు. ఆ మనిషి అతని కొట్టి గాయపరచాడు. 38అప్పుడు ఆ ప్రవక్త వెళ్లి, దారి ప్రక్కన నిలబడి, రాజు కోసం ఎదురుచూశాడు. అతడు తన కళ్లకు గుడ్డ కట్టుకుని మారువేషం వేసుకున్నాడు. 39రాజు దారిన వెళ్తుండగా, ప్రవక్త రాజును పిలిచి, “మీ సేవకుడనైన నేను యుద్ధం మధ్యలోకి వెళ్లాను. అక్కడ ఒకడు ఒక బందీని తీసుకుని నా దగ్గరకు వచ్చి, ‘ఈ వ్యక్తిని చూసుకోండి. ఒకవేళ అతడు తప్పిపోతే, వాడి ప్రాణానికి బదులుగా నీ ప్రాణం పెట్టాలి. లేదా నీవు ఒక తలాంతు#20:39 అంటే, 34 కి. గ్రా. లు వెండి ఇవ్వాలి’ అని చెప్పాడు. 40మీ సేవకుడు అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉన్నప్పుడు, వాడు కనిపించకుండా పోయాడు” అని చెప్పాడు.
ఇశ్రాయేలు రాజు అతనితో, “అది నీ తప్పు, నీ మీదికి నీవే తీర్పు తెచ్చుకున్నావు” అన్నాడు.
41అప్పుడు ప్రవక్త తన కళ్లకు కట్టుకున్న గుడ్డ త్వరగా తీసివేశాడు, అతడు ప్రవక్తల్లో ఒకడని ఇశ్రాయేలు రాజు అతన్ని గుర్తించాడు. 42ప్రవక్త రాజుతో అన్నాడు, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘చంపబడాలని నేను నిశ్చయించిన మనిషిని నీవు వెళ్లిపోనిచ్చావు. కాబట్టి అతని ప్రాణానికి నీ ప్రాణం, అతని ప్రజలకు బదులు నీ ప్రజలను అర్పిస్తావు.’ ” 43ఇశ్రాయేలు రాజు విచారంతో, కోపంతో సమరయలో ఉన్న తన భవనానికి వెళ్లిపోయాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 20: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.