1 రాజులు 21
21
నాబోతు ద్రాక్షతోట
1కొంతకాలం తర్వాత, యెజ్రెయేలు వాడైన నాబోతుకు చెందిన ద్రాక్షతోటకు సంబంధించి ఒక సంఘటన జరిగింది. యెజ్రెయేలులో సమరయ రాజైన అహాబు భవనానికి సమీపంగా ఒక ద్రాక్షతోట ఉంది. 2అహాబు నాబోతుతో, “నీ ద్రాక్షతోట నా భవనానికి దగ్గర ఉంది కాబట్టి, నీ ద్రాక్షతోటను నాకు ఇవ్వు, నేను దానిని కూరగాయల తోటగా వాడుకుంటాను. దానికి బదులుగా, నీ తోట కంటే ఇంకా మంచి ద్రాక్షతోటను నీకు ఇస్తాను, లేదా నీకిష్టమైతే దానికి తగిన వెల చెల్లిస్తాను” అన్నాడు.
3అందుకు నాబోతు అహాబుతో, “నా పూర్వికుల వారసత్వాన్ని మీకు ఇవ్వకుండ యెహోవా తప్పించును గాక” అని అన్నాడు.
4యెజ్రెయేలీయుడైన నాబోతు, “నా పూర్వికుల వారసత్వాన్ని నేను మీకు ఇవ్వను” అని చెప్పడంతో అహాబు విచారంతో, కోపంతో తన భవనానికి వెళ్లిపోయాడు. అతడు ముఖం మాడ్చుకుని ఏమీ తినకుండ తన పరుపు మీద పడుకున్నాడు.
5అతని భార్య యెజెబెలు అతని దగ్గరకు వచ్చి, “ఎందుకు నీవు విచారంగా ఉన్నావు? ఎందుకు నీవు తినట్లేదు?” అని అడిగింది.
6అందుకతడు, “నేను యెజ్రెయేలీయుడైన నాబోతుతో, ‘నీ ద్రాక్షతోటను నాకు వెండికి అమ్ము; లేదా నీకిష్టమైతే నీ తోటకు బదులుగా నేను నీకు ఇంకొక తోట ఇస్తాను’ అని అన్నాను. కాని అతడు, ‘నా ద్రాక్షతోట మీకివ్వను’ అన్నాడు” అని చెప్పాడు.
7అతని భార్య యెజెబెలు, “నీవు ఇశ్రాయేలుకు రాజువు కావా? లేచి తిను! సంతోషంగా ఉండు. ఆ యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను నేనే నీకు ఇప్పిస్తాను” అన్నది.
8కాబట్టి ఆమె అహాబు పేరున ఉత్తర్వులు వ్రాసి వాటి మీద అతని ముద్రను ముద్రించి, వాటిని నాబోతు నివసించే పట్టణ పెద్దలకు, సంస్థానాధిపతులకు శాసనాలు పంపింది. 9ఆ ఉత్తర్వులలో ఆమె ఇలా వ్రాసింది:
“ఉపవాస దినం ఒకటి ప్రకటించి నాబోతును ప్రజలమధ్య ప్రముఖ స్థానంలో కూర్చోబెట్టండి. 10అయితే అతనికి ఎదురుగా ఇద్దరు దుర్మార్గులను కూర్చోబెట్టి అతడు దేవున్ని రాజును శపించాడని వారితో నేరారోపణ చేయించండి. తర్వాత అతన్ని బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపండి.”
11యెజెబెలు తమకు పంపిన ఆ ఉత్తర్వులలో వ్రాసిన దాని ప్రకారం నాబోతు పట్టణంలో ఉన్న పెద్దలు, సంస్థానాధిపతులు చేశారు. 12వారు ఉపవాసం ప్రకటించి నాబోతును ప్రజల ఎదుట ప్రముఖ స్థలంలో కూర్చోబెట్టారు. 13అప్పుడు ఇద్దరు దుర్మార్గులు వచ్చి అతనికి ఎదురుగా కూర్చుని ప్రజల ముందు, “నాబోతు దేవున్ని రాజును శపించాడు” అని అంటూ నాబోతు మీద నేరం మోపారు. కాబట్టి వారు అతన్ని పట్టణం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. 14“నాబోతు రాళ్లతో కొట్టబడి చనిపోయాడు” అని యెజెబెలుకు వారు కబురు పంపారు.
15నాబోతును రాళ్లతో కొట్టి చంపిన సంగతి యెజెబెలు తెలుసుకొని అహాబుతో, “లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు వెండికి కూడా నీకు అమ్మనని చెప్పిన ద్రాక్షతోటను నీ వశం చేసుకో! నాబోతు ఇక ప్రాణంతో లేడు, చనిపోయాడు” అని చెప్పింది. 16నాబోతు చనిపోయాడని అహాబు వినగానే, యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను వశం చేసుకోవడానికి అతడు లేచి వెళ్లాడు.
17అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు వచ్చింది: 18“సమరయలో పరిపాలిస్తున్న ఇశ్రాయేలు రాజైన అహాబును వెళ్లి కలుసుకో. ఇప్పుడతడు నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు, దానిని వశం చేసుకోవడానికి అతడు వెళ్లాడు. 19అతనితో చెప్పు, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నీవు ఒక మనుష్యుని హత్య చేసి అతని ఆస్తిని ఆక్రమించలేదా? యెహోవా చెప్పే మాట ఇదే: ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో, ఆ స్థలంలోనే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి.’ ”
20అహాబు ఏలీయాతో, “నా శత్రువా, నీవు నన్ను పట్టుకున్నావు కదా!” అన్నాడు.
అందుకతడు, “నేను నిన్ను పట్టుకున్నాను, ఎందుకంటే యెహోవా దృష్టికి చెడు చేయడానికి నిన్ను నీవే అమ్ముకున్నావు అన్నాడు. 21ఆయన, ‘నేను నీ మీదికి విపత్తును తీసుకురాబోతున్నాను. నీ సంతానాన్ని తుడిచివేస్తాను. ఇశ్రాయేలులో బానిసలు స్వతంత్రులు అని లేకుండా అహాబు వంశంలోని మగవారినందరిని నిర్మూలం చేస్తాను. 22నీ వంశాన్ని నెబాతు కుమారుడైన యరొబాము వంశంలా, అహీయా కుమారుడైన బయెషా వంశంలా చేస్తాను, ఎందుకంటే నీవు నాకు కోపం రేపావు, ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమయ్యావు’ అని అన్నారు.
23“అంతేకాక యెజెబెలు గురించి యెహోవా ఇలా చెప్తున్నారు: ‘యెజ్రెయేలు ప్రాకారం దగ్గరే యెజెబెలును కుక్కలు తింటాయి.’
24“అహాబుకు చెందిన వారిలో పట్టణంలో చనిపోయేవారిని కుక్కలు తింటాయి, దేశంలో చనిపోయేవారిని పక్షులు తింటాయి.”
25(తన భార్య యెజెబెలు ప్రేరేపణకు లొంగిపోయి యెహోవా దృష్టిలో చెడు చేయడానికి తనను తానే అమ్ముకున్న అహాబులాంటి వారు ముందెన్నడూ ఎవ్వడూ లేరు. 26అహాబు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించేవాడు, ఇశ్రాయేలు ముందు నుండి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల్లా అతడు చేశాడు.)
27అహాబు ఆ మాటలు విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నాడు. గోనెపట్ట మీదే పడుకుంటూ దీనంగా తిరిగాడు.
28అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు వచ్చింది: 29“అహాబు నా ఎదుట ఎలా తగ్గించుకున్నాడో గమనించావా? అతడు తనను తాను తగ్గించుకున్నందుకు అతని జీవితకాలంలో ఈ విపత్తును తీసుకురాను, కాని అతని వంశం మీద తన కుమారుని కాలంలో దానిని తెస్తాను.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 రాజులు 21: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.