1 రాజులు 22

22
మీకాయా అహాబుకు వ్యతిరేకంగా ప్రవచించుట
1అరాము, ఇశ్రాయేలు మధ్య మూడు సంవత్సరాలు యుద్ధం జరగలేదు. 2మూడవ సంవత్సరంలో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబును సందర్శించడానికి వెళ్లాడు. 3ఇశ్రాయేలు రాజు తన అధికారులతో, “రామోత్ గిలాదు మనదే అయినప్పటికీ దానిని అరాము రాజు చేతిలో నుండి తిరిగి తీసుకోవడానికి మనం ఏ ప్రయత్నం చేయడం లేదని మీకు తెలీదా?” అని అన్నాడు.
4కాబట్టి అతడు యెహోషాపాతును, “నాతో కూడా రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వస్తావా?” అని అడిగాడు.
అందుకు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, “నేను మీవాన్ని, నా ప్రజలు మీ ప్రజలు, నా గుర్రాలు మీ గుర్రాలు” అన్నాడు. 5అయితే యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, “మొదట యెహోవా సలహాను తీసుకుందాం” అని కూడా అన్నాడు.
6కాబట్టి ఇశ్రాయేలు రాజు సుమారు నాలుగువందలమంది ప్రవక్తలను పిలిపించి, “నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా? లేదా వెళ్లొద్దా?” అని వారిని అడిగాడు.
“వెళ్లండి! దానిని యెహోవా రాజు వశం చేస్తారు” అని వారు జవాబిచ్చారు.
7అయితే యెహోషాపాతు, “మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త ఒక్కడు కూడా ఇక్కడ లేడా?” అని అడిగాడు.
8అందుకు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “ఇంకొక ప్రవక్త ఉన్నాడు, అతని ద్వారా యెహోవా దగ్గర విచారణ చేయవచ్చు. కాని, నాకు అతడంటే అయిష్టం, ఎందుకంటే అతడు నా గురించి ఎప్పుడూ మంచిని ప్రవచించడు, ఎప్పుడూ చెడ్డగానే ప్రవచిస్తాడు. అతడు ఇమ్లా కుమారుడైన మీకాయా” అని చెప్పాడు.
అందుకు యెహోషాపాతు, “రాజా, మీరు అలా అనవద్దు” అన్నాడు.
9అప్పుడు ఇశ్రాయేలు రాజు తన అధికారులలో ఒకరిని పిలిచి, “వెంటనే వెళ్లి ఇమ్లా కుమారుడైన మీకాయాను తీసుకురా” అని చెప్పాడు.
10ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రాజవస్త్రాలు ధరించుకొని సమరయ నగర ద్వారం దగ్గర ఉన్న నూర్పిడి కళ్ళం దగ్గరలో ప్రవక్తలంతా ప్రవచిస్తూ ఉండగా, తమ సింహాసనాల మీద ఆసీనులై ఉన్నారు. 11అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేసుకుని వచ్చి, “యెహోవా చెప్పే మాట ఇదే; ‘అరామీయులు నాశనమయ్యే వరకు మీరు వీటితో వారిని పొడుస్తారు’ ” అని చెప్పాడు.
12ఇతర ప్రవక్తలంతా కూడా అదే విషయాన్ని ప్రవచించారు. “రామోత్ గిలాదు మీద దాడి చేయండి విజయం పొందండి, ఎందుకంటే యెహోవా దాన్ని రాజు చేతికి అప్పగిస్తారు” అని వారన్నారు.
13మీకాయాను పిలువడానికి వెళ్లిన దూత మీకాయాతో, “చూడు, ఇతర ప్రవక్తలందరు రాజుకు విజయం కలుగుతుందని చెప్తున్నారు. వారి మాటతో నీ మాట ఏకమై, అనుకూలంగా పలుకాలి” అన్నాడు.
14అయితే మీకాయా, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, యెహోవా నాకు చెప్పేది మాత్రమే నేను అతనికి చెప్పగలను” అని అన్నాడు.
15అతడు వచ్చినప్పుడు రాజు అతన్ని, “మీకాయా, మేము రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా, లేదా?” అని అడిగాడు.
అందుకతడు, “దాడి చేయండి, విజయం పొందండి, ఎందుకంటే యెహోవా దానిని రాజు చేతికి అప్పగిస్తారు” అని జవాబిచ్చాడు.
16రాజు అతనితో, “యెహోవా పేరిట నాకు సత్యమే చెప్పమని నేనెన్నిసార్లు నీ చేత ప్రమాణం చేయించాలి?” అని అన్నాడు.
17అప్పుడు మీకాయా జవాబిస్తూ, “ఇశ్రాయేలీయులందరు కాపరి లేని గొర్రెల్లా కొండలమీద చెదిరిపోయినట్లు దర్శనం చూశాను. ‘ఈ ప్రజలకు యజమాని లేడు. ప్రతి ఒక్కరు సమాధానంగా ఇంటికి వెళ్లాలి’ అని యెహోవా చెప్తున్నారు” అన్నాడు.
18ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “నా గురించి ఇతడు ఎన్నడు మంచిని ప్రవచించడు, చెడు మాత్రమే ప్రవచిస్తాడు అని మీతో చెప్పలేదా?” అని అన్నాడు.
19మీకాయా ఇంకా ఇలా అన్నాడు, “కాబట్టి యెహోవా మాట వినండి: యెహోవా తన సింహాసనంపై కూర్చుని ఉండగా తన చుట్టూ తన కుడి ఎడమలు పరలోక సమూహాలన్ని నిలబడి ఉండడం నేను చూశాను. 20అప్పుడు యెహోవా, ‘అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్లి అక్కడ చచ్చేలా అతన్ని ఎవరు ప్రలోభపెడతారు?’ అని అడిగారు.
“ఒకడు ఒక విధంగా ఇంకొకడు ఇంకొక విధంగా చెప్పారు. 21చివరికి ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా సమక్షంలో నిలబడి, ‘నేను అతన్ని ప్రలోభపెడతాను’ అన్నాడు.
22“ ‘ఎలా?’ అని యెహోవా అడిగారు.
“ ‘నేను వెళ్లి అతని ప్రవక్తలందరి నోట మోసగించే ఆత్మగా ఉంటాను’ అని అతడు చెప్పాడు.
“అందుకు యెహోవా, ‘నీవు అతన్ని ప్రలోభపెట్టడంలో విజయం సాధిస్తావు. వెళ్లు అలాగే చేయి’ అన్నారు.
23“కాబట్టి యెహోవా నీ ఈ ప్రవక్తలందరి నోట మోసపరచే ఆత్మను ఉంచారు. యెహోవా ఈ విపత్తును నీకోసం నిర్ణయించారు.”
24అప్పుడు కెనాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టాడు. “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా నుండి వెళ్లినప్పుడు ఏ మార్గాన వెళ్లాడు?” అని అతడు అడిగాడు.
25మీకాయా జవాబిస్తూ, “నీవు దాక్కోడానికి లోపలి గదిలోకి చొరబడే రోజున నీవు తెలుసుకుంటావు” అన్నాడు.
26అప్పుడు ఇశ్రాయేలు రాజు, “మీకాయాను నగర పాలకుడైన ఆమోను దగ్గరకు, అలాగే రాకుమారుడైన యోవాషు దగ్గరకు తీసుకెళ్లి, 27వారితో ఇలా చెప్పండి, ‘రాజు ఇలా అన్నారు: నేను క్షేమంగా తిరిగి వచ్చేవరకు, ఇతన్ని చెరసాలలో ఉంచి అతనికి రొట్టె, నీరు తప్ప ఏమి ఇవ్వకండి’ ” అని ఆదేశించాడు.
28మీకాయా, “ఒకవేళ మీరు క్షేమంగా వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడలేదని అర్థం. ప్రజలారా, మీరంతా నా మాట గుర్తు పెట్టుకోండి!” అని ప్రకటించాడు.
రామోత్ గిలాదు దగ్గర అహాబు చంపబడుట
29కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్ గిలాదు మీదికి వెళ్లారు. 30ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “యుద్ధంలో ప్రవేశించేటప్పుడు నేను మారువేషంలో యుద్ధానికి వెళ్తాను, మీరు మాత్రం మీ రాజవస్త్రాలు ధరించుకోండి” అని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు మారువేషంలో యుద్ధానికి వెళ్లాడు.
31సిరియా రాజు తన ముప్పై రెండు మంది రథాధిపతులకు, “మీరు ఇశ్రాయేలు రాజు ఒక్కనితో తప్ప, చిన్నవారితో గాని గొప్పవారితో గాని యుద్ధం చేయకూడదు” అని ఆదేశించాడు. 32అయితే ఆ రథాధిపతులు యెహోషాపాతును చూసి, “ఖచ్చితంగా ఇతడే ఇశ్రాయేలు రాజు” అనుకుని, అతనిపై దాడి చేయడానికి అతని మీదికి రాగా యెహోషాపాతు బిగ్గరగా కేక వేసినప్పుడు, 33అతడు ఇశ్రాయేలు రాజు కాడని రథాధిపతులు తెలుసుకొని అతన్ని తరమడం ఆపివేశారు.
34అయితే ఒకడు విల్లెక్కుపెట్టి గురి చూడకుండ బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజుకు కవచం అతుకు మధ్యలో గుచ్చుకుంది. రాజు తన రథసారధితో, “రథం వెనుకకు త్రిప్పి నన్ను యుద్ధం నుండి బయటకు తీసుకెళ్లు, నేను గాయపడ్డాను” అని అన్నాడు. 35ఆ రోజంతా హోరాహోరీగా యుద్ధం జరిగింది, రాజు అరామీయులకు ఎదురుగా తన రథం మీద ఉన్నాడు. అతని గాయం నుండి కారిన రక్తం రథం అడుగు భాగానికి చేరింది. ఆ సాయంకాలం అతడు చనిపోయాడు. 36సూర్యాస్తమయం అవుతున్నప్పుడు, “ప్రతి ఒక్కరు తన పట్టణానికి వెళ్లాలి, ప్రతి ఒక్కడు తన దేశానికి వెళ్లాలి!” అనే వార్త సైన్యమంతా వ్యాపించింది.
37అలా రాజు చనిపోయాడు. వారు అతన్ని సమరయకు తీసుకువచ్చి అక్కడే అతన్ని సమాధి చేశారు. 38వారు సమరయలో ఒక చెరువు దగ్గర అతన్ని రథాన్ని కడిగారు (అక్కడ వేశ్యలు స్నానం చేసేవారు). యెహోవా చెప్పినట్లే కుక్కలు వచ్చి అతని రక్తం నాకాయి.
39అహాబు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా, దంతంతో అతడు కట్టించుకున్న భవనం గురించి, అతడు పటిష్టం చేసుకున్న పట్టణాల గురించి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 40అహాబు చనిపోయి తన పూర్వికుల దగ్గర చేరాడు. అతని తర్వాత అతని కుమారుడైన అహజ్యా రాజయ్యాడు.
యూదా రాజైన యెహోషాపాతు
41ఇశ్రాయేలు రాజైన అహాబు పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో ఆసా కుమారుడైన యెహోషాపాతు యూదాకు రాజయ్యాడు. 42యెహోషాపాతు యూదాకు రాజైనప్పుడు అతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కుమార్తె. 43ప్రతీ విషయంలో అతడు తన తండ్రి ఆసా విధానాలను అనుసరించాడు, వాటినుండి తొలగిపోలేదు; అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అయితే, క్షేత్రాలు తొలగించబడలేదు, ప్రజలు ఇంకా ఆ స్థలాల్లో బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ వచ్చారు. 44అంతేకాక యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి కలిగి ఉన్నాడు.
45యెహోషాపాతు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని విజయాలు, యుద్ధం విన్యాసాలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 46అతడు తన తండ్రి ఆసా పాలన తర్వాత కూడా అక్కడ మిగిలిపోయిన ఆలయాలలో ఉన్న పురుష వేశ్యలను దేశంలో నుండి తొలగించాడు. 47ఆ రోజుల్లో ఎదోము దేశానికి రాజు లేడు; ఒక ప్రాంతీయ అధికారి పరిపాలించేవాడు.
48యెహోషాపాతు బంగారం తెప్పించాలని ఓఫీరుకు వెళ్లడానికి తర్షీషు ఓడలను నిర్మించాడు కాని అవి సముద్రయానం చేయకుండానే ఎసోన్-గెబెరు దగ్గర బద్దలైపోయాయి. 49అప్పుడు అహాబు కుమారుడైన అహజ్యా యెహోషాపాతుతో, “నా మనుష్యులను మీ మనుష్యులతో పాటు ఓడలో ప్రయాణం చెయ్యనివ్వండి” అన్నాడు కాని యెహోషాపాతు ఒప్పుకోలేదు.
50తర్వాత యెహోషాపాతు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, తన తండ్రి దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన అహజ్యా
51యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని పదిహేడవ సంవత్సరంలో అహాబు కుమారుడైన అహజ్యా ఇశ్రాయేలు మీద సమరయలో రాజయ్యాడు. అతడు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పరిపాలించాడు. 52అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతడు తన తల్లిదండ్రుల విధానాలను ఇశ్రాయేలు పాపం చేయునట్లు చేసిన నెబాతు కుమారుడైన యరొబాము జీవిత విధానాలను అనుసరించాడు. 53అతడు బయలును సేవిస్తూ పూజిస్తూ, తన తండ్రిలా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 22: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి