1 సమూయేలు 16

16
సమూయేలు దావీదును అభిషేకించుట
1యెహోవా సమూయేలుతో, “ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలు గురించి నీవెంత కాలం దుఃఖపడతావు? నీ కొమ్మును నూనెతో నింపి నీవు బయలుదేరు; బేత్లెహేమీయుడైన యెష్షయి దగ్గరకు నేను నిన్ను పంపిస్తున్నాను. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా ఏర్పరచుకున్నాను” అన్నారు.
2అయితే సమూయేలు, “నేను ఎలా వెళ్లను? నేను వెళ్లిన సంగతి సౌలు వింటే అతడు నన్ను చంపేస్తాడు” అన్నాడు.
అందుకు యెహోవా, “నీతో పాటు ఒక లేగదూడను తీసుకెళ్లి, ‘యెహోవాకు బలివ్వడానికి వచ్చాను’ అని చెప్పు. 3ఆ బలికి యెష్షయిని రమ్మను, అప్పుడు నీవు ఏం చేయాలో నేను నీకు చెప్తాను. నేను సూచించే వాన్ని నీవు అభిషేకించాలి” అని చెప్పారు.
4యెహోవా చెప్పిన ప్రకారం సమూయేలు చేశాడు. అతడు బేత్లెహేముకు చేరుకున్నప్పుడు, ఆ పట్టణ పెద్దలు అతడు రావడం చూసి భయపడి, “సమాధానంగా వస్తున్నావా?” అని అడిగారు.
5అందుకు సమూయేలు, “అవును, సమాధానంగానే వచ్చాను, యెహోవాకు బలి అర్పించడానికి వచ్చాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నాతోకూడ బలి ఇవ్వడానికి రండి” అని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలివ్వడానికి వారిని పిలిచాడు.
6వారు వచ్చినప్పుడు సమూయేలు ఏలీయాబును చూసి, “ఖచ్చితంగా యెహోవా అభిషేకించినవాడు యెహోవా ఎదుట నిలబడ్డాడు” అనుకున్నాడు.
7అయితే యెహోవా సమూయేలుతో, “అతని రూపాన్ని ఎత్తును చూసి అలా అనుకోవద్దు, నేను అతన్ని తిరస్కరించాను. మనుష్యులు చూసే వాటిని యెహోవా చూడరు. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కాని యెహోవా హదృయాన్ని చూస్తారు” అన్నారు.
8యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, “యెహోవా ఇతన్ని ఎంచుకోలేదు” అన్నాడు. 9అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచాడు కాని సమూయేలు, “ఇతన్ని కూడా యెహోవా ఎంచుకోలేదు” అన్నాడు. 10అలా యెష్షయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, “యెహోవా వీరెవరిని ఎంచుకోలేదు” అని చెప్పి, 11నీ కుమారులంతా వీరేనా? అని యెష్షయిని అడిగాడు.
అందుకు యెష్షయి, ఇంకా చివరివాడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడని చెప్పాడు.
అందుకు సమూయేలు, “అతన్ని పిలిపించు; అతడు వచ్చేవరకు మనం భోజనం చేయము” అన్నాడు.
12కాబట్టి యెష్షయి అతన్ని పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు ఎర్రగా అందమైన కళ్లతో మంచి రూపంతో ఉన్నాడు.
అప్పుడు యెహోవా, “నేను ఎన్నుకున్నది ఇతన్నే, నీవు లేచి అతన్ని అభిషేకించు” అన్నారు.
13కాబట్టి సమూయేలు నూనె కొమ్మును తీసుకుని అతని సోదరుల ఎదుట అతన్ని అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చేది. ఆ తర్వాత సమూయేలు రామాకు వెళ్లిపోయాడు.
సౌలు సేవలో దావీదు
14యెహోవా ఆత్మ సౌలును విడిచివెళ్లి, యెహోవా దగ్గర నుండి వచ్చిన దురాత్మ#16:14 లేదా హానికరమైన 15, 16, 23 అతన్ని బాధించింది.
15అప్పుడు సౌలు సేవకులు, “యెహోవా దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను బాధిస్తుంది. 16మా ప్రభువైన నీవు నీ సేవకులకు ఆజ్ఞ ఇస్తే సితారా చక్కగా వాయించగల ఒకనిని వెదికి తీసుకువస్తాము. దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా వాయించడం వలన నీకు బాగవుతుంది” అన్నారు.
17కాబట్టి సౌలు తన సేవకులతో, “బాగా వాయించే వానిని వెదికి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.
18అప్పుడు సౌలు సేవకులలో ఒకడు, “బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారులలో ఒకనిని చూశాను. అతడు వీణ వాయిస్తాడు. అతడు ధైర్యవంతుడు యుద్ధవీరుడు వివేకం గలవాడు, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు” అని చెప్పాడు.
19సౌలు యెష్షయి దగ్గరకు దూతలను పంపి, “గొర్రెల దగ్గర ఉన్న నీ కుమారుడైన దావీదును నా దగ్గరకు పంపు” అని కబురు పంపాడు. 20అప్పుడు యెష్షయి ఒక గాడిద మీద రొట్టెలు ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను ఉంచి వాటిని తన కుమారుడైన దావీదుతో పాటు సౌలు దగ్గరకు పంపించాడు.
21దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా సౌలు అతన్ని చాలా ఇష్టపడ్డాడు. దావీదు సౌలు ఆయుధాలను మోసేవారిలో ఒకనిగా నియమించబడ్డాడు. 22తర్వాత సౌలు, “దావీదు అంటే నాకు ఇష్టం ఏర్పడింది కాబట్టి అతడు నా దగ్గర ఉండి సేవ చేయడానికి ఒప్పుకో” అని యెష్షయికి కబురు పంపాడు.
23దేవుని దగ్గర నుండి దురాత్మ సౌలు మీదికి వచ్చినప్పుడెల్లా దావీదు సితారా పట్టుకుని వాయించేవాడు, అప్పుడు దురాత్మ సౌలును విడిచివెళ్లి అతనికి నెమ్మది కలిగేది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 సమూయేలు 16: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి