1 సమూయేలు 17
17
దావీదు గొల్యాతు
1ఫిలిష్తీయులు తమ సైన్యాలను యుద్ధానికి సమకూర్చి యూదాలోని శోకోలో సమీకరించి ఎఫెస్-దమ్మీము దగ్గర శోకోకు అజేకాకు మధ్యన శిబిరం ఏర్పరచుకున్నారు. 2సౌలు ఇశ్రాయేలీయులు కలిసివచ్చి ఏలహు#17:2 ఏలహు అంటే సింధూర లోయలో శిబిరం ఏర్పరచుకొని ఫిలిష్తీయులకు ఎదురుగా పోరాడడానికి యుద్ధవరుసలు ఏర్పరచుకున్నారు. 3ఫిలిష్తీయులు ఒక కొండను, ఇశ్రాయేలీయులు మరొక కొండను ఆక్రమించుకున్నారు, వాటి మధ్య లోయ ఉంది.
4గాతుకు చెందిన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల శిబిరం నుండి బయలుదేరాడు. అతని ఎత్తు ఆరు మూరల ఒక జేన.#17:4 అంటే, సుమారు 9 అడుగుల 9 అంగుళాలు లేదా 3 మీటర్లు 5అతని తలమీద ఇత్తడి శిరస్త్రాణం ఉంది, అతడు 5,000 షెకెళ్ళ#17:5 అంటే, సుమారు 58 కి. గ్రా. లు బరువుగల ఇత్తడి యుద్ధకవచాన్ని ధరించాడు. 6అతని కాళ్లకు ఇత్తడి తొడుగు అతని వీపు మీద ఒక ఇత్తడి బల్లెం ఉన్నాయి. 7అతని ఈటె నేతపనివాని కర్రంత పెద్దది. అతని ఈటె కొనలో ఉన్న ఇనుము బరువు ఆరువందల షెకెళ్ళు.#17:7 అంటే, సుమారు 6.9 కి. గ్రా. లు అతని డాలు మోసేవాడు అతని ముందు నడుస్తున్నాడు.
8గొల్యాతు నిలబడి ఇశ్రాయేలీయుల సైన్యంతో, “మీరు వచ్చి యుద్ధం చేయడానికి ఎందుకు బారులు తీరి నిలబడ్డారు? నేను ఫిలిష్తీయుడను కానా మీరు సౌలు దాసులు కారా? మీ వైపు నుండి ఒకరిని ఎంచుకుని నాతో యుద్ధం చేయడానికి పంపండి. 9అతడు నాతో పోరాడి నన్ను చంపగలగితే మేము మీకు లోబడి ఉంటాం; కాని నేను అతన్ని జయించి చంపితే మీరు మాకు లోబడి మాకు సేవ చేయాలి” అన్నాడు. 10ఆ ఫిలిష్తీయుడు ఇంకా, “ఈ రోజు నేను ఇశ్రాయేలీయుల సైన్యానికి సవాలు విసురుతున్నాను. మీరు ఒకడిని పంపిస్తే మేమిద్దరం ఒకరితో ఒకరం పోరాడతాం” అన్నాడు. 11ఆ ఫిలిష్తీయుని మాటలు విని సౌలు ఇశ్రాయేలీయులందరు చాలా దిగులుపడి భయపడ్డారు.
12దావీదు యూదాలోని బేత్లెహేముకు చెందిన ఎఫ్రాతీయుడైన యెష్షయి కుమారుడు. యెష్షయికి ఎనిమిది మంది కుమారులు. సౌలు కాలంలో అతడు చాలా ముసలివాడు. 13యెష్షయి ముగ్గురు పెద్దకుమారులు సౌలుతో పాటు యుద్ధానికి వెళ్లారు. వారిలో మొదటివాడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా. 14దావీదు చివరివాడు. పెద్దవారైన ముగ్గురు సౌలుతో పాటు వెళ్లారు. 15అయితే దావీదు బేత్లెహేములో తన తండ్రి గొర్రెలు మేపడానికి, అలాగే సౌలు దగ్గరకు వెళ్లి వస్తుండేవాడు.
16ఆ ఫిలిష్తీయుడు నలభైరోజుల వరకు ప్రతి ఉదయం సాయంత్రం వచ్చి నిలబడేవాడు.
17యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, “నీ అన్నల కోసం ఒక ఏఫా#17:17 అంటే, సుమారు 16 కి. గ్రా. లు వేయించిన గోధుమలు, ఈ పది రొట్టెలను తీసుకుని శిబిరంలో ఉన్న నీ అన్నల దగ్గరకు తొందరగా వెళ్లు. 18అలాగే ఈ పది జున్నుముక్కలు తీసుకెళ్లి వారి సేనాధిపతికి ఇవ్వు. నీ అన్నల క్షేమాన్ని తెలుసుకొని రా. 19వారు సౌలుతో ఉన్నారు; ఇశ్రాయేలీయులందరు ఏలహు లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు” అని చెప్పి పంపించాడు.
20దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరికి గొర్రెలు అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకు చెప్పిన ప్రకారం బయలుదేరి వెళ్లాడు. అయితే అతడు యుద్ధభూమి దగ్గరకు వచ్చేసరికి సైన్యమంతా బారులు తీరి నినాదాలు చేస్తూ యుద్ధభూమికి వస్తున్నారు. 21ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులు ఒకరికి ఎదురుగా ఒకరు నిలబడి యుద్ధానికి సిద్ధపడుతున్నారు. 22దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాన్లు భద్రపరిచేవానికి అప్పగించి పరుగెత్తి వెళ్లి యుద్ధభూమిలో ఉన్న తన అన్నలను వారి క్షేమం అడిగాడు. 23అతడు వారితో మాట్లాడుతుండగా గాతుకు చెందిన ఫిలిష్తీయుడైన గొల్యాతు అనే శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి రోజు చేసినట్లే ఆ రోజు కూడా సవాలు చేస్తూ ఉండగా దావీదు విన్నాడు. 24ఇశ్రాయేలీయులందరు అతన్ని చూసి చాలా భయపడి అతని దగ్గర నుండి పారిపోయారు.
25ఇశ్రాయేలీయులలో ఒకడు, “వస్తున్న ఆ వ్యక్తిని చూశారా, ఇశ్రాయేలీయులను ఎదిరించడానికే అతడు వస్తున్నాడు. అయితే అతన్ని చంపినవాన్ని రాజు గొప్ప ధనవంతునిగా చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి అతని కుటుంబం ఇశ్రాయేలులో పన్నులు కట్టే అవసరం లేకుండ చేస్తారు” అని చెప్పాడు.
26అప్పుడు దావీదు తన దగ్గర నిలబడినవారిని, “సజీవుడైన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి సున్నతిలేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వానిని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ అవమానాన్ని తొలగించిన వానికి ఏ బహుమతి ఇస్తారు?” అని అడిగాడు.
27అందుకు ఆ సైనికులు, “వానిని చంపినవానికి ఇలా చేస్తారు” అని అతనికి చెప్పారు.
28దావీదు వారితో మాట్లాడిన మాటలు అతని పెద్దన్న ఏలీయాబు విని దావీదు మీద కోప్పడి అతనితో, “నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? అరణ్యంలో ఉన్న ఆ చిన్న గొర్రెల మందను ఎవరికి అప్పగించావు? నీకు ఎంత అహంకారమో నీది ఎంత చెడ్డ హృదయమో నాకు తెలుసు! యుద్ధం చూడడానికే గదా నీవు వచ్చావు” అన్నాడు.
29అందుకు దావీదు, “నేనేమి చేశాను? నేనేమి మాట్లాడకూడదా?” అని అడిగి, 30అతని దగ్గర నుండి వెళ్లి మరొకరిని మరలా అదే ప్రశ్న అడిగాడు. వారు కూడా అదే జవాబిచ్చారు. 31దావీదు మాటలు విన్న మరికొందరు వాటిని సౌలుకు చెప్పినప్పుడు అతడు దావీదును పిలిపించాడు.
32దావీదు సౌలుతో, “ఈ ఫిలిష్తీయుని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ సేవకుడనైన నేను వెళ్లి వానితో పోరాడతాను” అన్నాడు.
33అందుకు సౌలు దావీదుతో, “ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోరాడటానికి నీ బలం సరిపోదు. నీవు ఇంకా చిన్నపిల్లవాడివి! అతడు చిన్నప్పటి నుండే యుద్ధవీరుడు” అని చెప్పాడు.
34అందుకు దావీదు సౌలుతో, “మీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తుండగా ఒక సింహం ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతుంటే, 35నేను దానిని తరిమి చంపి దాని నోటిలో నుండి ఆ గొర్రెను విడిపించాను. అది నా మీద దాడి చేసినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను. 36మీ సేవకుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను. సజీవుడైన దేవుని సైన్యాలను అవమానిస్తున్న ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దానిలా అవుతాడు. 37దావీదు ఇంకా మాట్లాడుతూ, సింహపు పంజానుండి ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తారు” అన్నాడు.
అప్పుడు సౌలు, “వెళ్లు, యెహోవా నీకు తోడుగా ఉంటారు” అని దావీదుతో అన్నాడు.
38సౌలు తన యుద్ధ వస్త్రాలను, యుద్ధకవచాన్ని దావీదుకు తొడిగించి ఇత్తడి శిరస్త్రాణం అతని తలపై పెట్టాడు. 39దావీదు ఆ యుద్ధకవచం వేసుకుని కత్తి పట్టుకుని నడవడానికి ప్రయత్నించాడు కాని అవి అతనికి అలవాటు లేకపోవడం వలన అతడు నడవలేకపోయాడు.
అందుకతడు, “ఇవి నాకు అలవాటు లేదు కాబట్టి వీటితో నేను వెళ్లలేను” అని సౌలుతో చెప్పి వాటిని తీసివేశాడు. 40అతడు తన చేతికర్రను పట్టుకుని ఏటిలో నుండి అయిదు సన్నని రాళ్లు ఏరుకుని తన దగ్గర ఉన్న చిన్న సంచిలో వేసుకుని తన వడిసెల పట్టుకుని ఆ ఫిలిష్తీయుని దగ్గరకు వెళ్లాడు.
41తన డాలు మోసేవాడు తనకు ముందు నడుస్తుండగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదుకు దగ్గరగా వచ్చి, 42ఎర్రగా, అందంగా ఉన్న దావీదును చూసి చిన్నపిల్లవాడని అతన్ని పట్టించుకోలేదు. 43అతడు దావీదుతో, “కర్ర తీసుకుని నా మీదికి వస్తున్నావు నేనేమైనా కుక్కనా?” అని చెప్పి తన దేవుళ్ళ పేరట దావీదును శపించాడు. 44ఆ ఫిలిష్తీయుడు దావీదుతో, “నా దగ్గరకు రా, నీ మాంసాన్ని పక్షులకు మృగాలకు వేస్తాను!” అన్నాడు.
45అందుకు దావీదు ఆ ఫిలిష్తీయునితో, “నీవు కత్తి ఈటె బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు కాని నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాల దేవుడును సైన్యాల అధిపతియైన యెహోవా#17:45 హెబ్రీలో ఎల్-షద్దాయ్ పేరట నేను నీ మీదికి వస్తున్నాను. 46ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తారు; నేను నిన్ను చంపి నీ తల నరికివేస్తాను. నేను ఈ రోజే ఫిలిష్తీయుల కళేబరాలను పక్షులకు అడవి జంతువులకు వేస్తాను. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకుంటుంది. 47అప్పుడు యెహోవా కత్తితో గాని ఈటెతో గాని రక్షించేవాడు కాడని ఇక్కడ ఉన్నవారందరు తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే, ఆయనే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తారు” అన్నాడు.
48ఆ ఫిలిష్తీయుడు దావీదుపై దాడి చేయడానికి ముందుకు రాగానే దావీదు అతన్ని ఎదుర్కోడానికి సైన్యం వైపు పరుగెత్తి వెళ్లాడు. 49దావీదు తన సంచిలో నుండి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి విసిరి ఆ ఫిలిష్తీయుని నుదిటి మీద కొట్టాడు. ఆ రాయి అతని నుదిటి లోపలికి చొచ్చుకొని పోగా గొల్యాతు నేలపై బోర్లాపడ్డాడు.
50అలా దావీదు ఆ ఫిలిష్తీయుని కేవలం ఒక వడిసెల ఒక రాయితో జయించాడు; తన చేతిలో కత్తి లేకుండానే ఆ ఫిలిష్తీయుని పడగొట్టాడు.
51అప్పుడు దావీదు పరుగెత్తుకొని వెళ్లి ఆ ఫిలిష్తీయుని మీద నిలబడి వాని ఒరలో ఉన్న కత్తిని తీసి ఆ కత్తితోనే వాని చంపి, వాని తల నరికివేశాడు.
ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి పారిపోయారు. 52అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు లేచి జయధ్వనులు చేస్తూ లోయవరకు ఎక్రోను ద్వారాల వరకు ఫిలిష్తీయులను వెంటాడారు. చనిపోయిన ఫిలిష్తీయులు షరాయిము దారిలో గాతు ఎక్రోను పట్టణాల వరకు పడి ఉన్నారు. 53ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను వెంటాడడం ఆపి, తిరిగివచ్చి వారి డేరాలను దోచుకున్నారు.
54దావీదు ఆ ఫిలిష్తీయుని తలను యెరూషలేముకు తీసుకువచ్చాడు. ఫిలిష్తీయుని ఆయుధాలను తన సొంత డేరాలో ఉంచాడు.
55దావీదు ఆ ఫిలిష్తీయుని ఎదుర్కోడానికి వెళ్లడం చూసి సౌలు తన సేనాధిపతియైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, ఈ యువకుడు ఎవరి కుమారుడు” అని అడిగాడు.
అందుకు అబ్నేరు, “రాజా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు తెలియదు” అన్నాడు.
56అందుకు రాజు, “ఈ యువకుడు ఎవరి కుమారుడో తెలుసుకోండి” అని ఆజ్ఞాపించాడు.
57దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలిచి ఫిలిష్తీయుని తల అతని చేతిలో ఉండగానే దావీదును సౌలు దగ్గరకు తీసుకువచ్చాడు.
58సౌలు అతన్ని, “చిన్నవాడా, నీవెవరి కుమారుడవు?” అని అడిగాడు.
అందుకు దావీదు, “నేను నీ సేవకుడు బేత్లెహేమీయుడైన యెష్షయి కుమారుడను” అని సమాధానమిచ్చాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 17: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.