1 సమూయేలు 24
24
సౌలును ప్రాణాలతో వదిలిన దావీదు
1సౌలు ఫిలిష్తీయులను తరమడం ఆపి తిరిగివచ్చిన తర్వాత, “దావీదు ఎన్-గేదీ ఎడారిలో ఉన్నాడు” అని అతనికి వార్త వచ్చింది. 2కాబట్టి సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి మూడువేలమంది యువకులను ఏర్పరచుకొని కొండమేకలు ఉండే రాతి గుట్టలలో దావీదును అతని ప్రజలను వెదకడానికి బయలుదేరాడు.
3దారిలో గొర్రెల దొడ్ల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక గుహ ఉంది. సౌలు మూత్ర విసర్జన కోసం దాని లోపలికి వెళ్లాడు. ఆ గుహలో చాలా లోపల దావీదు అతని మనుష్యులు ఉన్నారు. 4ఆ మనుష్యులు, “ ‘నీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తాను’ అని యెహోవా నీతో చెప్పిన రోజు ఇదే” అన్నారు. అప్పుడు దావీదు ప్రాకుతూ ముందుకు వెళ్లి సౌలు వస్త్రపు అంచును కత్తిరించాడు.
5కాని తర్వాత, సౌలు పైవస్త్రపు అంచును కోసినందుకు దావీదుకు మనస్సులో ఎంతో బాధ కలిగి, 6“ఇతడు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువుకు నేను ఈ పని చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను చంపను” అని తన ప్రజలతో చెప్పాడు. 7ఈ మాటలు చెప్పి దావీదు తన ప్రజలను గద్దించి సౌలు మీద దాడి చేయకుండ వారిని ఆపాడు. సౌలు ఆ గుహ నుండి బయటకు వచ్చి తన దారిలో వెళ్లిపోయాడు.
8అప్పుడు దావీదు గుహ నుండి బయటకు వచ్చి, “నా ప్రభువా రాజా!” అని పిలిచాడు. సౌలు అతని వెనుక చూసినప్పుడు దావీదు నేలకు సాష్టాంగపడి ఉన్నాడు. 9అతడు సౌలుతో ఇలా అన్నాడు, “ ‘దావీదు నీకు హాని చేస్తాడు’ అని మనుష్యులు చెప్పిన మాటలు నీవెందుకు వింటున్నావు? 10గుహలో యెహోవా నిన్ను నా చేతికి ఎలా అప్పగించారో ఈ రోజు మీరు మీ కళ్లతో చూశారు. కొందరు నిన్ను చంపమని నన్ను ప్రోత్సహించారు, కాని నేను నిన్ను వదిలేశాను; ‘ఎందుకంటే నా ప్రభువు యెహోవాచేత అభిషేకించబడినవాడు కాబట్టి నేను ఆయన మీద చేయి వేయను’ అని చెప్పాను. 11చూడు, నా తండ్రీ, నా చేతిలో ఉన్న నీ వస్త్రాన్ని చూడు! నేను మీ వస్త్రపు అంచును కత్తిరించాను, కానీ నిన్ను చంపలేదు. నేను తప్పు చేశాను అనడానికి గాని తిరుగుబాటు చేశాను అని సూచించడానికి నా చేతిలో ఏమీ లేదని చూడండి. నేను నీకు అన్యాయం చేయలేదు, కానీ నీవు నా ప్రాణం తీయడానికి నన్ను తరుముతున్నావు. 12నీకు నాకు మధ్య యెహోవా న్యాయం తీరుస్తారు. నీవు నా పట్ల చేసినవాటికి యెహోవాయే ప్రతీకారం చేస్తారు కాని నా చేయి నిన్ను తాకదు. 13పాత సామెత చెప్పినట్లుగా, ‘దుర్మార్గుల నుండి దుర్మార్గమైనవే వస్తాయి’ కాబట్టి నా చేయి నిన్ను తాకదు.
14“ఇశ్రాయేలు రాజు ఎవరి మీదికి వచ్చాడు? మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? చచ్చిన కుక్కనా? ఈగనా? 15యెహోవా మనకు న్యాయమూర్తిగా ఉండి మన మధ్య తీర్పు తీర్చును గాక. ఆయన నా విషయాన్ని పరిశీలించి నా తరుపున దానిని సమర్థిస్తారు; నీ చేతి నుండి నన్ను విడిపించి ఆయనే నాకు న్యాయం చేస్తారు” అన్నాడు.
16దావీదు ఇలా చెప్పడం ముగించినప్పుడు సౌలు, “దావీదూ, నా కుమారుడా, అది నీ స్వరమా?” అని అడిగి బిగ్గరగా ఏడ్చాడు, 17అతడు దావీదుతో, “నీవు నాకన్నా నీతిమంతుడవు; నీవు నాకు మేలే చేశావు కాని నేను నీకు చాలా కీడు చేశాను. 18నీవు నాకు చేసిన మంచి గురించి ఈ రోజు నాకు చెప్పావు; యెహోవా నన్ను నీ చేతికి అప్పగించినప్పటికీ నీవు నన్ను చంపలేదు. 19ఒకడు తన శత్రువును కనుగొన్నప్పుడు, అతడు అతన్ని క్షేమంగా తప్పించుకోనిస్తాడా? ఈ రోజు నీవు నాతో ప్రవర్తించిన తీరుకు యెహోవా నీకు మంచి ప్రతిఫలమివ్వాలి. 20తప్పకుండా నీవు రాజవుతావని, ఇశ్రాయేలీయుల రాజ్యం నీకు స్ధిరపరచబడుతుందని నాకు తెలుసు. 21కాబట్టి నీవు నా సంతానాన్ని చంపనని నా తండ్రి కుటుంబం నుండి నా పేరును కొట్టివేయనని యెహోవా పేరిట నాకు ప్రమాణం చేయి” అన్నాడు.
22అప్పుడు దావీదు సౌలుకు ప్రమాణం చేశాడు. ఆ తర్వాత సౌలు ఇంటికి తిరిగి వచ్చాడు; దావీదు అతని ప్రజలు తామున్న కొండ ప్రాంతాలకు వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 24: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.