1 సమూయేలు 25
25
దావీదు, నాబాలు, అబీగయీలు
1కొంతకాలానికి సమూయేలు చనిపోయాడు, ఇశ్రాయేలీయులందరు ఒకచోట చేరి అతని కోసం ఏడ్చారు; రామాలో అతని ఇంటి దగ్గర అతన్ని సమాధి చేసిన తర్వాత దావీదు బయలుదేరి పారాను#25:1 కొ.ప్రా.ప్ర.లలో మాయోను ఎడారిలోనికి వెళ్లాడు.
2కర్మెలులో ఆస్తులు ఉన్న ఒక వ్యక్తి మాయోనులో ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు, అతనికి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు ఉన్నాయి. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్లాడు. 3అతని పేరు నాబాలు, అతని భార్యపేరు అబీగయీలు. ఆమె చాలా తెలివైనది అందమైనది. అయితే అతడు తన పనులలో చాలా కఠినంగా దుర్మార్గంగా వ్యవహరించేవాడు. అతడు కాలేబు సంతతికి చెందిన వాడు.
4నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని అరణ్యంలో ఉన్న దావీదు విని, 5దావీదు తన పనివారిలో పదిమంది యువకులను పిలిచి వారితో ఇలా చెప్పాడు, “మీరు కర్మెలులో ఉన్న నాబాలు దగ్గరకు వెళ్లి నేను అడిగినట్టుగా క్షేమసమాచారం అడగండి. 6అతనితో ఇలా చెప్పండి, ‘నీకు దీర్ఘాయువు కలుగును గాక! నీకు నీ ఇంటివారికి నీకు చెందినవాటన్నిటికి క్షేమం కలుగును గాక!
7“ ‘ఇది గొర్రెల బొచ్చు కత్తిరించే సమయమని నేను విన్నాను. నీ గొర్రెల కాపరులు మాతో ఉన్నప్పుడు మేము వారికి ఏ హాని చేయలేదు. కర్మెలులో ఉన్నంత కాలం వారు ఏదీ పోగొట్టుకోలేదు. 8నీ సేవకులను అడిగితే వారు నీకు చెప్తారు. పండుగ సమయంలో మేము వచ్చాం, నా మనుష్యుల మీద దయ చూపించు. దయచేసి నీకు ఏది ఇవ్వాలనిపిస్తే అదే నీ సేవకులకు నీ కుమారుడైన దావీదుకు ఇవ్వు.’ ”
9దావీదు సేవకులు వచ్చి వారు నాబాలుకు దావీదు పంపిన వర్తమానాన్ని చెప్పి వేచి ఉన్నారు.
10నాబాలు దావీదు సేవకులతో, “దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? ఈ రోజుల్లో చాలామంది తమ యజమానులను విడిచిపెట్టి వెళ్లి పోతున్నారు. 11నా ఆహారాన్ని నీటిని, నా గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్న వారి కోసం నేను సిద్ధం చేసిన మాంసాన్ని ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియని వారికి నేను ఎందుకు ఇవ్వాలి?” అన్నాడు.
12దావీదు సేవకులు వచ్చిన దారినే తిరిగివెళ్లి నాబాలు చెప్పిన మాటలన్నీ అతనికి చెప్పారు. 13అప్పుడు దావీదు వారితో, “మీరందరు మీ ఖడ్గాలు ధరించుకోండి” అని చెప్పగా వారు తమ ఖడ్గాలు ధరించుకున్నారు. దావీదు కూడా కత్తి ధరించాడు. దావీదుతో పాటు దాదాపు నాలుగువందలమంది పురుషులు వెళ్లగా రెండువందలమంది సామాగ్రితో ఉండిపోయారు.
14సేవకులలో ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో, “అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానికి శుభాలు చెప్పమని దూతలను పంపితే అతడు వారిని అవమానించి మాట్లాడాడు. 15అయితే ఆ మనుష్యులు మా పట్ల చాలా మంచిగా ఉన్నారు. మేము పొలంలో వారి మధ్య ఉన్నంత కాలం మాకు ఏ హాని చేయలేదు, మేమేమి పోగొట్టుకోలేదు. 16వారి దగ్గర మేము గొర్రెలను మేపుతున్నంత కాలం వారు రాత్రి పగలు మా చుట్టూ ఒక గోడలా ఉన్నారు. 17ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే మా యజమానికి అతని ఇంటివారికందరికి కీడు పొంచి ఉంది. అతడు దుర్మార్గుడు, అతనితో ఎవరూ మాట్లాడలేరు” అని చెప్పాడు.
18అప్పుడు అబీగయీలు ఆలస్యం చేయకుండా వెంటనే రెండువందల రొట్టెలు, రెండు ద్రాక్షరసం తిత్తులు, వండిన అయిదు గొర్రెల మాంసం, అయిదు మానికల#25:18 అంటే, సుమారు 27 కి. గ్రా. లు లేదా ఒక ఏఫాలో మూడవ వంతు వేయించిన ధాన్యం, వంద ద్రాక్షగుత్తులు, రెండువందల అంజూర పండ్ల ముద్దలు తీసుకుని గాడిదల మీద ఎక్కించింది. 19ఆమె తన సేవకులతో, “మీరు ముందు వెళ్లండి, నేను మీ వెనుక వస్తాను” అని చెప్పింది. అయితే ఆమె తన భర్తయైన నాబాలుతో ఏమీ చెప్పలేదు.
20ఆమె తన గాడిద మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వస్తుండగా, దావీదు అతని మనుష్యులు ఆమెకు ఎదురువచ్చారు. అప్పుడు ఆమె వారిని కలిసింది. 21అంతకుముందే దావీదు, “నాబాలు ఆస్తులలో ఏది అతడు పోగొట్టుకోకూడదని ఈ అరణ్యంలో నేను కష్టపడి కాపలా ఉన్నదంతా వృధానే కదా! నేను అతనికి మేలు చేస్తే అతడు నాకు కీడు చేశాడు. 22రేపు ఉదయం తెల్లవారేసరికి అతని ఇంటివారిలో ఒక్కడు బ్రతికినా దేవుడు దావీదును తీవ్రంగా శిక్షించును గాక!” అని అన్నాడు.
23అబీగయీలు దావీదును చూసి, వెంటనే గాడిద దిగి దావీదు ఎదుట వంగి నేల మీద సాష్టాంగపడింది. 24ఆమె అతని పాదాల మీద పడి, “నా ప్రభువా, తప్పంతా నాదేనని ఒప్పుకుంటున్నాను; మీ సేవకురాలినైన నన్ను మాట్లాడనివ్వండి, మీ సేవకురాలి మాట వినండి. 25నా ప్రభువా, దుర్మార్గుడైన నాబాలును పట్టించుకోవద్దు. అతని పేరుకు అర్థం మూర్ఖుడు; నిజంగానే అతనిలో మూర్ఖత్వం ఉంది. ఇక నా విషయానికొస్తే, నా ప్రభువైన మీరు పంపిన మీ సేవకులను నేను చూడలేదు. 26నా ప్రభువా, మీ దేవుడైన యెహోవా పేరిట, మీ జీవం తోడు, రక్తం చిందించకుండ మీ చేతులతో మీరే పగతీర్చుకోకుండా యెహోవా మిమ్మల్ని ఆపారు. మీ శత్రువులు నా ప్రభువైన మీకు కీడు చేయాలనుకునే వారికి నాబాలు గతే పడుతుంది. 27మీ సేవకురాలినైన నేను నా ప్రభువైన మీకు తెచ్చిన ఈ కానుకను మీ వెంట ఉన్న మీ సేవకులకు ఇవ్వనివ్వండి.
28“మీ సేవకురాలి పాపాన్ని క్షమించండి. నా ప్రభువైన మీరు యెహోవా యుద్ధాలను చేస్తున్నారు కాబట్టి నా ప్రభువు యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తారు. మీరు జీవించినంతకాలం మీకు కీడు కలుగదు. 29మిమ్మల్ని బాధించాలని, ప్రాణం తీయాలని ఎవరైనా ప్రయత్నిస్తే, నా ప్రభువైన మీ ప్రాణం మీ దేవుడైన యెహోవా దగ్గర ఉన్న జీవపు మూటలో భద్రంగా కట్టబడుతుంది. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లుగా ఆయన మీ శత్రువుల ప్రాణాలను విసిరివేస్తారు. 30యెహోవా నా ప్రభువైన మీకు వాగ్దానం చేసినదంతటిని నెరవేర్చి మిమ్మల్ని ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా నియమిస్తారు. 31నిష్కారణంగా మీరు రక్తం చిందించారన్న లేదా స్వయంగా మీరే పగతీర్చుకున్నారన్న హృదయ వేదన గాని దుఃఖం గాని నా ప్రభువైన మీకు కలుగకూడదు. యెహోవా నా ప్రభువైన మీకు విజయాన్ని ఇచ్చినప్పుడు మీరు మీ సేవకురాలినైన నన్ను జ్ఞాపకం చేసుకోండి” అని మనవి చేసుకుంది.
32అందుకు దావీదు అబీగయీలుతో, “నన్ను కలుసుకోడానికి నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక. 33నీవు సమయోచితంగా మంచి పని చేసి ఈ రోజు రక్తపాతం చిందించకుండ నన్ను కాపాడావు నా సొంత చేతులతో నేను పగతీర్చుకోకుండ నన్ను అడ్డుకున్నావు కాబట్టి నీవు దీవించబడుదువు గాక. 34ఒకవేళ నీవు త్వరగా వచ్చి నన్ను కలిసి ఉండకపోతే, నీకు హాని చేయకుండ నన్ను ఆపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవం తోడు, రేపు తెల్లవారేసరికి నాబాలుకు సంబంధించిన మగవారిలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండేవాడు కాదు” అన్నాడు.
35తర్వాత దావీదు తన కోసం ఆమె తెచ్చిన వాటిని ఆమె చేతితో తీసుకుని, “నీ మాటలు నేను విని నీ మనవి అంగీకరించాను, సమాధానంతో ఇంటికి వెళ్లు” అని ఆమెతో చెప్పాడు.
36అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరకు వచ్చినప్పుడు, రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి, బాగా త్రాగుతూ ఆనందిస్తూ మత్తులో మునిగిపోయాడు కాబట్టి తెల్లవారే వరకు అతనితో ఆమె ఏమీ మాట్లాడలేదు. 37ఉదయాన నాబాలు మత్తు వదిలిన తర్వాత అతని భార్య అతనితో ఆ సంగతులన్ని చెప్పినప్పుడు భయంతో అతని గుండె ఆగి రాయిలా బిగుసుకుపోయాడు. 38పది రోజుల తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు.
39నాబాలు చనిపోయాడని దావీదు విన్నప్పుడు, “నాబాలు నా పట్ల అవమానకరంగా ప్రవర్తించినందుకు నా పక్షాన పగతీర్చుకున్న యెహోవాకు స్తుతి కలుగును గాక. ఆయన తన సేవకుడు తప్పు చేయకుండ కాపాడాడు, నాబాలు చేసిన తప్పును అతని తలపైకి తెచ్చాడు” అని అన్నాడు.
తర్వాత దావీదు తనను పెండ్లి చేసుకోమని అబీగయీలును అడగడానికి ఆమె దగ్గరకు కబురు పంపించాడు. 40దావీదు సేవకులు కర్మెలులో ఉన్న అబీగయీలు దగ్గరకు వచ్చి, “దావీదు నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నిన్ను తీసుకురమ్మని మమ్మల్ని పంపాడు” అని చెప్పారు.
41ఆమె లేచి మోకరించి తల నేలపై ఆనించి, “నా ప్రభుని ఇష్టం; నా ప్రభుని సేవకులకు సేవ చేసి కాళ్లు కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది. 42వెంటనే అబీగయీలు లేచి గాడిద మీద తన అయిదుగురు సేవకురాళ్లను వెంటబెట్టుకుని దావీదు దూతలతో వెళ్లి దావీదును పెళ్ళి చేసుకుంది. 43దావీదు యెజ్రెయేలుకు చెందిన అహీనోయమును కూడా పెళ్ళి చేసుకున్నాడు, వారిద్దరు అతని భార్యలు. 44అయితే సౌలు తన కుమార్తె దావీదు భార్యయైన మీకాలును గల్లీముకు చెందిన లాయిషు కుమారుడైన పల్తీయేలుకు#25:44 పల్తీయేలు పల్తీ యొక్క మరో రూపం ఇచ్చాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 25: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.