1 సమూయేలు 26
26
మళ్ళీ సౌలును ప్రాణాలతో విడిచిపెట్టిన దావీదు
1జీఫీయులు గిబియాలో ఉన్న సౌలు దగ్గరకు వెళ్లి, “దావీదు యెషీమోను ఎదురుగా ఉన్న హకీలా కొండలో దాక్కోలేదా?” అని అన్నారు.
2కాబట్టి సౌలు బయలుదేరి ఇశ్రాయేలీయులలో ఎంపిక చేయబడిన మూడువేలమంది సైన్యంతో దావీదును వెదకడానికి జీఫు అరణ్యానికి వెళ్లాడు. 3సౌలు యెషీమోనుకు ఎదురుగా ఉన్న హకీలా కొండ ప్రాంతంలో దారి ప్రక్కన బసచేశాడు, అయితే దావీదు అరణ్యంలోనే నివసించాడు. తనను వెంబడిస్తూ సౌలు అరణ్యానికి వచ్చాడని విని, 4దావీదు తన వేగులవారిని పంపి, సౌలు నిజంగానే వచ్చాడని తెలుసుకున్నాడు.
5తర్వాత దావీదు బయలుదేరి సౌలు బసచేసిన చోటికి వెళ్లి, సౌలు, సేనాధిపతియైన నేరు కుమారుడు అబ్నేరు ఎక్కడ పడుకున్నారో చూశాడు. సౌలు శిబిరం లోపల పడుకున్నాడు, సైన్యమంతా అతని చుట్టూ ఉంది.
6అప్పుడు దావీదు, “శిబిరంలోనికి సౌలు దగ్గరకు నాతో పాటు ఎవరు వస్తారు?” అని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడైన యోవాబుకు సోదరుడైన అబీషైని అడిగాడు.
అందుకు, “నీతో నేను వస్తాను” అని అబీషై అన్నాడు.
7దావీదు, అబీషై రాత్రివేళ ఆ సైన్యం దగ్గరకు వెళ్లినప్పుడు సౌలు శిబిరం లోపల పడుకుని నిద్రపోతున్నాడు. అతని ఈటె అతని తల దగ్గర నేలమీద గుచ్చి ఉంది. అబ్నేరు, సైన్యం అతని చుట్టూ పడుకుని ఉన్నారు.
8అప్పుడు అబీషై దావీదుతో, “దేవుడు ఈ రోజు నీ శత్రువును నీకప్పగించారు. కాబట్టి నీవు ఒప్పుకుంటే ఆ ఈటెతో ఒక పోటు పొడిచి నేనతడిని భూమిలో దిగేలా చేస్తాను, రెండవ పోటు పొడిచే అవసరం కూడా ఉండదు” అన్నాడు.
9అయితే దావీదు అబీషైతో, “అతన్ని చంపవద్దు, యెహోవా అభిషేకించిన వానిని చంపినవారు నిర్దోషులుగా ఉండగలరా? 10దావీదు ఇంకా మాట్లాడుతూ, సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, యెహోవాయే అతన్ని శిక్షిస్తారు. అతని సమయం వచ్చినప్పుడు అతడే చనిపోతాడు లేదా యుద్ధంలో నశిస్తాడు. 11అయితే యెహోవా అభిషేకించిన వానిపైకి నేను చేయి ఎత్తకుండ యెహోవా నన్ను ఆపివేయును గాక. అతని తల దగ్గర ఉన్న ఈటెను నీళ్ల కూజాను తీసుకుని మనం వెళ్లిపోదాం రా” అని చెప్పాడు.
12దావీదు సౌలు తల దగ్గర ఉన్న ఈటెను నీళ్ల కూజాను తీసుకున్నాడు, అప్పుడు వారిద్దరు వెళ్లిపోయారు. యెహోవా వారికి గాఢనిద్ర కలుగజేశారు కాబట్టి వారందరు నిద్రలో ఉన్నారు. ఎవరూ వచ్చిన వారిని చూడలేదు, జరిగింది వారికి తెలియదు.
13తర్వాత దావీదు అవతలి వైపుకు వెళ్లి దూరంగా కొండమీద నిలబడ్డాడు, వారిద్దరి మధ్య చాలా దూరం ఉంది. 14దావీదు సైన్యాన్ని, నేరు కుమారుడైన అబ్నేరును పిలిచి, “అబ్నేరూ, నీవు నాకు జవాబివ్వవా?” అని అన్నాడు.
అప్పుడు అబ్నేరు, “రాజును నిద్ర లేపుతున్న నీవు ఎవరివి?” అని అడిగాడు.
15అందుకు దావీదు, “అబ్నేరూ, నీవు మగాడివి కావా? ఇశ్రాయేలీయులలో నీలాంటి వారెవరు? నీ ప్రభువైన రాజుకు నీవెందుకు కాపలా కాయలేదు? నీ ప్రభువైన రాజును చంపడానికి ఒకడు దగ్గరకు వచ్చాడు. 16నీవు చేసింది సరియైనది కాదు, యెహోవా అభిషేకించిన నీ యజమానికి నీవు రక్షణ ఇవ్వలేకపోయావు కాబట్టి సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీవు నీ మనుష్యులు తప్పకుండా చావాలి. రాజు తల దగ్గర ఉండాల్సిన అతని ఈటె, నీళ్ల కూజా ఎక్కడ ఉన్నాయి?” అన్నాడు.
17సౌలు దావీదు స్వరం గుర్తుపట్టి, “దావీదూ నా కుమారుడా, ఇది నీ స్వరమేనా?” అని అడిగాడు.
అందుకు దావీదు, “నా ప్రభువా, రాజా, అవును ఇది నా స్వరమే. 18నా ప్రభువు తన సేవకుడిని ఎందుకు తరుముతున్నాడు? నేనేమి చేశాను? నేను చేసిన తప్పేంటి? 19ఇప్పుడు నా ప్రభువైన రాజు తన సేవకుని మాటలు వినాలి. ఒకవేళ యెహోవాయే మిమ్మల్ని నా మీదికి రెచ్చగొట్టి ఉంటే, ఆయన నా అర్పణను అంగీకరించును గాక. కానీ ఒకవేళ ఇది మనుష్యుల కుట్ర అయితే అందులో ఉన్నవారిని యెహోవా శపించును గాక! ఈ రోజు వారు యెహోవా వారసత్వంలో నా వాటా నుండి నన్ను వెలివేసి, ‘వెళ్లి ఇతర దేవుళ్ళను సేవించు’ అని అన్నారు. 20యెహోవా సన్నిధికి దూరంగా నా రక్తం నేలపై పడకూడదు. ఒకడు పర్వతాల్లో కౌజుపిట్టను వేటాడినట్లు ఇశ్రాయేలు రాజు ఈగను వెదకడానికి బయటకు వచ్చాడు” అని అన్నాడు.
21అందుకు సౌలు, “నేను పాపం చేశాను. దావీదూ నా కుమారుడా, తిరిగి రా. ఈ రోజు నీవు నా ప్రాణాన్ని విలువైనదిగా గుర్తించావు, కాబట్టి నేను మరలా నీకు హాని చేయడానికి ప్రయత్నించను. నేను ఒక మూర్ఖునిలా చాలా భయంకరమైన తప్పు చేశాను” అన్నాడు.
22అప్పుడు దావీదు, “రాజా, ఇదిగో రాజు ఈటె ఇక్కడ ఉంది, నీ పనివారిలో ఒకడు వచ్చి దానిని తీసుకెళ్లవచ్చు. 23యెహోవా ప్రతిఒక్కరికి వారి నీతికి నమ్మకత్వానికి బహుమానం ఇస్తారు. యెహోవా ఈ రోజు నిన్ను నా చేతికి అప్పగించారు కాని, యెహోవా అభిషేకించిన వాని మీద నేను చేయి వేయను. 24ఈ రోజు నీ ప్రాణానికి విలువను ఇచ్చినందుకు యెహోవా నా ప్రాణానికి విలువనిచ్చి అన్ని బాధలనుండి నన్ను విడిపించును గాక” అని చెప్పాడు.
25అందుకు సౌలు దావీదుతో, “దావీదూ, నా కుమారుడా, నీవు దీవించబడుదువు గాక; నీవు గొప్ప పనులు చేస్తావు, ఖచ్చితంగా విజయం పొందుతావు” అన్నాడు.
తర్వాత దావీదు తన దారిన తాను వెళ్లిపోయాడు, సౌలు తన రాజభవనానికి తిరిగి వెళ్లాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 26: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.