1 సమూయేలు 27
27
ఫిలిష్తీయుల మధ్య దావీదు
1అయితే దావీదు తనలో తాను, “ఏదో ఒక రోజు నేను సౌలు చేతిలో నాశనమవుతాను. నేను చేయగలిగిన ఉత్తమమైన పనేంటంటే ఫిలిష్తీయుల దేశానికి తప్పించుకు పోవడమే. అప్పుడు సౌలు ఇశ్రాయేలు దేశంలో నన్ను వెదకడం మానేస్తాడు, కాబట్టి నేను అతని చేతిలో నుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.
2కాబట్టి దావీదు తనతో ఉన్న ఆరువందలమంది పురుషులతో బయలుదేరి మాయోకు కుమారుడు గాతు రాజైన ఆకీషు దగ్గరకు వెళ్లాడు. 3దావీదు అతని మనుష్యులు ఆకీషుతో పాటు గాతులో స్థిరపడ్డారు. ప్రతిఒక్కరు తమ తమ కుటుంబాలతో ఉన్నారు. అలాగే దావీదు ఇద్దరు భార్యలు: యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, కర్మెలుకు చెందిన అబీగయీలు (నాబాలు విధవరాలు) అతనితో ఉన్నారు. 4దావీదు గాతుకు పారిపోయాడని సౌలుకు తెలిసిన తర్వాత అతడు దావీదును వెదకడం మానివేశాడు.
5అప్పుడు దావీదు ఆకీషుతో, “రాజనగరంలో నీతో పాటు నీ సేవకుడనైన నేను ఉండడం ఎందుకు? నీకు నాపై దయ ఉంటే నేను నివసించడానికి బయట పట్టణాల్లో ఒకదానిలో నాకు స్థలం ఇవ్వండి” అని అడిగాడు.
6కాబట్టి ఆకీషు ఆ రోజే సిక్లగు అనే పట్టణాన్ని అతనికిచ్చాడు. అప్పటినుండి నేటివరకు సిక్లగు యూదా రాజులకు చెందినదిగానే ఉంది. 7దావీదు ఫిలిష్తీయుల దేశంలో ఒక సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాడు.
8తర్వాత దావీదు అతని మనుష్యులు బయలుదేరి గెషూరీయులమీద గెజెరీయులమీద, అమాలేకీయుల మీద దాడి చేశారు. (పూర్వం నుండి ఈ ప్రజలు షూరు, ఈజిప్టు వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో నివసించారు.) 9దావీదు ఎక్కడ దాడి చేసినా అక్కడ మగవారిని ఆడవారిని ఎవరిని ప్రాణాలతో విడిచిపెట్టేవాడు కాదు, కాని గొర్రెలను ఎద్దులను గాడిదలను ఒంటెలను వస్త్రాలను దోచుకుని తిరిగి ఆకీషు దగ్గరకు వచ్చేవాడు.
10ఆకీషు, “ఈ రోజు మీరెక్కడ దాడి చేశారు?” అని అడిగినప్పుడు, దావీదు, “యూదా దేశానికి యెరహ్మెయేలు దేశానికి కెనీయుల దేశానికి దక్షిణంగా ఉన్న చోటుపై దాడి చేశాం” అని చెప్పాడు. 11దావీదు ఇలా చేస్తున్నాడని తమ గురించి సమాచారం అందిస్తారని భావించిన దావీదు గాతుకు తీసుకురావడానికి పురుషులను గాని స్త్రీలను గాని ప్రాణాలతో విడిచిపెట్టలేదు. అతడు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నంతకాలం అలాగే చేస్తూ ఉన్నాడు. 12దావీదును నమ్మిన ఆకీషు, “ఇతనికి తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద చాలా అసహ్యం ఏర్పడింది, కాబట్టి ఇతడు జీవితాంతం నాకు సేవకునిగా ఉంటాడు” అని అనుకున్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 27: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.