1 సమూయేలు 28
28
1ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని తమ సైన్యాలను సమకూర్చుకున్నారు. ఆకీషు దావీదుతో, “నీవు, నీ మనుష్యులు నాతో పాటు యుద్ధానికి రావాలని నీవు గ్రహించాలి” అన్నాడు.
2అందుకు దావీదు, “నీ సేవకుడు ఏమి చేయగలడో నీవు చూస్తావు” అన్నాడు.
ఆ మాటకు జవాబుగా ఆకీషు, “చాలా మంచిది, అప్పుడు నిన్ను జీవితాంతం నా అంగరక్షకునిగా నియమిస్తాను” అన్నాడు.
ఎన్దోరు దగ్గర సౌలు, మృతుల ఆత్మలతో మాట్లాడే స్త్రీ
3సమూయేలు చనిపోగా ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయులు అతని గురించి దుఃఖించి అతని పట్టణమైన రామాలో అతన్ని సమాధి చేశారు. గతంలో సౌలు మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని దేశం నుండి వెళ్లగొట్టాడు.
4ఫిలిష్తీయులు దండెత్తివచ్చి షూనేములో శిబిరం ఏర్పాటు చేసుకున్నప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిని సమకూర్చి గిల్బోవలో శిబిరం ఏర్పాటు చేశాడు. 5సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినప్పుడు అతని హృదయం భయంతో నిండిపోయింది. 6సౌలు యెహోవా దగ్గర విచారణ చేశాడు కాని కలల ద్వారా గాని ఊరీము ద్వారా గాని ప్రవక్తల ద్వారా గాని అతనికి సమాధానం రాలేదు. 7సౌలు తన సహాయకులకు, “మీరు వెళ్లి మృతుల ఆత్మలతో మాట్లాడే స్త్రీని వెదకండి, అప్పుడు నేను వెళ్లి ఆమె దగ్గర విచారణ చేస్తాను” అని ఆజ్ఞాపించాడు.
అప్పుడు వారు, “ఎన్-దోరులో ఒక స్త్రీ ఉంది” అని చెప్పారు.
8కాబట్టి సౌలు మారువేషం వేసుకుని వేరే బట్టలు ధరించి ఇద్దరు మనుష్యులతో పాటు బయలుదేరి రాత్రివేళ ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, “చనిపోయినవారి ఆత్మతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పేవాన్ని రప్పించు” అని అడిగాడు.
9అయితే ఆ స్త్రీ అతనితో, “సౌలు ఏమి చేశాడో నీకు తెలుసు కదా; అతడు మృతుల ఆత్మలతో మాట్లాడేవారిని, ఆత్మలతో మాట్లాడేవారిని దేశంలో ఉండకుండ వారిని తొలగించాడు. నాకు మరణం వచ్చేలా నా ప్రాణానికి ఎందుకు ఉచ్చు బిగిస్తున్నావు?” అన్నది.
10అందుకు సౌలు ఆమెతో, “సజీవుడైన యెహోవా పేరిట ప్రమాణం చేసి చెప్తున్న, ఇలా చేసినందుకు నీవు శిక్షించబడవు” అని యెహోవాను బట్టి ప్రమాణం చేశాడు.
11అప్పుడు ఆ స్త్రీ, “నీతో మాట్లాడడానికి నేనెవరిని రప్పించాలి?” అని అడిగింది.
అందుకతడు, “సమూయేలును రప్పించు” అన్నాడు.
12ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు చాలా గట్టిగా కేక వేసి, “నీవు సౌలువే కదా నీవు నన్నెందుకు మోసం చేశావు?” అని సౌలును అడిగింది.
13అందుకు రాజు ఆమెతో, “భయపడకు, నీకు ఏమి కనబడింది?” అని అడిగాడు.
ఆమె, “దేవుళ్ళలో ఒకడు భూమిలో నుండి పైకి రావడం నేను చూశాను” అని చెప్పింది.
14అందుకు, “అతని రూపం ఎలా ఉంది?” అని అడిగాడు.
ఆమె, “దుప్పటి కప్పుకున్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడు” అన్నది.
సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని మోకరించి సాష్టాంగపడ్డాడు.
15అప్పుడు సమూయేలు సౌలును, “నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందరపెట్టావు?” అని అడిగాడు.
అందుకు సౌలు, “నేను చాలా బాధల్లో ఉన్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వస్తే దేవుడు నా నుండి దూరమయ్యారు. ప్రవక్తల ద్వారా గాని కలల ద్వారా గాని ఆయన నాకు ఏ సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఏం చేయాలో నాకు చెప్తావని నిన్ను పిలిచాను” అన్నాడు.
16అందుకు సమూయేలు, “యెహోవా నిన్ను విడిచిపెట్టి నీకు శత్రువైనప్పుడు నీవు నన్ను ఎందుకు అడుగుతావు? 17యెహోవా నా ద్వారా ప్రవచించిన దానిని నెరవేర్చారు. యెహోవా నీ చేతి నుండి రాజ్యాన్ని తీసివేసి దానిని నీ పొరుగువాడైన దావీదుకు ఇచ్చారు. 18నీవు యెహోవా ఆజ్ఞకు లోబడకుండా అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపాన్ని అమలు చేయలేదు కాబట్టి యెహోవా ఈ రోజు నీకు ఈ విధంగా చేస్తున్నారు. 19యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తారు, రేపు నీవు నీ కుమారులు నాతో పాటు ఉంటారు. యెహోవా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని కూడా ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తారు” అని సౌలుతో చెప్పాడు.
20సమూయేలు మాటలకు చాలా భయపడిన సౌలు వెంటనే నేలపై నిలువుగా పడిపోయాడు. అతడు ఆ రోజంతా పగలు రాత్రి భోజనం చేయకపోవడంతో చాలా బలహీనమయ్యాడు.
21అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు భయభ్రాంతులకు గురవ్వడం చూసి, “నా ప్రభువా, నీ సేవకురాలినైన నేను నీ ఆజ్ఞకు లోబడ్డాను. నా ప్రాణాన్ని నా చేతిలో పెట్టుకుని నీవు నాతో చెప్పిన మాటలు విని అలాగే చేశాను. 22ఇప్పుడు నీ సేవకురాలినైన నేను చెప్పే మాటలు విను, నేను నీకు కొంత ఆహారం ఇస్తాను, నీవు భోజనం చేసి బయలుదేరి వెళ్లడానికి బలం తెచ్చుకో” అని అతనితో చెప్పింది.
23కాని అతడు ఒప్పుకోకుండా, “భోజనం చేయను” అని చెప్పాడు.
అతని సేవకులు ఆ స్త్రీతో పాటు కలిసి అతని బలవంతం చేసినప్పుడు అతడు వారి మాట విని నేల మీద నుండి లేచి మంచం మీద కూర్చున్నాడు.
24ఆ స్త్రీ తన ఇంట్లో ఉన్న క్రొవ్విన మగ దూడను తెచ్చి త్వరగా వండి పిండి తెచ్చి పిసికి పులియని రొట్టెలు కాల్చింది. 25వాటిని తెచ్చి సౌలుకు అతని సేవకులకు వడ్డించగా వారు భోజనం చేసి ఆ రాత్రే బయలుదేరి వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 28: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.