2 దినవృత్తాంతములు 13
13
యూదా రాజైన అబీయా
1యరొబాము పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అబీయా యూదా దేశానికి రాజయ్యాడు. 2అతడు యెరూషలేములో మూడేళ్ళు పరిపాలించాడు. అతని తల్లి పేరు మయకా;#13:2 కొ. ప్ర. లలో మీకాయా అని వాడబడింది; 11:20; 1 రాజులు 15:2 ఈమె గిబియా పట్టణం వాడైన ఊరియేలు కుమార్తె.#13:2 లేదా మనుమరాలు
అబీయాకు యరొబాముకు మధ్య యుద్ధం జరిగింది. 3అబీయా నాలుగు లక్షలమంది సమర్థులైన సైనికులతో యుద్ధానికి వెళ్తే, యరొబాము ఎనిమిది లక్షలమంది సమర్థులైన సైనికులతో అతనికి వ్యతిరేకంగా యుద్ధ వ్యూహం రచించాడు.
4అబీయా ఎఫ్రాయిం కొండ సీమలో ఉన్న సెమరాయిము కొండమీద నిలబడి ఇలా అన్నాడు, “యరొబామా, సర్వ ఇశ్రాయేలు ప్రజలారా, నేను చెప్పేది వినండి! 5ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఉప్పు ఒడంబడిక#13:5 అంటే, ఆహారంలో ఉప్పు అనివార్యమైనది; అలాగే ఒడంబడిక ఉప్పును మార్చలేము. చేసి, ఇశ్రాయేలు రాజ్యపరిపాలనను శాశ్వతంగా దావీదు వారసులకు ఇచ్చాడు. ఈ సంగతి మీకు తెలియదా? 6అయినాసరే దావీదు కుమారుడైన సొలొమోను సేవకుడును నెబాతు కుమారుడునైన యరొబాము తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు. 7సొలొమోను కుమారుడైన రెహబాము యువకుడై నిర్ణయాలు తీసుకోలేనివాడై, వారిని ఎదిరించే శక్తి లేనివానిగా ఉన్నప్పుడు, కొందరు పనికిమాలిన పోకిరీలు అతని చుట్టూ చేరి, అతని మీదికి యుద్ధానికి వెళ్లారు.
8“ఇక ఇప్పుడేమో దావీదు వారసుల చేతుల్లో ఉన్న యెహోవా రాజ్యాన్ని ఎదిరించాలని మీరు ఆలోచిస్తున్నారు. నిజానికి మీరు మహా సైన్యంగా ఉన్నారు. మీతో యరొబాము మీకు దేవుళ్ళుగా చేయించిన బంగారు దూడలు ఉన్నాయి. 9అయితే మీరు అహరోను కుమారులైన యెహోవా యాజకులను, లేవీయులను వెళ్లగొట్టి, ఇతర దేశాల ప్రజల్లా మీ సొంత యాజకులను నియమించుకోలేదా? ఒక కోడెతో ఏడు పొట్టేళ్లతో తనను తాను పవిత్రం చేసుకోవడానికి వచ్చిన ప్రతివాడు దేవుళ్ళు కాని వాటికి యాజకులవుతున్నారు.
10“మా విషయానికొస్తే యెహోవాయే మా దేవుడు, మేము ఆయనను విడిచిపెట్టలేదు. యెహోవాకు సేవచేసే యాజకులు అహరోను కుమారులు; లేవీయులు వారికి సహాయం చేస్తారు. 11ప్రతి ఉదయం సాయంత్రం వారు యెహోవాకు దహనబలులు అర్పిస్తారు, పరిమళ ధూపం వేస్తారు. వారు ఆచారం ప్రకారం వారు పవిత్రమైన బల్లపై రొట్టెలు పెట్టి, ప్రతి సాయంత్రం బంగారు దీపస్తంభంపై దీపాలను వెలిగిస్తారు. మేము మా దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటిస్తున్నాము. కాని మీరు ఆయనను విడిచిపెట్టారు. 12దేవుడు మాతో ఉన్నారు; ఆయన మా నాయకుడు. ఆయన యాజకులు తమ బూరలతో మీమీద యుద్ధనాదం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ పూర్వికుల దేవుడైన యెహోవాతో పోరాడకండి, ఎందుకంటే మీరు గెలువలేరు.”
13కాని యరొబాము కొంత సైన్యాన్ని వెనుకకు పంపాడు. అతడు యూదా వారికి ముందు ఉన్నప్పుడు మాటుగాండ్రు వారి వెనుక ఉండేలా చేశాడు. 14యూదా వారు, తాము ముందు వెనుక ముట్టడి చేయబడ్డామని తెలుసుకుని యెహోవాకు మొరపెట్టారు. యాజకులు తమ బూరలు ఊదగా, 15యూదా వారు యుద్ధనాదం చేశారు. వారు చేసిన యుద్ధనాదం వినబడడంతోనే దేవుడు అబీయా ఎదుట యూదా వారి ఎదుట యరొబామును ఇశ్రాయేలు సైన్యమంతటిని తరిమివేశారు. 16ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయారు. దేవుడు ఇశ్రాయేలు వారిని యూదా వారి చేతులకు అప్పగించారు. 17అబీయా అతని సేనలు వారికి భారీ ప్రాణనష్టం కలిగించగా ఇశ్రాయేలీయుల సమర్థులలో అయిదు లక్షలమంది సైనికులు మరణించారు. 18ఈ విధంగా ఇశ్రాయేలీయులు అణచివేయబడ్డారు. యూదా ప్రజలు తమ పూర్వికుల దేవుడైన యెహోవాపై ఆధారపడ్డారు కాబట్టి వారు విజయం సాధించారు.
19అబీయా యరొబామును వెంటాడి, అతని వశంలో నుండి బేతేలును దాని పట్టణాలను, యెషానాను ఎఫ్రోనునూ వాటి చుట్టూ ఉన్న గ్రామాలను స్వాధీనపరచుకున్నాడు. 20అబీయా రోజుల్లో యరొబాము మళ్ళీ బలపడలేదు. యెహోవా అతన్ని మొత్తాడు కాబట్టి అతడు చనిపోయాడు.
21కానీ అబీయా బలాభివృద్ధి చెందాడు. అతడు పద్నాలుగు మంది స్త్రీలను పెళ్ళి చేసుకున్నాడు; అతనికి ఇరవై రెండు మంది కుమారులు, పదహారు మంది కుమార్తెలు.
22అబీయా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు ఏమి చేశాడో ఏమి చెప్పాడో, అవన్నీ ప్రవక్తయైన ఇద్దో రచించిన వ్యాఖ్యాన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 13: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.