2 దినవృత్తాంతములు 14
14
1అబీయా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు ఆసా రాజయ్యాడు. అతని రోజుల్లో దేశం పది సంవత్సరాలు ప్రశాంతంగా ఉండింది.
యూదా రాజైన ఆసా
2ఆసా యెహోవా దృష్టిలో మంచిది, సరియైనది చేశాడు. 3అతడు ఇతర దేవుళ్ళ బలిపీఠాలను, క్షేత్రాలను తొలగించాడు. అషేరా దేవి స్తంభాలను#14:3 అంటే, అషేరా దేవత యొక్క చెక్క బొమ్మలు; ఇక్కడ 2 దినవృత్తాంతములో వేరే చోట్ల కూడా పడగొట్టించాడు. 4అతడు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వారు తెలుసుకొని, ఆయన నియమాలను ఆజ్ఞలను అనుసరించాలని యూదా ప్రజలకు ఆజ్ఞాపించాడు. 5అతడు యూదాలోని ప్రతి పట్టణంలోని ఉన్నత క్షేత్రాలను, ధూపవేదికలను తొలగించాడు. అతని పరిపాలనలో దేశం ప్రశాంతంగా ఉంది. 6దేశం ప్రశాంతంగా ఉన్నప్పుడు అతడు యూదాలో కోటగోడలు గల పట్టణాలు కట్టించాడు. యెహోవా అతనికి విశ్రాంతి ఇవ్వగా ఆ సంవత్సరాల్లో అతనితో ఎవరూ యుద్ధం చేయలేదు.
7ఆసా యూదా వారితో, “మనం యెహోవాను వెదికి అనుసరించాం కాబట్టి ఈ దేశం ఇంకా మన స్వాధీనంలోనే ఉంది. ఆయనను వెదకి అనుసరించాం కాబట్టి మనం ఈ పట్టణాలను కట్టి, వాటికి చుట్టూ గోడలు, గోపురాలు, ద్వారాలు, అడ్డగడియలు అమర్చుదాం” అన్నాడు. అలాగే వారు పట్టణాలను కట్టి వర్థిల్లారు.
8ఆసాకు యూదా వారిలో 3,00,000 మంది సైనికులు ఉన్నారు. వారికి పెద్ద డాళ్లు ఈటెలు ఉన్నాయి. అతనికి బెన్యామీనీయులలో 2,80,000 మంది సైనికులున్నారు. వారికి చిన్న డాళ్లు, విల్లులు ఉన్నాయి. వీరంతా పోరాట యోధులు.
9తర్వాత కూషు వాడైన జెరహు వేవేల సైన్యంతో, మూడువందల రథాలతో వారిపైకి దండెత్తి మరేషా పట్టణం వరకు వచ్చాడు. 10ఆసా అతన్ని ఎదుర్కోడానికి వెళ్లాడు. వారు మరేషాకు దగ్గరలో ఉన్న జెపాతా లోయలో బారులు తీరారు.
11అప్పుడు ఆసా యెహోవాకు, “యెహోవా, బలవంతులతో యుద్ధంలో బలహీనులకు సహాయం చేయడానికి మీరు తప్ప ఇంకెవరు లేరు. యెహోవా, మా దేవా! మేము మీమీద నమ్మకం పెట్టుకున్నాము. మీ పేర మేము ఈ మహా సైన్యాన్ని ఎదిరించడానికి వచ్చాం కాబట్టి సాయం చేయండి. యెహోవా మీరే మా దేవుడు. మానవమాత్రులను మీకు వ్యతిరేకంగా నిలువనీయకండి” అని ప్రార్థన చేశాడు.
12ఆసా ఎదుట యూదా వారి ఎదుట యెహోవా కూషువారిని మొత్తగా వారు పారిపోయారు. 13ఆసా, అతనితో ఉన్నవారు వారిని గెరారు వరకు వెంటాడారు. కూషు వారిలో చాలామంది కూలారు, కాబట్టి వారు మళ్ళీ బలాన్ని కూడగట్టుకోలేక యెహోవా ఎదుట ఆయన సైన్యం ఎదుట నుండి పారిపోయారు. యూదా వారు అధిక మొత్తంలో దోపుడుసొమ్ము దోచుకున్నారు. 14గెరారు చుట్టూరా ఉన్న గ్రామాలను యెహోవా భయం ఆవరించింది కాబట్టి యూదా వారు వాటన్నిటిని ఓడించి దోచుకొని, చాలా దోపుడుసొమ్ము తీసుకున్నారు. 15వారు పశువుల కాపరుల గుడారాలపై కూడా దాడి చేశారు. అంతేకాదు గొర్రెలు, మేకలు ఒంటెల మందలను కూడా తీసుకెళ్లారు. తర్వాత వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 14: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.