2 దినవృత్తాంతములు 15

15
ఆసా సంస్కరణలు
1దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి దిగిరాగా, 2అతడు ఆసాను కలుసుకోడానికి వెళ్లి అతనితో ఇలా చెప్పాడు, “ఆసా, సర్వ యూదా ప్రజలారా, బెన్యామీనీయులారా, నేను చెప్పేది వినండి. మీరు యెహోవాతో ఉంటే ఆయన మీతో ఉంటారు. మీరు ఆయనను వెదికితే, ఆయన మీకు కనిపిస్తారు. ఒకవేళ మీరు ఆయనను విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతారు. 3ఎందుకంటే చాలా కాలం వరకు ఇశ్రాయేలు ప్రజలు నిజమైన దేవుడు గాని, బోధించడానికి యాజకులు గాని, ధర్మశాస్త్రం గాని లేకుండానే గడిపారు. 4అయితే తమ బాధలో వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయనను వెదికారు. ఆయన వారికి దొరికారు. 5ఆ రోజుల్లో ప్రయాణం చేయడం క్షేమం కాదు, ఎందుకంటే దేశాల వాసులంతా గొప్ప కలవరంలో ఉన్నారు. 6ఒక దేశం మరొక దేశాన్ని, ఒక పట్టణం మరొక నగరాన్ని నాశనం చేసుకుంటున్నాయి, ఎందుకంటే దేవుడు వారిని అన్ని రకాల బాధలతో ఇబ్బంది పెడుతున్నారు. 7అయితే మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, ఆశ వదులుకోవద్దు, ఎందుకంటే మీ పనికి ప్రతిఫలం లభిస్తుంది.”
8ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా విని ధైర్యం తెచ్చుకున్నాడు. యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి, ఎఫ్రాయిం కొండ సీమలో తాను వశం చేసుకున్న పట్టణాల్లో ఉన్న విగ్రహాలను, అసహ్యమైన వాటన్నిటిని తీసివేశాడు. యెహోవా ఆలయ ఆవరణంలో ఉన్న బలిపీఠాలన్ని మరమ్మత్తు చేయించాడు.
9అతని దేవుడైన యెహోవా ఆసాకు తోడుగా ఉండడం చూసి పెద్ద సంఖ్యలో ఇశ్రాయేలు రాజ్యాన్ని విడచి అతని పక్షం చేరారు. ఆసా తన దగ్గరకు యూదా వారందరినీ బెన్యామీను వారందరినీ వారి మధ్య నివసిస్తున్న ఎఫ్రాయిం, మనష్షే, షిమ్యోను గోత్రాల వారిని సమకూర్చాడు.
10ఆసా పరిపాలిస్తున్న పదిహేనో సంవత్సరం మూడవ నెల వారు యెరూషలేములో సమకూడారు. 11ఆ రోజు వారు యెహోవాకు 700 ఎద్దులు, 7,000 గొర్రెలు బలిగా అర్పించారు. ఇవన్నీ వారు దోపిడిగా తీసుకువచ్చిన వాటిలోనివి. 12వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు మనస్పూర్తిగా హృదయపూర్వకంగా వెదికి అనుసరిస్తామని ఒడంబడిక చేశారు. 13ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకనివారు స్త్రీలైనా పురుషులైనా పెద్దలైనా చిన్నలైనా, వారికి మరణశిక్ష విధించాలని నిర్ణయించారు. 14వారు కంఠమెత్తి పెద్దగా కేకలువేస్తూ బూరలు, కొమ్ములు ఊదుతూ, యెహోవా సమక్షంలో ప్రమాణం చేశారు. 15ఆ విధంగా యూదా వారంతా హృదయమంతటితో ప్రమాణం చేశారు కాబట్టి ఆ ప్రమాణం విషయం అందరు సంతోషించారు. వారు మనస్పూర్తిగా యెహోవాను వెదికారు. ఆయన వీరికి దొరికాడు. అన్ని దిశలా వారికి నెమ్మదిని ఇచ్చారు.
16రాజైన ఆసా అతని అవ్వ మయకా అషేరాను పూజించడానికి ఒక అసహ్యమైన ప్రతిమను చేయించింది కాబట్టి ఆమెను రాజమాత స్థానం నుండి తొలగించాడు. ఆసా ఆ ప్రతిమను కూలగొట్టి విరగ్గొట్టి, కిద్రోను లోయలో దానిని తగలబెట్టాడు. 17అతడు ఇశ్రాయేలు నుండి క్షేత్రాలను మాత్రం తొలగించనప్పటికీ, ఆసా బ్రతికిన కాలమంతా యెహోవాకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. 18అతడు, తాను తన తండ్రి ప్రతిష్ఠించిన బంగారం వెండి పాత్రలను దేవుని ఆలయానికి తెచ్చాడు.
19ఆసా పరిపాలనలో ముప్పై అయిదవ సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 దినవృత్తాంతములు 15: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి