2 దినవృత్తాంతములు 28
28
యూదా రాజైన ఆహాజు
1ఆహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. తన పితరుడైన దావీదులా కాకుండా, అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేయలేదు. 2అతడు ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు, అతడు బయలును పూజించడానికి విగ్రహాలు చేయించాడు. 3అతడు బెన్ హిన్నోము లోయలో బలులను కాల్చివేసి, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా ఏ జనాలనైతే వెళ్లగొట్టారో, ఆ జనాలు చేసిన హేయక్రియలు చేసి, తన కుమారులను అగ్నిలో బలి ఇచ్చాడు. 4అతడు క్షేత్రాల్లో, కొండలమీద, పచ్చని ప్రతి చెట్టు క్రింద బలులు అర్పిస్తూ ధూపం వేసేవాడు.
5కాబట్టి అతని దేవుడైన యెహోవా అతన్ని సిరియా రాజు చేతికి అప్పగించారు. సిరియనులు అతన్ని ఓడించి, అతని ప్రజల్లో చాలామందిని బందీలుగా పట్టుకుని దమస్కుకు తీసుకెళ్లారు.
అతడు ఇశ్రాయేలు రాజు చేతికి కూడా అప్పగించబడ్డాడు, అతడు ఆహాజుకు భారీ ప్రాణనష్టాన్ని కలిగించాడు. 6రెమల్యా కుమారుడైన పెకహు ఒకేరోజున యూదాలో 1,20,000 మంది సైనికులను చంపాడు, అలా జరగడానికి కారణం యూదా వారు తమ పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టడమే. 7ఎఫ్రాయిమీయుల యోధుడైన జిఖ్రీ, రాజకుమారుడైన మయశేయాను, రాజభవనానికి అధికారియైన అజ్రీకామును, రాజు తర్వాత రెండవ స్థాయి వాడైన ఎల్కానాను చంపాడు. 8ఇశ్రాయేలీయులు తమ తోటి ఇశ్రాయేలీయుల నుండి రెండు లక్షలమంది భార్యలను, కుమారులను, కుమార్తెలను యూదా నుండి బందీలుగా తీసుకున్నారు. వారు గొప్ప దోపుడుసొమ్మును దోచుకుని తిరిగి సమరయకు తీసుకెళ్లారు.
9అయితే యెహోవా ప్రవక్తయైన ఓదేదు అనే ఒకడు అక్కడ ఉన్నాడు. అతడు సమరయకు వస్తున్న సైన్యాన్ని కలుసుకోడానికి వెళ్లి వారితో ఇలా చెప్పాడు, “మీ పూర్వికుల దేవుడైన యెహోవాకు యూదా వారి మీద కోపం వచ్చి, వారిని మీ చేతికి అప్పగించారు. కానీ మీరు ఆకాశాన్నంటే క్రోధంతో వారిని చంపేశారు. 10ఇప్పుడు యూదా, అలాగే యెరూషలేములోని స్త్రీ పురుషులను మీ బానిసలుగా చేసుకోవాలనేది మీ ఆలోచన. అయితే మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు కూడా అపరాధులు కారా? 11ఇప్పుడు నా మాట వినండి! మీరు బందీలుగా పట్టుకున్న మీ తోటి ఇశ్రాయేలీయులను తిరిగి పంపించండి, ఎందుకంటే యెహోవా తీవ్రమైన కోపం మీపై ఉంది.”
12ఎఫ్రాయిమీయుల పెద్దలైన యెహోహనాను కుమారుడైన అజర్యా, మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లాయి కుమారుడైన అమాశా అనేవారు యుద్ధం నుండి తిరిగివస్తున్న వారికి ఎదురుగా నిలబడి. 13వారితో, “మీరు ఈ బందీలను ఇక్కడకు తీసుకురాకూడదు, యెహోవా ఎదుట మేము దోషులమవుతాము. మీరు మా పాపాలను దోషాలను ఇంకా ఎక్కువ వేయాలనుకుంటున్నారా? ఇప్పటికే మా దోషం ఎంతో ఎక్కువగా ఉంది, యెహోవా రగులుతున్న కోపం ఇశ్రాయేలు మీద ఉంది” అని చెప్పారు.
14కాబట్టి సైనికులు ఆ బందీలను, దోపుడుసొమ్మును అధికారులు, సమాజమంతటి సమక్షంలో విడిచిపెట్టారు. 15పేరు బట్టి నియమితులైన వారు దోపిడిలో నుండి వస్త్రాలు, చెప్పులు తీసి నగ్నంగా ఉన్న బందీలకు ఇచ్చారు. తినడానికి ఆహారం, త్రాగడానికి నీరు, ఔషధ తైలాన్ని ఇచ్చారు. నీరసించిన వారిని గాడిదల మీద ఎక్కించారు. అప్పుడు బందీలను ఖర్జూరపు చెట్ల పట్టణం అనే పేరున్న యెరికోకు తీసుకెళ్లి వారి స్వదేశస్థుల దగ్గర వదిలి, తిరిగి సమరయకు వచ్చారు.
16ఆ కాలంలో అష్షూరుదేశపు రాజులను సాయం చేయమని ఆహాజు రాజు కబురు పంపాడు. 17ఎందుకంటే, మరోసారి ఎదోమీయులు యూదా మీదికి దండెత్తివచ్చి, కొందరిని బందీలుగా పట్టుకుపోయారు. 18ఫిలిష్తీయులు యూదాలోని దక్షిణ పర్వత ప్రాంతాలలోని పట్టణాలపై దాడి చేశారు. వారు బేత్-షెమెషు, అయ్యాలోను గెదెరోతు, అలాగే శోకో, తిమ్నా గిమ్జో వాటి చుట్టుప్రక్కల గ్రామాలను స్వాధీనం చేసుకుని ఆక్రమించారు. 19ఆహాజు యూదా ప్రజల్లో దుష్టత్వం పెరిగేలా చేసి యెహోవాకు నమ్మకద్రోహం చేశాడు, కాబట్టి ఇశ్రాయేలు#28:19 ఇది, తరచుగా 2 దినవృత్తాంతములో యూదా అని వాడబడింది రాజైన ఆహాజు కారణంగా యెహోవా యూదా రాజ్యాన్ని అణచివేశారు. 20అష్షూరు రాజు తిగ్లత్-పిలేసెరు#28:20 హెబ్రీలో పిల్నేసెరు ఆహాజుకు సహాయం చేయడానికి వచ్చాడు గాని, అతని ద్వారా ఆహాజుకు కష్టమే కలిగింది కాని లాభం కాదు. 21ఆహాజు యెహోవా మందిరంలో నుండి రాజభవనంలో నుండి, అధిపతుల దగ్గరనుండి కొంత సొమ్ము తీసి అష్షూరు రాజుకు ఇచ్చాడు. కాని, దానివలన కూడా సాయం దొరకలేదు.
22ఆ ఆపదకాలంలో ఆహాజు రాజు యెహోవా పట్ల ఇంకా నమ్మకద్రోహం చేశాడు. 23తనను ఓడించిన దమస్కు నగరవాసులకున్న దేవుళ్ళకు బలులు అర్పించాడు. “సిరియా రాజులకు వారి దేవుళ్ళు సహాయం చేసినట్లు నాకూ సాయం చేసేలా నేను వాటికి బలులు అర్పిస్తాను” అని అనుకున్నాడు. అయితే ఆ దేవుళ్ళ వలన అతనికి ఇశ్రాయేలు ప్రజలందరికి పతనం కలిగింది.
24ఆహాజు యెహోవా మందిరంలో ఉన్న సామాగ్రిని పోగుచేయించి వాటిని ముక్కలు చేశాడు. యెహోవా ఆలయ ద్వారాలు మూసివేసి, యెరూషలేము అంతా బలిపీఠాలను కట్టించాడు. 25యూదా దేశంలోని పట్టణాలన్నిటిలో అతడు ఇతర దేవుళ్ళకు ధూపం వేయడానికి బలిపీఠాలను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం తెప్పించారు.
26ఆహాజు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతని విధానాలన్నీ, మొదటి నుండి చివరి వరకు, యూదా, ఇశ్రాయేలు రాజు గ్రంథంలో వ్రాసి ఉన్నాయి. 27ఆహాజు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతన్ని యెరూషలేము పట్టణంలో పాతిపెట్టారు గాని, ఇశ్రాయేలు రాజు సమాధుల్లో కాదు. అతని తర్వాత అతని కుమారుడైన హిజ్కియా రాజయ్యాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 28: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.