2 దినవృత్తాంతములు 29
29
హిజ్కియా మందిరాన్ని శుద్ధి చేయుట
1హిజ్కియా రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు అబీయా, ఆమె జెకర్యా కుమార్తె. 2అతడు తన పితరుడైన దావీదు చేసినట్లు, యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు.
3అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెలలో యెహోవా ఆలయ ద్వారాలను తెరిచి వాటికి మరమ్మత్తు చేయించాడు. 4అతడు యాజకులను, లేవీయులను పిలిపించి, వారిని ఆలయానికి తూర్పున ఉన్న విశాల స్థలంలో సమకూర్చి, 5వారితో ఇలా చెప్పాడు: “లేవీయులారా! నేను చెప్పేది వినండి! ఇప్పుడు మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకుని, మీ పూర్వికుల దేవుడైన యెహోవా మందిరాన్ని పవిత్రపరచండి. పరిశుద్ధాలయంలో నుండి అపవిత్రమైన ప్రతిదీ తీసివేయండి. 6మన తండ్రులు నమ్మకద్రోహులుగా ఉన్నారు; మన దేవుడైన యెహోవా దృష్టికి ఏది చెడ్డదో అదే చేసి, వారు ఆయనను విడిచిపెట్టారు. ఆయన నివాసస్థలం వైపు నుండి ముఖం త్రిప్పుకొని వారు ఆయనను నిర్లక్ష్యం చేశారు. 7వారు మండపం తలుపులు మూసివేసి, దీపాలను ఆర్పివేశారు. వారు ఇశ్రాయేలు దేవునికి పరిశుద్ధాలయం దగ్గర ధూపం వేయలేదు, దహనబలులు అర్పించలేదు. 8కాబట్టి యెహోవా కోపం యూదా, యెరూషలేము మీద రగులుకుంది. మీరు కళ్ళారా చూస్తున్నట్లుగా ఆయన వారిని భయాందోళనలకు నిందకు గురి చేశారు. 9అందుకే మన తండ్రులు కత్తివేటుకు గురయ్యారు, మన కుమారులు, కుమార్తెలు మన భార్యలు వారికి బందీలుగా ఉన్నారు. 10ఇప్పుడు ఆయన కోపం మనమీద నుండి మళ్ళేలా ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవాతో ఒడంబడిక చేయాలని ఉద్దేశించాను. 11నా కుమారులారా! మీరు ఆయనకు పరిచారకులుగా ఉండి ధూపం వేయాలని తన ఎదుట నిలబడి సేవ జరిగించాలని యెహోవా మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఈ సమయంలో మీరు అశ్రద్ధ చూపకండి.”
12అప్పుడు ఈ లేవీయులు పనికి నియమించబడ్డారు:
కహాతీయుల నుండి:
అమాశై కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు,
మెరారీయుల నుండి:
అబ్దీ కుమారుడైన కీషు, యెహల్లెలేలు కుమారుడైన అజర్యా,
గెర్షోనీయుల నుండి:
జిమ్మా కుమారుడైన యోవాహు, యోవాహు కుమారుడైన ఏదెను.
13ఎలీషాపాను సంతతి నుండి:
షిమ్రీ యెహీయేలు,
ఆసాపు సంతతి నుండి:
జెకర్యా, మత్తన్యా,
14హేమాను సంతతి నుండి:
యెహీయేలు, షిమీ,
యెదూతూను సంతతి నుండి:
షెమయా, ఉజ్జీయేలు.
15వారు తమ సోదరులను తోటి లేవీయులను సమకూర్చి తమను పవిత్రం చేసుకున్నారు. అప్పుడు రాజు ఆదేశించిన ప్రకారం యెహోవా వాక్కును అనుసరించి, యెహోవా మందిరం శుద్ధి చేయడానికి లోపలికి వెళ్లారు. 16యెహోవా గర్భాలయాన్ని శుద్ధి చేయడానికి యాజకులు లోనికి వెళ్లారు. యెహోవా మందిరంలో కనిపించిన అపవిత్రమైన ప్రతిదాన్ని వారు యెహోవా మందిరం నుండి ఆవరణంలోకి తెచ్చారు. లేవీయులు దాన్నంతా కిద్రోను లోయకు తీసుకెళ్లి పారవేశారు. 17మొదటి నెల మొదటి రోజున పవిత్రం చేయడం వారు ఆరంభించారు. ఆ నెల ఎనిమిదో రోజున యెహోవా మంటపం వరకు చేరారు. మరో ఎనిమిది రోజులు వారు యెహోవా మందిరాన్ని పవిత్రం చేస్తూ వచ్చారు. మొదటి నెల పదహారో రోజు ఆ పని ముగించారు.
18అప్పుడు వారు రాజైన హిజ్కియా దగ్గరకు వెళ్లి ఇలా చెప్పారు, “యెహోవా ఆలయమంతా మేము శుద్ధి చేశాము. దహనబలిపీఠాన్ని, దాని సామాగ్రిని, సన్నిధి రొట్టెలు ఉంచే బల్లను, దాని సామాగ్రిని శుద్ధి చేశాము. 19ఆహాజు రాజు తన పరిపాలనలో నమ్మకద్రోహం చేసి తొలగించిన వస్తువులన్నిటిని కూడా సిద్ధం చేసి పవిత్రపరచాము. అవి ఇప్పుడు యెహోవా బలిపీఠం ముందు ఉన్నాయి.”
20మరుసటిరోజు ఉదయమే లేచి రాజైన హిజ్కియా నగర అధికారులను సమకూర్చి యెహోవా ఆలయానికి వెళ్లాడు. 21వారు రాజ్యం కోసం, పరిశుద్ధాలయం కోసం, యూదా వారి కోసం బలిగా ఏడు కోడెలు, ఏడు పొట్టేళ్లు, ఏడు గొర్రెలు, ఏడు మేకపోతులు తెచ్చారు. అది పాపపరిహారబలిగా తెచ్చారు. అహరోను వారసులైన యాజకులను, “యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించాలి” అని రాజు ఆదేశించాడు. 22అప్పుడు వారు కోడెలను వధించారు. యాజకులు వాటి రక్తం తీసుకుని బలిపీఠం మీద చల్లారు. తర్వాత పొట్టేళ్ళను వధించి వాటి రక్తం బలిపీఠం మీద చల్లారు. గొర్రెపిల్లలను కూడా వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. 23పాపపరిహారబలిగా ఉన్న మేకపోతులను రాజు ఎదుట సమకూడినవారి ఎదుటకు తెచ్చారు. వారు వాటి మీద చేతులుంచారు. 24అప్పుడు యాజకులు వాటిని వధించి, ఇశ్రాయేలు ప్రజలు బలిగా వాటి రక్తం బలిపీఠం మీద పోశారు. ఇశ్రాయేలు ప్రజలందరి ప్రాయశ్చిత్తంగా దహనబలి, పాపపరిహారబలి అర్పించాలని రాజు ఆదేశించాడు, కాబట్టి వారు అలా చేశారు.
25మునుపు దావీదు రాజు, అతని దీర్ఘదర్శియైన గాదు, ప్రవక్తయైన నాతాను ఆదేశించిన ప్రకారం, హిజ్కియా లేవీయులను తాళాలతో, స్వరమండలాలతో, తంతి వాయిద్యాలతో యెహోవా మందిరంలో ఉంచాడు. ఇలా చేయాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించాడు. 26దావీదు చేయించిన వాయిద్యాలను లేవీయులు, బూరలను యాజకులు చేతపట్టుకుని నిలబడ్డారు.
27బలిపీఠం మీద దహనబలులను అర్పించమని హిజ్కియా ఆజ్ఞాపించాడు. బలిపీఠం మీద దహనబలులు అర్పించడం ఆరంభం కాగానే బూరలతో, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యాలతో యెహోవాకు స్తుతి పాటలు పాడడం ఆరంభమైంది. 28గాయకులు పాటలు పాడుతూ, సంగీతకారులు వాయిద్యాలు వాయిస్తూ, బూరల ఊదుతూ ఉండగా సమాజమంతా తలలు వంచి ఆరాధించారు. దహనబలి అర్పణ ముగిసేవరకు ఇదంతా జరుగుతూ ఉండింది.
29దహనబలులు ముగిసినప్పుడు రాజు, అతనితో ఉన్నవారంతా మోకరించి ఆరాధన చేశారు. 30దావీదు, దీర్ఘదర్శియైన ఆసాపు వ్రాసిన కీర్తనలు పాడి యెహోవాను స్తుతించాలని లేవీయులకు హిజ్కియారాజు అధికారులు ఆదేశించారు. వారు ఆనందంతో స్తుతిగానం చేస్తూ తలలు వంచి ఆరాధించారు.
31అప్పుడు హిజ్కియా ప్రజలతో, “యెహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకున్నారు, దగ్గరకు రండి, యెహోవా ఆలయానికి బలులు, కృతజ్ఞతార్పణలు తీసుకురండి” అన్నాడు, హిజ్కియా అలాగే సమకూడినవారు బలులు, కృతజ్ఞతార్పణలు తెచ్చారు. ఇష్టమున్న వారంతా దహనబలులు కూడా తెచ్చారు.
32సమకూడినవారు తెచ్చిన దహనబలులు డెబ్బై కోడెలు, నూరు పొట్టేళ్లు, రెండు వంద గొర్రెపిల్లలు. అవన్నీ యెహోవాకు దహనబలులు. 33బలి అర్పించబడిన జంతువులు ఆరువందల కోడెలు మూడు వేల గొర్రెలు మేకలు. 34యాజకులు కొద్దిమందే ఉన్నారు కాబట్టి దహనబలిగా దహనబలి పశువులన్నిటి చర్మం ఒలువలేకపోయారు. పనంతా పూర్తయ్యే వరకు, ఇతర యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకునే వరకు, వారి వంశీయులు లేవీయులు సాయం చేశారు. యాజకులకంటే లేవీయులే ప్రతిష్ఠించుకునే విషయంలో యథార్థంగా ఉన్నారు. 35సమృద్ధిగా దహనబలి పశువుల సమాధానబలుల ఉన్నాయి, దానితో పాటు దహనబలుల క్రొవ్వు దహనబలులతో పాటు పానార్పణలు ఉన్నాయి.
ఆ విధంగా యెహోవా మందిరంలో సేవ మళ్ళీ ప్రారంభించడం జరిగింది. 36అదంతా త్వరగానే జరిగింది కాబట్టి దేవుడు ప్రజలకు జరిగించిన దానిని చూసి హిజ్కియా, ప్రజలంతా ఆనందించారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 29: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.