2 దినవృత్తాంతములు 30

30
హిజ్కియా పస్కా పండుగ ఆచరించుట
1ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించడానికి యెరూషలేములో యెహోవా ఆలయానికి రమ్మని హిజ్కియా ఇశ్రాయేలు ప్రజలకు యూదా ప్రజలకు అందరికి కబురు పంపాడు. ఎఫ్రాయిం, మనష్షే గోత్రాలకు కూడా లేఖలు వ్రాసి పంపాడు. 2రాజు, అతని అధికారులు, యెరూషలేములో ఉన్న సమాజమంతా రెండవ నెలలో పస్కాను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. 3ఎందుకంటే, తగినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకోకపోవడం, ప్రజలు యెరూషలేములో సమావేశం కాకపోవడం వలన ఎప్పుడు జరిపే సమయంలో వారు పండుగ జరుపుకోలేకపోయారు. 4ఆ విషయం రాజుకు సమాజం వారందరికి అంగీకారంగా ఉంది. 5ప్రజలంతా యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపుకోవాలని బెయేర్షేబ నుండి దాను వరకు ఇశ్రాయేలు అంతటా ప్రకటించాలని వారు నిర్ణయించుకున్నారు. చాలాకాలంగా వ్రాయబడిన ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజలు పండుగ జరుపుకోలేదు.
6రాజు, అతని అధికారుల నుండి ఉత్తరాలు తీసుకుని వార్తాహరులు రాజాజ్ఞ ప్రకారం యూదా, ఇశ్రాయేలు దేశమంతా వెళ్లారు. ఆ ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది:
“ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపుకు తిరగండి. అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకుని మిగిలి ఉన్న మీ దగ్గరకు ఆయన తిరిగి వస్తారు. 7తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసిన మీ తల్లిదండ్రుల్లా మీ తోటి ఇశ్రాయేలీయుల్లా ఉండకండి. మీరు చూస్తున్నట్లుగా ఆయన వారిని నాశనానికి అప్పగించారు. 8మీ పూర్వికుల్లా మూర్ఖంగా ప్రవర్తించకుండ యెహోవాకు లోబడండి. ఆయన శాశ్వతంగా పవిత్రం చేసి ప్రత్యేకించుకున్న పరిశుద్ధాలయంలోకి రండి. మీ దేవుడైన యెహోవాను సేవించండి, అప్పుడు ఆయన తీవ్రమైన కోపం మీమీద నుండి మళ్ళవచ్చు. 9మీరు యెహోవా వైపు తిరిగితే మీ తోటి ఇశ్రాయేలీయులపై మీ పిల్లలపై వారిని బందీలుగా తీసుకువెళ్లిన వారికి కనికరం కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దయ కరుణ గలవారు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ నుండి తన ముఖం త్రిప్పుకోరు.”
10వార్తాహరులు జెబూలూను ప్రదేశం వరకు ఎఫ్రాయిం మనష్షేల దేశాల్లోని ప్రతి పట్టణానికి వెళ్లారు. అయితే ప్రజలు వారిని తృణీకరించి నవ్వులపాలు చేశారు. 11కాని, ఆషేరు, మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకొని యెరూషలేముకు వచ్చారు. 12యెహోవా ఆదేశం ప్రకారం రాజు, అతని అధికారులు ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేటట్టు యెహోవా హస్తం యూదా వారి మీద ఉంది. ఆయన వారికి ఏక మనస్సు కలిగించారు.
13రెండవ నెలలో పులియని రొట్టె పండుగ ఆచరించడానికి ప్రజలు గొప్ప సమూహంగా యెరూషలేములో సమకూడారు. 14యెరూషలేములో ఉన్న ఇతర బలిపీఠాలను వారు తొలగించారు. ధూపవేదికలు తీసివేసి కిద్రోను లోయలో పడవేశారు.
15రెండవ నెల పద్నాలుగవ రోజున వారు పస్కాబలి గొర్రెపిల్లను వధించారు. యాజకులు లేవీయులు సిగ్గుపడి, తమను పవిత్రం చేసుకుని యెహోవా ఆలయానికి దహనబలులు తెచ్చారు. 16దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం వారికి నియమించిన స్థలంలో యధావిధిగా వారు నిలబడ్డారు. లేవీయులు యాజకుల చేతికి రక్తం అందించగా వారు దానిని బలిపీఠం మీద చల్లారు. 17ఆ గుంపులో తమను పవిత్రం చేసుకోని వారు చాలామంది ఉన్నారు. అలా అపవిత్రంగా ఉండి తమ పస్కాబలి గొర్రెపిల్లలను యెహోవాకు ప్రతిష్ఠ చేయలేని ఆ వ్యక్తులందరి కోసం లేవీయులు వాటిని వధించవలసి వచ్చింది. 18ఎఫ్రాయిం మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను ప్రదేశాల నుండి వచ్చిన వారిలో చాలామంది తమను పవిత్రం చేసుకోలేదు. అయినా లేఖనాలకు విరుద్ధంగా వారు పస్కాను తిన్నారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు: “మంచివారైన యెహోవా, ప్రతి ఒక్కరిని క్షమించును గాక! 19పరిశుద్ధాలయ నియమాల ప్రకారం అపవిత్రంగా ఉన్నప్పటికీ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాను వెదికితే అలాంటి వారందరినీ యెహోవా క్షమించును గాక.” 20యెహోవా హిజ్కియా ప్రార్థన విని ప్రజలను బాగుచేశారు.
21యెరూషలేములో హాజరైన ఇశ్రాయేలు వారు మహానందంతో పులియని రొట్టె పండుగ ఏడు రోజులు ఆచరించారు. ప్రతిరోజు లేవీయులు, యాజకులు యెహోవాకు పాటలు పాడారు. యెహోవాను స్తుతిస్తూ వాయిద్యాలు వాయించారు.
22యెహోవా సేవ విషయంలో మంచి తెలివితేటలు చూపిన లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడాడు. ఏడు రోజులు వారు తమ నియమిత భాగాలు తింటూ, సమాధానబలులు అర్పిస్తూ, తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లించారు.#30:22 లేదా పాపాలు ఒప్పుకున్నారు
23సమాజమంతా మరో ఏడు రోజులు పండుగ జరుపుకోవాలని నిశ్చయించుకొని మరో ఏడు రోజులు ఆనందంగా జరుపుకున్నారు. 24యూదా రాజైన హిజ్కియా సభకు 1,000 కోడెలను 7,000 గొర్రెలను మేకలను అందించాడు, అధికారులు వారికి 1,000 ఎద్దులను 10,000 గొర్రెలు మేకలను అందించారు. పెద్ద సంఖ్యలో యాజకులు తమను తాము పవిత్రం చేసుకున్నారు. 25అప్పుడు యాజకులు, లేవీయులు, యూదావారిలో నుండి ఇశ్రాయేలీయులలో నుండి వచ్చిన సమాజపువారందరు, ఇశ్రాయేలు దేశం నుండి వచ్చి యూదాలో నివసిస్తున్న విదేశీయులు కూడా సంతోషించారు. 26యెరూషలేమంతా ఎంతో సంతోషంగా ఉంది. ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడైన సొలొమోను కాలం నుండి అంతవరకు యెరూషలేములో ఇలాంటిది జరుగలేదు. 27లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవించారు. వారి ప్రార్థన దేవుడు పవిత్ర నివాసమైన పరలోకానికి చేరింది. ఆయన వారి ప్రార్థన విన్నారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 దినవృత్తాంతములు 30: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి