2 సమూయేలు 19

19
1“రాజు అబ్షాలోము గురించి ఏడుస్తూ దుఃఖిస్తున్నాడు” అని ఎవరో యోవాబుకు చెప్పారు. 2“రాజు తన కుమారుని గురించి దుఃఖిస్తున్నాడు” అని సైనికులు విన్నారు కాబట్టి ఆ రోజు విజయం సైన్యమంతటికి దుఃఖంగా మారింది. 3యుద్ధం నుండి పారిపోయినందుకు సిగ్గుపడుతున్న సైనికులు ఆ రోజు దొంగల్లా పట్టణంలోకి ప్రవేశించారు. 4రాజు ముఖం కప్పుకుని, “నా కుమారుడా అబ్షాలోమా! అబ్షాలోమా నా కుమారుడా! నా కుమారుడా!” అని గట్టిగా ఏడ్చాడు.
5యోవాబు రాజభవనానికి వెళ్లి, “ఈ రోజు మీరు మీ ప్రాణాలను మీ కుమారుల కుమార్తెల ప్రాణాలను మీ భార్యల, ఉంపుడుగత్తెల ప్రాణాలను రక్షించిన మీ సైన్యమంతటిని అవమానపరిచారు. 6మిమ్మల్ని ద్వేషించేవారిని ప్రేమిస్తూ మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషిస్తున్నారు. మీ సేనాధిపతులు వారి సైన్యం మీకు ముఖ్యం కాదని ఈ రోజు మీరు స్పష్టం చేశారు. మేమందరం చనిపోయి అబ్షాలోము ఒక్కడే బ్రతికి ఉంటే మీ దృష్టికి సరియైనదిగా ఉండేది, మీరు సంతోషించేవారని నాకర్థమయ్యింది. 7ఇప్పుడు మీరు లేచి బయటకు వచ్చి మీ సైన్యాన్ని ప్రోత్సహించండి. మీరు ఇప్పుడు బయటకు రాకపోతే ఈ రాత్రి వారిలో ఒక్కడూ మీ దగ్గర ఉండరని యెహోవా పేరిట ఒట్టు పెట్టి చెప్తున్నాను. అది మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు మీకు వచ్చిన కష్టాల కన్నా తీవ్రంగా ఉంటుంది” అని అన్నాడు.
8కాబట్టి రాజు లేచి వచ్చి గుమ్మం దగ్గర కూర్చున్నాడు. రాజు గుమ్మం దగ్గర కూర్చున్నాడని విన్న ప్రజలందరూ రాజును కలవడానికి వచ్చారు.
ఇంతలో ఇశ్రాయేలీయులు తమ ఇళ్ళకు పారిపోయారు.
యెరూషలేముకు తిరిగివచ్చిన దావీదు
9అప్పుడు ఇశ్రాయేలు గోత్రాల్లో ప్రజలందరు తమలో తాము వాదించుకుంటూ, “మనలను శత్రువుల చేతిలో నుండి విడిపించింది రాజు; మనలను ఫిలిష్తీయుల చేతిలో నుండి కాపాడింది కూడా అతడే. కాని ఇప్పుడు అతడు అబ్షాలోము కారణంగా దేశం విడిచి పారిపోయాడు. 10అయితే మనం మనమీద రాజుగా అభిషేకించిన అబ్షాలోము యుద్ధంలో చనిపోయాడు. కాబట్టి మన రాజును తిరిగి ఎందుకు తీసుకురాకూడదు?” అని చెప్పుకున్నారు.
11అప్పుడు ఆ సంగతి విన్న రాజైన దావీదు యాజకులైన సాదోకు అబ్యాతారులకు ఇలా కబురు పంపించాడు: “ ‘ఇశ్రాయేలు వారందరూ మాట్లాడుకుంటున్న విషయం రాజభవనంలో ఉన్న రాజుకు చేరింది. మరి రాజును తన భవనానికి తీసుకురావడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? 12మీరు నా సోదరులు నా రక్త సంబంధులు! రాజును తిరిగి తీసుకురావడానికి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు?’ అని యూదా పెద్దలను అడగండి. 13తర్వాత అమాశాతో, ‘నీవు నాకు రక్త సంబంధివి కదా! యోవాబు స్థానంలో నిన్ను నా సేనాధిపతిగా నేను చేయకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షిస్తాడు’ అని చెప్పండి” అన్నాడు.
14అతడు వెళ్లి యూదావారందరు ఒక్క మాట మీద ఉండేలా వారందరి హృదయాలను గెలుచుకున్నాడు. అప్పుడు వారు, “మీరు మీ సైన్యం తిరిగి రండి” అని రాజుకు కబురు పంపించారు. 15రాజు తిరిగి రావడానికి బయలుదేరి యొర్దాను ఒడ్డుకు చేరుకున్నాడు.
యూదా వారు రాజును కలవడానికి, రాజును నది ఇవతలికి తీసుకురావడానికి గిల్గాలుకు వచ్చారు. 16బహూరీముకు చెందిన బెన్యామీనీయుడైన గెరా కుమారుడైన షిమీ త్వరత్వరగా రాజైన దావీదును కలుసుకోడానికి యూదా వారితో పాటు వచ్చాడు. 17అతనితో వెయ్యిమంది బెన్యామీనీయులు ఉన్నారు. అంతేకాక సౌలు కుటుంబ సేవకుడైన సీబా, అతని పదిహేను మంది కుమారులు, అతని ఇరవైమంది సేవకులు కూడా వచ్చారు. వారు యొర్దాను ఒడ్డున ఉన్న రాజు దగ్గరకు త్వరగా వెళ్లారు. 18రాజు కుటుంబీకులను ఇవతలకు దాటించడానికి, రాజు కోరినట్లు చేయడానికి రేవు పడవను ఇవతలకు తెచ్చి పెట్టారు.
రాజు యొర్దాను దాటిన తర్వాత గెరా కుమారుడైన షిమీ అతనికి సాష్టాంగ నమస్కారం చేసి, 19“నా రాజా! నేను చేసిన దాని బట్టి నా మీద నేరం మోపవద్దు. నా ప్రభువు రాజువైన నీవు యెరూషలేము విడిచివెళ్తున్నప్పుడు నేను చేసిన తప్పును జ్ఞాపకం చేసుకోవద్దు. దానిని మనస్సులో ఉంచుకోవద్దు. 20ఎందుకంటే నేను పాపం చేశానని నీ సేవకుడైన నాకు తెలుసు, కానీ ఈ రోజు నేను యోసేపు గోత్రాల నుండి మొదటివానిగా వచ్చి నా ప్రభువైన రాజును కలుసుకున్నాను” అని చెప్పాడు.
21అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై, “యెహోవా అభిషేకించినవాన్ని శపించిన ఈ షిమీకి మరణశిక్ష విధించాలి?” అన్నాడు.
22అందుకు దావీదు, “సెరూయా కుమారులారా! దీనితో మీకు ఉన్న సంబంధం ఏమిటి? దీనిలో కల్పించుకోడానికి మీకు ఏమి హక్కు? ఇలాంటి సమయంలో మీరు నాకు శత్రువులవుతారా? ఈ రోజు ఇశ్రాయేలులో ఎవరికైనా మరణశిక్ష విధించడం సరియైనదేనా? ఈ రోజే నేను ఇశ్రాయేలుకు రాజును అని మీకు తెలియదా?” అని చెప్పి, 23“నీకు మరణశిక్ష విధించను” అని షిమీతో రాజు ప్రమాణం చేశాడు.
24సౌలు మనుమడు మెఫీబోషెతు కూడా రాజును కలుసుకోడానికి వచ్చాడు. రాజు వెళ్లిన రోజు నుండి అతడు క్షేమంగా తిరిగివచ్చిన రోజు వరకు మెఫీబోషెతు తన కాళ్లు కడుక్కోలేదు. గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు. 25దావీదును కలుసుకోవటానికి అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు రాజు, “మెఫీబోషెతూ, నీవు నాతో కూడా ఎందుకు వెళ్లలేదు?” అని అతన్ని అడిగాడు.
26అందుకతడు, “నా ప్రభువైన నా రాజా! మీ సేవకుడనైన నేను కుంటివాన్ని కాబట్టి గాడిద మీద జీను వేయించుకుని ఎక్కి రాజుతో కలిసి వెళ్లిపోవాలని అనుకున్నాను. కాని నా సేవకుడైన సీబా నన్ను మోసం చేశాడు. 27అంతేకాక సీబా నీ సేవకుడనైన నా విషయంలో కూడా నీకు అబద్ధాలు చెప్పాడు. నా ప్రభువైన నా రాజు దేవదూత వంటివాడు. కాబట్టి నీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయి. 28నా తాతగారి వారసులందరూ నా ప్రభువైన రాజు నుండి మరణానికి మాత్రమే పాత్రులు, కానీ మీరు మీ బల్ల దగ్గర భోజనం చేసేవారిలో మీ సేవకునికి స్థానం ఇచ్చారు. అలాంటప్పుడు రాజుగారికి మనవి చేయడానికి నాకు ఏ హక్కు ఉంది?” అన్నాడు.
29అప్పుడు రాజు, “నీవెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీవు, సీబా ఆ భూమిని చెరిసగం పంచుకోమని చెప్పాను గదా” అన్నాడు.
30అందుకు మెఫీబోషెతు, “నా ప్రభువైన రాజు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చాడు కాబట్టి అతడే అంతా తీసుకోవచ్చు” అన్నాడు.
31గిలాదీయుడైన బర్జిల్లయి కూడా రాజుతో పాటు యొర్దాను దాటి, నది అవతలి నుండి అతన్ని సాగనంపడానికి రోగెలీము నుండి వచ్చాడు. 32బర్జిల్లయి ఎనభై సంవత్సరాల ముసలివాడు. అతడు చాలా ధనవంతుడు కాబట్టి రాజు మహనయీములో ఉన్నప్పుడు అతనికి భోజన పదార్ధాలు సరఫరా చేసేవాడు. 33రాజు, “నాతో పాటు నది దాటి యెరూషలేములో నా దగ్గరే ఉండిపో, నేను నిన్ను పోషిస్తాను” అని బర్జిల్లయితో చెప్పాడు.
34అందుకు బర్జిల్లయి రాజుతో, “రాజైన నీతో కూడా యెరూషలేము వచ్చి అక్కడ ఉండడానికి నేనెంతకాలం బ్రతుకుతాను. 35నాకు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు. సుఖదుఃఖాల మధ్య తేడాను నేను చెప్పగలనా? మీ సేవకుడు భోజన పదార్ధాల రుచి చూడగలడా? నేను ఇంకా గాయనీగాయకుల స్వరాలను వినగలనా? నా ప్రభువును రాజువునైన మీకు మీ సేవకుడు ఎందుకు అధనపు భారం కావాలి? 36నీ సేవకుడనైన నేను యొర్దాను నది దాటి రాజుతో కలిసి కొంత దూరం వస్తాను. కానీ నా ప్రభువైన రాజుకు నీ సేవకుడనైన నేనెందుకు భారమవ్వాలి? 37నేను నా ఊరిలో నా తలిదండ్రుల సమాధి దగ్గరే చనిపోవడానికి మీ సేవకుడనైన నన్ను తిరిగి వెళ్లనివ్వండి. అయితే ఇక్కడ నా సేవకుడైన కింహాము ఉన్నాడు. అతన్ని నా ప్రభువైన రాజుతో కలిసి నది దాటనివ్వండి. మీకు ఏది మంచిదనిపిస్తే అది అతనికి చెయ్యండి” అని అన్నాడు.
38అప్పుడు రాజు, “కింహాము నాతో పాటు రావచ్చు. నీకు ఏది మంచిదనిపిస్తే అది అతనికి చేస్తాను. అంతేకాక, నీవు నా నుండి ఏమి కోరుకుంటున్నావో అదంతా నేను నీకు చేస్తాను” అని హామీ ఇచ్చాడు.
39అప్పుడు ప్రజలందరు, రాజు యొర్దాను నది దాటారు. రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించాడు. తర్వాత బర్జిల్లయి తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.
40రాజు గిల్గాలు వెళ్లినప్పుడు రాజుతో పాటు కింహాము కూడా వెళ్లాడు. యూదా సైన్యమంతా ఇశ్రాయేలు సైన్యంలో సగం మంది రాజుతో పాటు వచ్చారు.
41అప్పుడు ఇశ్రాయేలు వారందరూ రాజైన దావీదు దగ్గరకు వచ్చి అతనితో, “మా సహోదరులైన యూదా వారు రాజును ఎత్తుకెళ్లి, నిన్ను నీ ఇంటివారిని నీ సేవకులను యొర్దాను ఇవతలకు ఎందుకు తీసుకువచ్చారు?” అని అడిగారు.
42అందుకు యూదా వారు, “రాజు మీకు చాలా దగ్గరి బంధువు కాబట్టి మేమిలా చేశాము. మీకు కోపమెందుకు? మేము రాజు ఆహారంలో ఏమైనా తిన్నామా? మేము మాకోసం ఏమైనా తీసుకున్నామా?” అని ఇశ్రాయేలువారితో అన్నారు.
43అప్పుడు ఇశ్రాయేలీయులు, “రాజులో మాకు పది భాగాలు ఉన్నాయి. కాబట్టి దావీదు మీద మీకంటే మాకే ఎక్కువ హక్కు ఉంది. రాజును తిరిగి తీసుకురావడం గురించి మొదట మాట్లాడింది మేమే గదా! మరి మమ్మల్నెందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు?” అని యూదా వారితో అన్నారు.
అయితే యూదా వారి మాటలు ఇశ్రాయేలువారి మాటలకంటే కఠినంగా ఉన్నాయి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూయేలు 19: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి