2 సమూయేలు 20

20
దావీదుపై తిరుగుబాటు చేసిన షేబ
1బెన్యామీను గోత్రానికి చెందిన బిక్రి కుమారుడైన షేబ అనే ఒక దుర్మార్గుడు ఉన్నాడు. అతడు బూర ఊది,
“దావీదుతో మనకు ఏ భాగం లేదు,
యెష్షయి కుమారునిలో ఏ వాటా లేదు,
ఇశ్రాయేలీయులారా! ప్రతిఒక్కరు మీ గుడారానికి వెళ్లండి!”
అని బిగ్గరగా అరిచి చెప్పాడు.
2కాబట్టి ఇశ్రాయేలు వారంతా దావీదును విడిచిపెట్టి బిక్రి కుమారుడైన షేబను వెంబడించారు. కాని యూదావారైతే యొర్దాను నుండి యెరూషలేము వరకు తమ రాజు దగ్గరే ఉండిపోయారు.
3రాజైన దావీదు యెరూషలేములో తన భవనానికి వచ్చి ఆ భవనాన్ని చూసుకోవడానికి ఉంచిన పదిమంది ఉంపుడుగత్తెలను తీసుకెళ్లి కాపలా ఉన్న ఇంట్లో పెట్టి వారిని పోషించాడు కాని వారితో ఎలాంటి లైంగిక సంబంధం పెట్టుకోలేదు. వారు చచ్చే వరకు విధవరాండ్రుగా జీవించారు.
4తర్వాత రాజు అమాశాతో, “మూడు రోజుల్లో యూదావారందరిని పిలిపించి వారితో పాటు నీవు కూడా ఇక్కడకు రావాలి” అని చెప్పాడు. 5అమాశా యూదా వారిని పిలిపించడానికి వెళ్లాడు గాని, రాజు అతనికిచ్చిన సమయానికి రాలేదు.
6దావీదు అబీషైని పిలిచి, “అబ్షాలోము కంటే ఈ బిక్రి కుమారుడైన షేబ మనకు ఎక్కువ కీడు చేస్తాడు. నీవు నీ రాజు సేవకులను తీసుకెళ్లి అతన్ని వెంటాడి పట్టుకో లేకపోతే కోటగోడలున్న పట్టణాల్లో దాక్కుని మన నుండి తప్పించుకుంటాడు” అని చెప్పాడు. 7కాబట్టి యోవాబు మనుష్యులు కెరేతీయులు పెలేతీయులు యుద్ధ వీరులందరు అబీషై నాయకత్వంలో యెరూషలేము నుండి బయలుదేరి బిక్రి కుమారుడైన షేబను వెంటాడటానికి వెళ్లారు.
8వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు చేరుకున్నపుడు, అమాశా వారిని కలుసుకోడానికి అక్కడికి వచ్చాడు. యోవాబు యుద్ధ వస్త్రాలు ధరించాడు దానిపైన ఉన్న నడికట్టుకు వ్రేలాడుతున్న ఒరలో కత్తి ఉంది. అతడు ముందుకు అడుగు వేసినప్పుడు ఒరలో నుండి కత్తి జారిపడింది.
9యోవాబు, “నా సోదరుడా! క్షేమమా?” అని అమాశాను అడిగి అతన్ని ముద్దు పెట్టుకుంటున్నట్లు కుడిచేతితో అతని గడ్డం పట్టుకున్నాడు. 10యోవాబు ఎడమ చేతిలో ఉన్న కత్తిని అమాశా చూడలేదు కాబట్టి అజాగ్రత్తగా ఉన్నాడు. యోవాబు కత్తి తీసి అతని కడుపులో పొడవగానే అమాశా ప్రేగులు బయటకు వచ్చి నేల మీద పడి అక్కడే అతడు చనిపోయాడు. అప్పుడు యోవాబు అతని తమ్ముడైన అబీషైలు బిక్రి కుమారుడైన షేబను వెంటాడుతూ వెళ్లారు.
11యోవాబు మనుష్యుల్లో ఒకడు అమాశా మృతదేహం దగ్గర నిలబడి, “యోవాబును ఇష్టపడేవారు, దావీదు వైపు ఉన్నవారందరు యోవాబును వెంబడించండి” అన్నాడు. 12అమాశా మార్గం మధ్యలో రక్తంతో కొట్టుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన సైనికులందరూ అక్కడే ఆగిపోవడం ఆ వ్యక్తి చూసి, అమాశా శవాన్ని దారిలో నుండి పొలంలోకి లాక్కెళ్లి ఆ దారిన వచ్చినవారు నిలబడి చూడకుండ ఆ శవం మీద బట్ట కప్పాడు. 13అమాశా శవాన్ని దారిలో నుండి తీసిన తర్వాత అందరు బిక్రి కుమారుడైన షేబను వెంటాడడానికి యోవాబు వెంట వెళ్లారు.
14షేబ ఇశ్రాయేలు గోత్రాల వారందరి దగ్గరకు, ఆబేల్ బేత్ మయకా వారి దగ్గరకు బెరీయుల దగ్గరకు వెళ్లగా వారంతా కలిసికట్టుగా వచ్చి అతన్ని వెంబడించారు. 15యోవాబుతో ఉన్న సైన్యమంత వచ్చి, ఆబేల్-బేత్-మయకాలో షేబను ముట్టడించి పట్టణ గోడలకు ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టారు. యోవాబు సైన్యమంతా గోడ పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, 16ఆ పట్టణంలో ఉన్న ఒక తెలివైన స్త్రీ బిగ్గరగా, “వినండి! వినండి! నేను యోవాబుతో మాట్లాడాలి. అతన్ని ఇక్కడకు రమ్మనండి” అని చెప్పింది. 17యోవాబు ఆమె దగ్గరకు వెళ్లగా ఆమె, “యోవాబు నీవేనా?” అని అడిగింది.
అతడు, “నేనే” అన్నాడు.
ఆమె, “నీ సేవకురాలు నీతో చెప్పేది వినండి” అని అన్నది.
అతడు, “చెప్పు వింటాను” అన్నాడు.
18అప్పుడు ఆమె, “పూర్వం ప్రజలు ‘ఏదైనా సమస్య ఉంటే ఆబేలులో పరిష్కరించుకోండి’ అనేవారు. అలా వారు పరిష్కారం పొందేవారు. 19మేము ఇశ్రాయేలులో నెమ్మదస్తులం నమ్మకమైనవారము. మీరు ఇశ్రాయేలు పట్టణాల్లో ప్రధానమైన పట్టణాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. యెహోవా వారసత్వాన్ని మీరెందుకు నిర్మూలం చేస్తారు?” అని నిలదీసింది.
20అందుకు యోవాబు, “నేను నాశనం చేయాలని నిర్మూలం చేయాలని అనుకోవడం లేదు. 21అసలు విషయం అది కాదు. బిక్రి కుమారుడైన షేబ అనే ఎఫ్రాయిం కొండ ప్రాంతానికి చెందిన ఒకడు రాజైన దావీదు మీద తిరుగుబాటు చేశాడు. ఆ ఒక్కడిని మీరు మాకు అప్పగిస్తే, నేను ఈ పట్టణాన్ని విడిచివెళ్తాను” అని చెప్పాడు.
అప్పుడు ఆమె, “సరే, వాని తల గోడ పైనుండి పడవేస్తాం” అని చెప్పింది.
22ఆమె వెళ్లి, తాను తెలివిగా యోవాబుతో మాట్లాడిన మాటలు పట్టణ ప్రజలకు చెప్పినప్పుడు వారు బిక్రి కుమారుడైన షేబ తల నరికి యోవాబు దగ్గర పడవేశారు. వెంటనే అతడు బూరధ్వని చేశాడు. అతని మనుష్యులందరు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి ఎవరి ఇళ్ళకు వారు వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేములో ఉన్న రాజు దగ్గరకు తిరిగి వెళ్లాడు.
దావీదు అధికారులు
23యోవాబు ఇశ్రాయేలు సైన్యమంతటికి అధిపతి;
కెరేతీయులకు పెలేతీయులకు యెహోయాదా కుమారుడైన బెనాయా అధిపతి;
24అదోనిరాము#20:24 హెబ్రీలో అదోరాము అలాగే వెట్టిపనులు చేసేవారిమీద అధికారి;
అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల పర్యవేక్షణ అధికారి;
25షెవా కార్యదర్శి;
సాదోకు అబ్యాతారులు యాజకులు;
26యాయీరీయుడైన#20:26 కొ.ప్ర.లలో ఇత్రీయుడైన; 2 సమూ 23:38 ఈరా దావీదుకు వ్యక్తిగత యాజకుడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూయేలు 20: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి