2 సమూయేలు 24

24
దావీదు పోరాట యోధులను లెక్కించుట
1యెహోవాకు మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల మీద కోపం రాగా ఆయన, “వెళ్లి ఇశ్రాయేలువారి యూదావారి జనాభాను లెక్కించు” అని దావీదును వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు.
2కాబట్టి రాజు యోవాబును, అతనితో ఉన్న సైన్యాధిపతులను పిలిచి, “యుద్ధానికి వెళ్లగలిగిన వారి సంఖ్య నాకు తెలిసేలా దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు గోత్రాలన్నిటి దగ్గరకు వెళ్లి జనాభా లెక్క తీసుకురండి” అని చెప్పాడు.
3కాని యోవాబు రాజుతో, “మీ దేవుడైన యెహోవా సైన్యాన్ని వందరెట్లు ఎక్కువ చేయడం నా ప్రభువైన రాజా మీరే చూస్తారు. కానీ నా ప్రభువు రాజు అలాంటి పని ఎందుకు చేయాలనుకుంటున్నాడు?” అని అన్నాడు.
4అయితే రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞకు తిరుగులేదు కాబట్టి వారు రాజు ఎదుట నుండి ఇశ్రాయేలీయుల జనాభా లెక్కించడానికి బయలుదేరి వెళ్లారు.
5యొర్దాను దాటి గాదు లోయ పట్టణానికి దక్షిణంగా అరోయేరులో శిబిరం ఏర్పరచుకున్నారు. అక్కడినుండి గాదు ప్రాంతం గుండా యాజెరుకు వెళ్లారు. 6అక్కడినుండి గిలాదు, తహ్తీము హొద్షీ ప్రాంతానికి వచ్చి దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు. 7అక్కడినుండి కోటలున్న తూరు పట్టణానికి హివ్వీయుల, కనానీయుల పట్టణాలన్నిటికి వచ్చారు. చివరిగా యూదా దేశానికి దక్షిణాన ఉన్న బెయేర్షేబ వరకు వచ్చారు.
8ఇలా వారు దేశమంతా తిరిగి తొమ్మిది నెలల ఇరవై రోజులకు యెరూషలేముకు చేరుకున్నారు.
9యోవాబు యుద్ధం చేయగలవారి సంఖ్య రాజుకు తెలియజేశాడు. ఇశ్రాయేలులో కత్తి తిప్పగలవారు ఎనిమిది లక్షలమంది ఉన్నారు, యూదా వారిలో అయిదు లక్షలమంది ఉన్నారు.
10సైన్యాన్ని లెక్కించిన తర్వాత దావీదు తప్పు చేశానని మనస్సాక్షి గద్దింపు పొంది, అతడు యెహోవాకు, “నేను ఈ పని చేసి ఘోరపాపం చేశాను. యెహోవా, మీ సేవకుని దోషాన్ని తొలగించమని బ్రతిమాలుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను” అని ప్రార్థన చేశాడు.
11తర్వాతి రోజు ఉదయాన్నే దావీదు నిద్ర లేవడానికి ముందే దావీదుకు దీర్ఘదర్శిగా, ప్రవక్తగా ఉన్న గాదుతో యెహోవా ఇలా చెప్పారు: 12“వెళ్లి దావీదుతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీకు మూడు ఎంపికలు ఇస్తున్నాను. వాటిలో ఒకదాన్ని ఎంచుకో, దానిని నీమీదికి రప్పిస్తాను.’ ”
13కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “నీ దేశంలో మూడు#24:13 కొ.ప్రా.ప్ర.లలో ఏడు; 1 దిన 21:12 సంవత్సరాల కరువు రావాలని కోరుకుంటావా? నీ శత్రువులు నిన్ను వెంటాడగా, వారిని ఎదుర్కోలేక మూడు నెలలు పారిపోతావా? నీ దేశంలో మూడు రోజులు తెగులు వ్యాపించాలని కోరుకుంటావా? ఇప్పుడు, నన్ను పంపిన వ్యక్తికి నేనేమి జవాబివ్వాలో ఆలోచించి నిర్ణయించుకో” అన్నాడు.
14అందుకు దావీదు గాదుతో, “నేను తీవ్ర బాధలో ఉన్నాను. యెహోవా కనికరం ఎంతో గొప్పది కాబట్టి ఆయన చేతిలోనే మేము పడాలి; కాని మనుష్యుల చేతిలో నేను పడకూడదు” అని అన్నాడు.
15కాబట్టి యెహోవా ఉదయం నుండి నియమించబడిన సమయం పూర్తయ్యే వరకు ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించారు. అప్పుడు దాను నుండి బెయేర్షేబ వరకు డెబ్బైవేలమంది చనిపోయారు. 16యెరూషలేమును నాశనం చేయడానికి దేవదూత చేయి చాపినప్పుడు జరిగిన కీడుకు యెహోవా మనస్సు కరిగి ప్రజలను నాశనం చేస్తున్న దూతతో, “ఇక చాలు! నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పారు. అప్పుడు యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాకు చెందిన నూర్పిడి కళ్ళం దగ్గర ఉన్నాడు.
17నాశనం చేస్తున్న దూతను చూసిన దావీదు, “గొర్రెల కాపరినైన నేను పాపం చేశాను! వీరు గొర్రెల వంటి వారు, వీరేమి చేశారు? ఈ ప్రజలు ఏమి చేశారు? మీ చేతులు నా మీద నా కుటుంబం మీద పడనివ్వండి” అని యెహోవాకు ప్రార్థన చేశాడు.
దావీదు బలిపీఠం కట్టించుట
18అదే రోజు గాదు దావీదు దగ్గరకు వచ్చి, “యెబూసీయుడైన అరౌనా నూర్పిడి కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించు” అని చెప్పాడు. 19గాదు ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞమేరకు దావీదు బయలుదేరి వెళ్లాడు. 20రాజు, అతని అధికారులు తన వైపు రావడం చూసిన అరౌనా రాజుకు ఎదురు వెళ్లి తన తల నేలకు వంచి రాజుకు నమస్కారం చేశాడు.
21అరౌనా, “నా ప్రభువైన రాజా, తన సేవకుని దగ్గరకు రావడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు.
అందుకు దావీదు, “ప్రజల మీద ఉన్న తెగులు ఆగిపోవడానికి యెహోవాకు బలిపీఠం కట్టడానికి, నీ నూర్పిడి కళ్ళం కొనాలని వచ్చాను” అని అన్నాడు.
22అందుకు అరౌనా దావీదుతో, “నా ప్రభువైన రాజు తనకు కావల్సింది తీసుకుని బలి అర్పించవచ్చు. దహనబలి కోసం ఇక్కడ ఎద్దులు ఉన్నాయి. కట్టెలకు నూర్చే కర్రలు ఎద్దు కాడెలు ఉన్నాయి. 23రాజా, ఇవన్నీ అరౌనా అనే నేను రాజుకు ఇస్తున్నాను” అని చెప్పి, “నీ దేవుడైన యెహోవా నీ ప్రార్థన అంగీకరించును గాక” అని అన్నాడు.
24అయితే రాజు అరౌనాతో, “లేదు, నీకు వెల చెల్లించి కొంటాను. ఉచితంగా తీసుకున్న దానిని నేను నా దేవుడైన యెహోవాకు దహనబలి అర్పించను” అన్నాడు.
కాబట్టి దావీదు ఆ నూర్పిడి కళ్ళాన్ని ఎడ్లను యాభై షెకెళ్ళ#24:24 అంటే సుమారు 575 గ్రాములు వెండికి కొన్నాడు. 25దావీదు అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దహనబలులు సమాధానబలులు అర్పించాడు. అప్పుడు యెహోవా దేశం కోసం అతడు చేసిన ప్రార్థన అంగీకరించగా ఇశ్రాయేలీయులకు వచ్చిన తెగులు తొలగిపోయింది.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూయేలు 24: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి