2 సమూయేలు 23
23
దావీదు చివరి మాటలు
1దావీదు చివరి మాటలు:
“యెష్షయి కుమారుడైన దావీదు పలికిన దైవావేశ మాటలు,
సర్వోన్నతునిచే హెచ్చింపబడినవాడును,
యాకోబు దేవునిచే అభిషేకించబడినవాడును,
ఇశ్రాయేలు కీర్తనల మధుర గాయకుడునైన దావీదు పలికిన మాటలు.
2“యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడారు;
ఆయన మాట నా నాలుక మీద ఉంది.
3ఇశ్రాయేలు దేవుడు మాట్లాడారు,
ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం నాతో ఇలా అన్నారు:
‘మనుష్యుల మధ్య నీతిగా పాలించేవాడు,
దేవుని భయం కలిగి పాలించేవాడు,
4అతడు మబ్బులు లేని ఉదయాన
సూర్యోదయపు వెలుగులాంటివాడు,
వాన వెలిసిన తర్వాతి వచ్చే తేజస్సులాంటివాడు;
అది భూమి నుండి గడ్డిని మొలిపిస్తుంది.’
5“ఒకవేళ నా కుటుంబం దేవునితో సరిగా లేకపోయినా,
నిజంగా ఆయన నాతో శాశ్వతమైన నిబంధన చేసి ఉండరు కదా,
ఆ నిబంధన అన్నివిధాల పరిపూర్ణమైనది స్థిరమైనది;
నిజంగా ఆయన నా రక్షణను ఫలవంతం చేసి ఉండరు,
నా ప్రతి కోరికను ఇచ్చి ఉండరు.
6అయితే చేతులతో పోగుచేయలేని ముళ్ళలా,
దుష్టులందరు పారవేయబడాలి.
7ముళ్ళను పట్టుకునేవారు
ఇనుప పనిముట్టునైనా లేదా బల్లెపు పిడినైనా ఉపయోగిస్తారు;
అవి పడిన చోటనే కాల్చివేయబడతాయి.”
దావీదు పరాక్రమ యోధులు
8దావీదు దగ్గర ఉన్న పరాక్రమ యోధుల పేర్లు ఇవే:
తక్మోనీయుడైన#23:8 బహుశ హక్మోనీయుడు 1 దిన 11:11 యోషేబ్-బష్షెబెతు#23:8 కొ.ప్రా.ప్ర.లలో ఇష్-బోషెతు అంటే ఎష్-బయలు 1 దిన 11:11 ముగ్గురిలో మొదటివాడు. అతడు ఒకే యుద్ధంలో తన ఈటెతో ఎనిమిదివందల మందిని చంపాడు.#23:8 కొ.ప్ర.లలో ముగ్గురి; అతడు
9అతని తర్వాత శ్రేణిలో అహోహీయుడైన దోదో#23:9 దీనికి మరో రూపం దోదయి కుమారుడైన ఎలియాజరు ఉన్నాడు. ముగ్గురు యోధులలో ఒక్కడైన ఇతడు పస్ దమ్మీములో యుద్ధానికి వచ్చిన ఫిలిష్తీయులను ఎదిరించినప్పుడు దావీదుతో పాటు ఉన్నాడు. ఇశ్రాయేలీయులు వెనుకకు తగ్గినప్పుడు, 10ఎలియాజరు యుద్ధరంగంలో నిలబడి చేయి తిమ్మిరెక్కి కత్తికి అతుక్కుపోయేదాకా ఫిలిష్తీయులను చంపుతూనే ఉన్నాడు. ఆ రోజు యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ఇచ్చారు. దోపుడుసొమ్ము పట్టుకోవడానికి మాత్రమే సైన్యం అతని దగ్గరకు తిరిగి వచ్చింది.
11అతని తర్వాత హరారీయుడైన అగీ కుమారుడైన షమ్మా ఉన్నాడు. అలచందల నిండి ఉన్న పొలం దగ్గర ఫిలిష్తీయులను చూసి ఇశ్రాయేలు దళాలు పారిపోయారు. 12కాని షమ్మా పొలం మధ్యలో నిలబడి దాన్ని కాపాడి ఫిలిష్తీయులను చంపాడు. యెహోవా వారికి గొప్ప విజయాన్ని ఇచ్చారు.
13కోతకాలంలో ముప్పైమంది ముఖ్య యోధులలో ముగ్గురు అదుల్లాము గుహ దగ్గర ఉన్న దావీదు దగ్గరకు వచ్చారు. అప్పుడు ఫిలిష్తీయుల సైనికుల గుంపు రెఫాయీము లోయలో శిబిరం ఏర్పరచుకుంది. 14ఆ సమయంలో దావీదు సురక్షితమైన స్థావరంలో ఉన్నాడు, ఫిలిష్తీయుల దండు బేత్లెహేములో ఉంది. 15దావీదు నీళ్ల కోసం ఆరాటపడుతూ, “బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బాగుండేది!” అన్నాడు. 16అప్పుడు ఆ ముగ్గురు వీరులు ఫిలిష్తీయుల శిబిరం గుండా చొరబడి బేత్లెహేము ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్లు తోడుకొని దావీదుకు తెచ్చి ఇచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు త్రాగడానికి నిరాకరించాడు; బదులుగా వాటిని యెహోవాకు అర్పణగా పారబోశాడు. 17“యెహోవా! ఈ నీళ్లు నేను త్రాగగలనా? వీరు తమ ప్రాణాలకు తెగించి తెచ్చిన నీళ్లు వారి రక్తంతో సమానం కాదా?” అని చెప్పి వాటిని త్రాగలేదు.
ఆ ముగ్గురు పరాక్రమ యోధులు చేసిన సాహసాలు ఇలాంటివి.
18సెరూయా కుమారుడు, యోవాబు సోదరుడైన అబీషై ఆ ముగ్గురికి నాయకుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడువందల మందిని చంపాడు, కాబట్టి అతడు ఆ ముగ్గురిలా ప్రసిద్ధి పొందాడు. 19అతడు ఆ ముగ్గురికంటే గొప్ప గౌరవాన్ని పొంది వారి దళాధిపతి అయ్యాడు కాని వారిలో ఒకనిగా చేర్చబడలేదు.
20గొప్ప పోరాట వీరుడు, కబ్సెయేలుకు చెందిన యెహోయాదా కుమారుడైన బెనాయా గొప్ప సాహస కార్యాలను చేశాడు. అతడు మోయాబు యొక్క పరాక్రమశాలులైన ఇద్దరిని చంపాడు. అంతేకాక, మంచుపడే కాలంలో ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు. 21అతడు ఒక భారీ ఈజిప్టు వానిని చంపాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఈటె ఉన్నప్పటికీ బెనాయా దుడ్డుకర్ర పట్టుకుని వాని మీదికి పోయాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఉన్న ఈటెను లాక్కుని దానితోనే అతన్ని చంపాడు. 22యెహోయాదా కుమారుడైన బెనాయా సాహస కార్యాలు ఇలాంటివి; అతడు కూడా ఆ ముగ్గురు గొప్ప యోధులతో పాటు ప్రసిద్ధి పొందాడు. 23ఆ ముప్పైమందిలో ఘనతకెక్కాడు గాని, ఆ ముగ్గురి జాబితాలో చేర్చబడలేదు. దావీదు అతన్ని తన అంగరక్షకుల నాయకునిగా నియమించాడు.
24ఆ ముప్పైమంది వీరే:
యోవాబు తమ్ముడైన అశాహేలు,
బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను.
25హరోదీయుడైన షమ్మా,
హరోదీయుడైన ఎలీకా,
26పత్తీయుడైన హేలెస్సు,
తెకోవాకు చెందిన ఇక్కేషు కుమారుడైన ఈరా.
27అనాతోతుకు చెందిన అబీయెజెరు,
హుషాతీయుడైన సిబ్బెకై#23:27 కొ.ప్ర.లలో మెబున్నయి అలాగే 21:18 1 దిన 11:29 లో కూడా
28అహోహీయుడైన సల్మోను,
నెటోపాతీయుడైన మహరై.
29నెటోపాతీయుడైన బయనా కుమారుడు హేలెదు,
బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి.
30పిరాతోనీయుడైన బెనాయా,
గాయషు కనుమలకు చెందిన హిద్దయి
31అర్బాతీయుడైన అబీ-అల్బోను,
బర్హుమీయుడైన అజ్మావెతు,
32షయల్బోనీయుడైన ఎల్యహ్బా,
యాషేను కుమారులలో
యోనాతాను, 33హరారీయుడైన షమ్మా,
హరారీయుడైన షారారు కుమారుడు అహీయాము,
34మయకాతీయుడైన అహస్బయి కుమారుడు ఎలీఫెలెతు,
గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడు ఎలీయాము,
35కర్మెలీయుడైన హెజ్రో,
అర్బీయుడైన పయరై,
36సోబావాడైన నాతాను కుమారుడు ఇగాలు,
గాదీయుడైన బానీ,
37అమ్మోనీయుడైన జెలెకు,
బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలను మోసేవాడు.
38ఇత్రీయుడైన ఈరా,
ఇత్రీయుడైన గారేబు.
39హిత్తీయుడైన ఊరియా.
వీరంతా కలిసి మొత్తం ముప్పై ఏడుగురు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 సమూయేలు 23: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.