2 సమూయేలు 22
22
దావీదు స్తుతి గీతం
1యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి, సౌలు చేతి నుండి విడిపించినప్పుడు దావీదు యెహోవా సన్నిధిలో ఈ పాట పాడాడు. 2అతడు ఇలా పాడాడు:
“యెహోవా నా కొండ, నా కోట నా విమోచకుడు;
3నా దేవుడు నేను ఆశ్రయించే నా కొండ,
నా డాలు,#22:3 లేదా ప్రభువు నా రక్షణ కొమ్ము.#22:3 కొమ్ము ఇక్కడ బలాన్ని సూచిస్తుంది
ఆయన నా బలమైన కోట, నా ఆశ్రయం, నా రక్షకుడు
హింసించేవారి నుండి నన్ను రక్షిస్తారు.
4“స్తుతికి యోగ్యుడైన యెహోవాకు నేను మొరపెట్టాను,
నా శత్రువుల నుండి నేను రక్షించబడ్డాను.
5మరణపు అలలు నన్ను చుట్టుకున్నాయి;
దుష్టులు వరదల్లా నన్ను ముంచెత్తుతారు.
6సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి;
మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి.
7“నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను;
నా దేవున్ని వేడుకున్నాను.
తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు;
నా మొర ఆయన చెవులకు చేరింది.
8అప్పుడు భూమి కంపించి అదిరింది,
పరలోకపు#22:8 కొ.ప్ర.లలో పర్వతాలు; కీర్తన 18:7 పునాదులు కదిలాయి.
ఆయన కోపానికి అవి వణికాయి.
9ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది;
ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది,
దానిలో నిప్పులు మండుతున్నాయి.
10ఆకాశాన్ని చీల్చుకొని ఆయన దిగివచ్చారు;
ఆయన పాదాల క్రింద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.
11ఆయన కెరూబుల మీద ఎక్కి వచ్చారు.
ఆయన గాలి రెక్కల మీద ఎగిరి వచ్చారు.#22:11 చాలా హెబ్రీ ప్రతులలో ప్రత్యక్షమయ్యారు; కీర్తన 18:10
12ఆయన చీకటిని తన చుట్టూ పందిరిగా,
కారు మేఘాలను పందిరిగా చేసుకున్నారు.
13ఆయన సన్నిధి కాంతి నుండి
పిడుగులు వచ్చాయి.
14యెహోవా పరలోకం నుండి ఉరిమారు.
మహోన్నతుని స్వరం ప్రతిధ్వనించింది.
15ఆయన తన బాణాలు విసిరి శత్రువును చెదరగొట్టారు,
మెరుస్తున్న గొప్ప పిడుగులతో వారిని తరిమికొట్టారు.
16యెహోవా గద్దింపుకు,
ఆయన నాసికా రంధ్రాల్లో నుండి వచ్చే బలమైన ఊపిరికి
సముద్రపు అగాధాలు కనబడ్డాయి,
భూమి పునాదులు బయటపడ్డాయి.
17“ఆయన పైనుండి చేయి చాచి నన్ను పట్టుకున్నారు;
లోతైన జలాల్లో నుండి నన్ను పైకి తీశారు.
18శక్తివంతమైన నా శత్రువు నుండి,
నాకన్నా బలవంతులైన పగవారి నుండి ఆయన నన్ను రక్షించారు.
19నా విపత్తు రోజున వారు నా మీదికి వచ్చారు,
కాని యెహోవా నాకు అండగా ఉన్నారు.
20ఆయన నన్ను విశాలమైన స్థలంలోకి తీసుకువచ్చారు;
ఆయన నాయందు ఆనందించారు కాబట్టి నన్ను విడిపించారు.
21“నా నీతిని బట్టి యెహోవా నాతో వ్యవహరించారు;
నా నిర్దోషత్వం బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చారు.
22నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నాను;
దుర్మార్గంగా నేను నా దేవుని విడిచిపెట్టలేదు.
23ఆయన న్యాయవిధులన్ని నా ముందే ఉన్నాయి;
ఆయన శాసనాల నుండి నేను తొలగిపోలేదు.
24ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను,
నేను పాపానికి దూరంగా ఉన్నాను.
25నా నీతిని బట్టి ఆయన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి
యెహోవా నాకు ప్రతిఫలమిచ్చారు.
26“నమ్మకస్థులకు మిమ్మల్ని మీరు నమ్మకస్థులుగా కనుపరచుకుంటారు,
యథార్థంగా ఉండే వారికి మిమ్మల్ని మీరు యథార్థవంతులుగా కనుపరచుకుంటారు,
27నిష్కళంకులకు మీరు నిష్కళంకంగా కనుపరచుకుంటారు,
కాని వంచకులకు మిమ్మల్ని మీరు వివేకిగా కనుపరచుకుంటారు.
28మీరు దీనులను రక్షిస్తారు,
అహంకారులపై మీ దృష్టి ఉంచి వారిని అణచివేస్తారు.
29యెహోవా! మీరు నాకు దీపము;
యెహోవా నా చీకటిని వెలుగుగా మారుస్తారు.
30మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను;
నా దేవుని తోడుతో నేను గోడను దాటుతాను.
31“దేవుని విషయమైతే ఆయన మార్గం పరిపూర్ణమైనది;
యెహోవా వాక్కు లోపం లేనిది;
ఆయనను ఆశ్రయించిన వారందరిని ఆయన కాపాడతారు.
32యెహోవా తప్ప దేవుడెవరు?
మన దేవుని మించిన కొండ ఎవరు?
33బలంతో నన్ను సాయుధునిగా చేసేది,
నా మార్గాన్ని యథార్థంగా కాపాడేది నా దేవుడే.
34నా పాదాలను జింక పాదాలుగా చేస్తారు;
ఎత్తైన స్థలాల మీద నన్ను నిలబెడతారు.
35నా చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తారు;
నా చేతులు ఇత్తడి విల్లును వంచగలవు.
36మీ రక్షణ సహాయాన్ని నా డాలుగా చేస్తారు,
మీ సహాయం నన్ను గొప్ప చేస్తుంది.
37నా చీలమండలాలు జారిపోకుండ
మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు.
38“నేను నా శత్రువులను వెంటాడి వారిని నాశనం చేశాను;
వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు.
39వారు మళ్ళీ లేవకుండా వారిని పూర్తిగా నలుగగొట్టాను;
వారు నా పాదాల క్రింద పడ్డారు.
40మీరు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపచేశారు;
మీరు నా విరోధులను నా ముందు అణచివేశారు.
41మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు,
నేను నా విరోధులను నాశనం చేశాను.
42వారు సాయం కోసం మొరపెట్టారు
కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు
యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు.
43భూమి మీద ఉండే దుమ్ములా నేను వారిని నలుగగొట్టాను;
వీధుల్లోని బురదలా నేను వారిని తొక్కాను.
44“జనాల దాడుల నుండి మీరు నన్ను విడిపించారు;
జనులకు నాయకునిగా మీరు నన్ను స్థిరపరిచారు.
నాకు తెలియని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.
45విదేశీయులు నా ముందు భయపడుతున్నారు;
నా గురించి వినగానే వారు నాకు లోబడుతున్నారు.
46వారందరి గుండె జారిపోతుంది;
వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు.
47“యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి!
నా రక్షణ ఆశ్రయమైన దేవునికి మహిమ!
48నా పక్షాన పగతీర్చుకునే దేవుడు ఆయనే,
దేశాలను నాకు లోబరచేది ఆయనే.
49నా శత్రువుల నుండి నన్ను రక్షించేది ఆయనే.
నా విరోధులకు పైగా మీరు నన్ను హెచ్చించారు;
హింసాత్మక వ్యక్తుల నుండి మీరు నన్ను విడిపించారు.
50అందుకే యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
మీ నామ సంకీర్తన చేస్తాను.
51“ఆయన తన రాజుకు ఘన విజయాలు ఇస్తారు;
ఆయన తన అభిషిక్తుడైన దావీదుకు అతని సంతానానికి,
తన మారని దయను చూపిస్తారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 సమూయేలు 22: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.