యెహెజ్కేలు 25

25
అమ్మోను గురించి ప్రవచనం
1యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“మనుష్యకుమారుడా, అమ్మోనీయుల వైపు నీ ముఖాన్ని త్రిప్పి వారి గురించి ప్రవచించు. 3వారితో ఇలా చెప్పు, ‘అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నా పరిశుద్ధాలయం అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలు దేశం పాడైపోతున్నప్పుడు, యూదా వారు బందీలుగా వెళ్తున్నప్పుడు మీరు “ఆహా!” అన్నారు. 4కాబట్టి నేను మిమ్మల్ని తూర్పు ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగిస్తాను. వారు గుడారాలు వేసుకుని మీ మధ్య నివసిస్తారు; వారు మీ పండ్లు తిని మీ పాలు త్రాగుతారు. 5రబ్బా పట్టణాన్ని ఒంటెల శాలగా మారుస్తాను. అమ్మోనీయుల దేశాన్ని గొర్రె దొడ్డిగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 6ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీరు చప్పట్లు కొట్టి కాళ్లతో నేలను తన్ని ఇశ్రాయేలు దేశానికి జరిగిన దానిని గురించి మీ మనస్సులోని దురుద్దేశంతో సంతోషించారు. 7అందుకే నేను మీకు విరోధినై మిమ్మల్ని ప్రజలకు దోపుడు సొమ్ముగా అప్పగిస్తాను. ఇతర ప్రజల్లో ఉండకుండా నేను మిమ్మల్ని తుడిచివేస్తాను, దేశాల నుండి నిర్మూలిస్తాను. నేను మిమ్మల్ని నాశనం చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’ ”
మోయాబు గురించి ప్రవచనం
8“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘మోయాబీయులు శేయీరు పట్టణస్థులు, “యూదా వారు కూడా ఇతర జనాల్లాగానే తయారయ్యారు” అన్నారు కాబట్టి, 9మోయాబుకు ఘనతను తెచ్చే పొలిమేర పట్టణాలైన బేత్-యెషిమోతు బయల్-మెయోను కిర్యతాయిములతో మొదలుపెట్టి సరిహద్దు పట్టణాలన్నిటిని 10అమ్మోనీయులతో పాటు తూర్పు ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగిస్తాను, అప్పుడు జనాల్లో అమ్మోనీయులు జ్ఞాపకానికి రారు. 11మోయాబుకు నేను శిక్ష విధిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”
ఎదోము గురించి ప్రవచనం
12“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘ఎదోమీయులు యూదా వారి మీద పగతీర్చుకున్నారు. అలా చేసి వారు దోషులయ్యారు, 13కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఎదోము మీద నా చేయి చాపి మనుష్యులను పశువులను చంపి సమస్తాన్ని నిర్మూలం చేస్తాను. తేమాను పట్టణం నుండి దేదాను వరకు ప్రజలంతా కత్తివేటుకు కూలిపోతారు. 14నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము మీద నా పగ తీర్చుకుంటాను. నా కోపం నా ఉగ్రతకు అనుగుణంగా వారు ఎదోముకు చేస్తారు. అప్పుడు నా ఉగ్రత ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.’ ”
ఫిలిష్తీయ గురించి ప్రవచనం
15“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘ఫిలిష్తీయులు పగతీర్చుకున్నారు తమ హృదయాల్లో ఉన్న ద్వేషంతో పాత పగలతో యూదాను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 16కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఫిలిష్తీయుల మీద నేను చేయి చాపి కెరేతీయులను తుడిచివేస్తాను. సముద్రతీరాన నివసించే మిగిలిన వారికి కూడా నాశనం చేస్తాను. 17నా ఉగ్రతతో వారిని శిక్షించి వారి మీద పూర్తిగా పగ తీర్చుకుంటాను. వారి మీద నేను పగ తీర్చుకున్నప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 25: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి