యెహెజ్కేలు 26
26
తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం
1పదకొండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది: 2“మనుష్యకుమారుడా, యెరూషలేము గురించి తూరు, ‘ఆహా! జనాంగాలకు గుమ్మం విరిగిపోయింది, దాని తలుపులు నా కోసం తెరచుకొని ఉన్నాయి; ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది కాబట్టి నేను వృద్ధి చెందుతాను’ అని చెప్పింది. 3కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తూరు పట్టణమా, నేను నీకు విరోధిని. సముద్రంలో అలలు పొంగినట్లు అనేక జనాంగాలను నీ మీదికి రప్పిస్తాను. 4వారు తూరు గోడలు కూల్చివేసి దాని గోపురాలను పడగొడతారు; దాని మీద ఉన్న మట్టిని నేను తుడిచివేసి, వట్టి బండలా మిగిలేలా చేస్తాను. 5సముద్రం దానిని చుట్టుముట్టినప్పుడు అది చేపల వలలు ఆరబెట్టే స్థలంగా మారుతుంది. నేనే మాట ఇచ్చాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అది జనాంగాలకు దోపుడు సొమ్ముగా మారుతుంది, 6పొలంలో ఉన్న దాని కుమార్తెలు ఖడ్గం పాలవుతారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.
7“ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఉత్తరం నుండి నేను రాజుల రాజు, బబులోను రాజైన నెబుకద్నెజరును#26:7 హెబ్రీలో నెబుకద్రెజరు ఇది నెబుకద్నెజరు యొక్క మరో రూపం; ఇక్కడ, అలాగే యెహెజ్కేలు యిర్మియాలో తరచుగా వాడబడింది గుర్రాలు రథాలు, గుర్రపురౌతులు గొప్ప సైన్యంతో తూరు మీదికి రప్పించబోతున్నాను. 8అతడు ఖడ్గంతో ప్రధాన భూభాగంలో మీ నివాసాలను నాశనం చేస్తాడు; అతడు మీకు వ్యతిరేకంగా ముట్టడి పనులను ఏర్పాటు చేస్తాడు, మీ గోడలకు ముట్టడి దిబ్బలను ఏర్పాటు చేస్తాడు. 9అతడు మీ గోడల మీదికి తన పడగొట్టే యంత్రాలను పంపుతాడు, తన ఆయుధాలతో మీ గోపురాలను కూల్చివేస్తాడు. 10అతనికి ఉన్న గుర్రాలు రేపిన దుమ్ము నిన్ను కమ్ముతుంది. ఒకడు పగిలిన గోడలున్న పట్టణంలోకి ప్రవేశించినట్లు అతడు నీ గుమ్మాల్లోకి వచ్చినప్పుడు గుర్రపురౌతుల నుండి రథచక్రాల నుండి వచ్చే శబ్దానికి నీ గోడలు అదురుతాయి. 11అతడు తన గుర్రాల డెక్కలతో నీ వీధులన్నిటిని అణగద్రొక్కిస్తాడు. కత్తితో నీ ప్రజలను చంపుతాడు. నీ బలమైన స్తంభాలు నేల కూలిపోతాయి. 12వారు నీ సంపదను దోచుకుంటారు నీ వస్తువులను దొంగిలిస్తారు. వారు నీ గోడలను కూల్చివేసి, నీ విలాసవంతమైన భవనాలను పడగొట్టి, నీ రాళ్లను కలపను సముద్రంలోకి విసిరివేస్తారు. 13నేను నీ సంగీతాన్ని ఆపివేస్తాను. నీ సితార శబ్దం ఇకపై వినపడదు. 14నేను నిన్ను వట్టి బండగా చేస్తాను, నీవు చేపల వలలు పరిచే స్థలం అవుతావు. నీవు ఎప్పటికీ కట్టబడవు, ఎందుకంటే యెహోవానైన నేనే చెప్పాను, అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.
15“తూరు గురించి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: నీవు కూలిపోయినప్పుడు నీలో నుండి వచ్చే గాయపడినవారి కేకలు, నీ మధ్య జరుగుతున్న ఊచకోతను విని తీరప్రాంతాలు వణకవా? 16తీరప్రాంతపు అధికారులందరూ తమ సింహాసనాల మీది నుండి దిగి, వారి వస్త్రాలను, చేతికుట్టుతో చేసిన వస్త్రాలను తీసివేసి, భయంతో నేలపై కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి ఆందోళన చెందుతారు. 17నీ గురించి విలాప గీతం ఎత్తి ఇలా పాడతారు:
“ ‘సముద్ర ప్రజలతో నిండిన గొప్ప పట్టణమా!
నీవెలా నాశనమైపోయావు!
నీవు నీ నివాసులు
సముద్రాల మీద బలవంతులుగా ఉన్నారు,
అక్కడ నివసించిన వారందరిపై
నీవు నీ భయాన్ని ఉంచావు.
18ఇప్పుడు నీవు కూలిపోయిన రోజున
తీరప్రాంతాలు కంపిస్తున్నాయి.
నీవు పతనాన్ని చూసి
సముద్ర ద్వీపాలు భయపడుతున్నాయి.’
19“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నివాసులు లేని పట్టణాల్లా నిన్ను నేను నిర్మానుష్యంగా మార్చినప్పుడు, నిన్ను మహా సముద్రం ముంచివేసేలా నీ మీదికి అగాధ జలాలను రప్పిస్తాను. నిన్ను మహా సముద్రం నిన్ను ముంచివేస్తున్నప్పుడు, 20చాలా కాలం క్రితం పాతాళంలోకి దిగి వెళ్లిన వారి దగ్గరకు నేను నిన్ను పడవేస్తాను. నేను నిన్ను భూమి క్రింద ఉన్న స్థలంలో ప్రాచీన శిథిలాల మధ్య పాతాళంలోకి దిగి వెళ్లిన వారితో నివసించేలా చేస్తాను, అప్పుడు నీవు సజీవులు నివసించే చోటికి తిరిగి రావు. 21నేను నీకు భయంకరమైన ముగింపు ఇస్తాను, నీవు ఇకపై ఉండవు. నీ గురించి ఎంత వెదికినా నీవు ఎప్పటికీ కనిపించవు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 26: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.