హోషేయ 14
14
దీవెన రావాలంటే పశ్చాత్తాపపడాలి
1ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవా దగ్గరకు మరలా రా!
నీ పాపాలను బట్టి నీవు పడిపోయావు!
2మాటలు సిద్ధపరచుకొని
యెహోవా దగ్గరకు రా.
ఆయనతో ఇలా చెప్పు:
“మా పాపాలన్నీ క్షమించండి
మమ్మల్ని దయతో స్వీకరించండి,
కోడెలకు బదులుగా మేము మా పెదవులను అర్పిస్తాము.
3అష్షూరు మమ్మల్ని రక్షించలేదు;
మేము యుద్ధ గుర్రాలను ఎక్కము.
మా చేతులు చేసిన వాటితో మేము,
‘మా దేవుళ్ళు’ అని ఇక ఎన్నడు చెప్పము,
ఎందుకంటే మీరు తండ్రిలేనివారికి దయ చూపుతారు.”
4“నేను వారి నమ్మకద్రోహాన్ని సరిచేస్తాను,
మనస్పూర్తిగా వారిని ప్రేమిస్తాను,
ఎందుకంటే వారి మీదున్న నా కోపం చల్లారింది.
5నేను ఇశ్రాయేలుకు మంచులా ఉంటాను;
అతడు తామరలా వికసిస్తాడు.
లెబానోను దేవదారు చెట్టులా
అతని వేర్లు భూమి లోతుకు వెళ్తాయి;
6అతని చిగురు పెరుగుతుంది.
అతని వైభవం ఒలీవ చెట్టులా,
అతని సువాసన లెబానోను దేవదారులా ఉంటుంది.
7అతని నీడలో ప్రజలు నివసిస్తారు;
వారు ధాన్యంలా అభివృద్ధి చెందుతారు,
వారు ద్రాక్షలా వికసిస్తారు,
ఇశ్రాయేలు కీర్తి లెబానోను ద్రాక్షరసంలా ఉంటుంది.
8ఎఫ్రాయిమూ, ఇకనుండి విగ్రహాలతో నాకేం పని?
నేనే అతనికి జవాబిస్తాను, అతన్ని సంరక్షిస్తాను.
నేను పచ్చని సరళ వృక్షం వంటి వాన్ని;
నా వలనే నీకు ఫలం కలుగుతుంది.”
9జ్ఞానులెవరు? వారు ఈ విషయాలు గ్రహించాలి.
వివేచన గలవారెవరు? వారు కూడ గ్రహించాలి.
యెహోవా మార్గాలు సరియైనవి;
నీతిమంతులు వాటిలో నడుస్తారు,
కాని తిరుగుబాటుదారులు వాటిలో తొట్రిల్లుతారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హోషేయ 14: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.