యోవేలు 1
1
1ఇది పెతూయేలు కుమారుడైన యోవేలుకు వచ్చిన యెహోవా వాక్కు.
మిడతల దండు
2పెద్దలారా, దీనిని వినండి;
దేశ నివాసులారా, మీరంతా ఆలకించండి.
ఇప్పుడు జరుగుతున్నది, మీ కాలంలో గాని,
మీ పూర్వికుల కాలంలో గాని ఎప్పుడైనా జరిగిందా?
3ఈ సంగతి మీ పిల్లలకు చెప్పండి,
మీ పిల్లలు తమ పిల్లలకు చెప్పాలి,
వారి పిల్లలు రాబోయే తరం వారికి చెప్పాలి.
4మిడతల గుంపు విడిచిపెట్టిన దానిని
పెద్ద మిడతలు తినేశాయి;
పెద్ద మిడతలు విడిచిపెట్టిన దానిని
చిన్న మిడతలు తినేశాయి;
చిన్న మిడతలు విడిచిపెట్టిన దానిని
ఇతర మిడతలు#1:4 ఈ నాలుగు హెబ్రీ పదాల యొక్క ఖచ్చితమైన అర్థం తెలియదు తినేశాయి.
5త్రాగుబోతులారా, మేల్కొని ఏడవండి!
ద్రాక్షరసం త్రాగే మీరందరు విలపించండి;
క్రొత్త ద్రాక్షరసం కోసం విలపించండి,
ఎందుకంటే అది మీ నోటి పెదవుల దగ్గర నుండి తీసివేయబడింది.
6లెక్కలేనంత గొప్ప సైన్యం ఉన్న ఒక దేశం,
నా దేశాన్ని ఆక్రమించింది;
దానికి సింహం పళ్లు ఉన్నాయి
ఆడసింహం కోరలు ఉన్నాయి.
7అది నా ద్రాక్ష చెట్లను పాడుచేసింది
నా అంజూర చెట్లను నాశనం చేసింది.
అది వాటి బెరడు ఒలిచి పడవేసినందుకు,
చెట్ల కొమ్మలు తెల్లగా కనిపించాయి.
8తన యవ్వన భర్తను కోల్పోయి గోనెపట్ట కట్టుకుని,
దుఃఖించే కన్యలా దుఃఖించండి.
9భోజనార్పణలు పానార్పణలు
యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచిపోయాయి.
యెహోవ ఎదుట సేవచేసే
యాజకులు శోకంలో ఉన్నారు.
10పొలాలు పాడయ్యాయి,
నేల ఎండిపోయింది;
ధాన్యం నాశనమైంది,
క్రొత్త ద్రాక్షరసం ఎండిపోయింది,
ఒలీవనూనె అయిపోయింది.
11రైతులారా, నిరాశ చెందండి,
ద్రాక్షలను పెంచే వారలారా, విలపించండి,
గోధుమ, యవల కోసం దుఃఖించండి,
ఎందుకంటే పొలం పంట పాడైపోయింది.
12ద్రాక్ష ఎండిపోయింది
అంజూర చెట్టు వాడిపోయింది;
దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్#1:12 లేదా బహుశ నేరేడు పండు చెట్లు,
పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి.
ఖచ్చితంగా మనుష్యులకు ఆనందం
లేకుండా పోయింది.
విలపించండి అని పిలుపు
13యాజకులారా, మీరు గోనెపట్ట కట్టుకుని ఏడవండి;
బలిపీఠం దగ్గర సేవ చేసేవారలారా, మీరు రోదించండి.
నా దేవుని ఎదుట సేవ చేసేవారలారా,
రండి, రాత్రంత గోనెపట్ట కట్టుకుని గడపండి;
ఎందుకంటే దేవుని మందిరంలోకి
భోజనార్పణలు పానార్పణలు రాకుండ నిలిచిపోయాయి.
14పరిశుద్ధ ఉపవాసం ప్రకటించండి;
పరిశుద్ధ సభను నిర్వహించండి.
మీ దేవుడైన యెహోవా మందిరానికి వచ్చి,
యెహోవాకు మొరపెట్టడానికి
పెద్దలను పిలిపించండి,
దేశవాసులందరిని పిలిపించండి.
15యెహోవా దినం దగ్గరపడింది;
అయ్యో! ఆ దినం
నాశనంలా సర్వశక్తుని నుండి వస్తుంది.
16మన కళ్లెదుటే
దేవుని మందిరంలో
ఆహారం నిలిపివేయబడలేదా
సంతోషం ఆనందం నిలిచిపోలేదా?
17విత్తనాలు మట్టిగడ్డల క్రింద కుళ్లిపోతున్నాయి.
ధాన్యం ఎండిపోవడంతో,
గిడ్డంగులు పాడైపోయాయి
ధాన్యాగారాలు పడగొట్టబడ్డాయి.
18తినడానికి మేత లేక
పశువులు ఎంతగానో మూలుగుతున్నాయి!
మందలు అటూ ఇటూ తిరుగుతున్నాయి;
గొర్రెల మందలు కూడా శిక్షను అనుభవిస్తున్నాయి.
19యెహోవా మీకు నేను మొరపెడుతున్నాను,
ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లను అగ్ని కాల్చివేసింది
పొలం లోని చెట్లన్నిటిని మంటలు కాల్చివేశాయి.
20కాలువలు ఎండిపోయాయి;
అరణ్యంలో అగ్ని పచ్చికబయళ్లను కాల్చివేసింది
మీ కోసం అడవి జంతువులు కూడా దాహంతో ఉన్నాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోవేలు 1: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.