న్యాయాధిపతులు 10
10
తోలా
1అబీమెలెకు చనిపోయిన తర్వాత ఇశ్శాఖారు గోత్రం నుండి దోదో మనుమడు, పువా కుమారుడైన తోలా ఇశ్రాయేలును రక్షించడానికి లేచాడు. అతడు ఎఫ్రాయిం కొండసీమలో, షామీరులో నివసించాడు. 2అతడు ఇరవై మూడు సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు; తర్వాత అతడు చనిపోయి షామీరులో పాతిపెట్టబడ్డాడు.
యాయీరు
3అతని తర్వాత గిలాదు వాడైన యాయీరు లేచాడు, అతడు ఇరవై రెండు సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు. 4అతనికి ముప్పైమంది కుమారులున్నారు, వారు ముప్పై గాడిదల మీద తిరిగేవారు. వారికి గిలాదులో ముప్పై పట్టణాలు ఉన్నాయి, ఇప్పటికి వాటిని హవ్వోత్ యాయీరు#10:4 లేదా యాయీరు స్థావరాలు పట్టణాలు అని పిలుస్తారు. 5యాయీరు చనిపోయినప్పుడు అతన్ని కామోనులో పాతిపెట్టారు.
యెఫ్తా
6ఇశ్రాయేలీయులు మరల యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు. వారు బయలు, అష్తారోతు, అరాము, సీదోను, మోయాబు, అమ్మోనీయుల, ఫిలిష్తీయుల దేవుళ్ళను పూజించారు. ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచి ఆయనను సేవించడం మానుకున్నారు. 7యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోప్పడి వారిని ఫిలిష్తీయులకు, అమ్మోనీయులకు అప్పగించారు, 8వారు ఆ సంవత్సరం నుండి పద్దెనిమిది సంవత్సరాలు యొర్దాను తూర్పున ఉన్న గిలాదులో, అమోరీయుల దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరిని బాధించి అణచివేశారు. 9అమ్మోనీయులు కూడా యూదా, బెన్యామీను, ఎఫ్రాయిం ప్రజలతో యుద్ధం చేయడానికి యొర్దానును దాటారు; ఇశ్రాయేలీయులు ఎంతో శ్రమ అనుభవించారు. 10అప్పుడు ఇశ్రాయేలీయులు, “మేము మా దేవున్ని విడిచి బయలు ప్రతిమలను సేవిస్తూ, మీకు విరోధంగా పాపం చేశాం” అని యెహోవాకు మొరపెట్టారు.
11యెహోవా ఇశ్రాయేలీయులకు జవాబిస్తూ, “ఈజిప్టువారు, అమోరీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు, 12సీదోనీయులు, అమాలేకీయులు, మయోనీయుల#10:12 కొ.ప్రా.ప్ర.లో మిద్యానీయులు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, మీరు సహాయం కోసం మొరపెట్టినప్పుడు నేను మిమ్మల్ని వారి చేతుల్లో నుండి కాపాడలేదా? 13అయితే మీరు నన్ను విడిచి ఇతర దేవుళ్ళను సేవించారు కాబట్టి నేను మిమ్మల్ని ఇక కాపాడను. 14వెళ్లండి, మీరు ఎంచుకున్న దేవుళ్ళకు వేడుకోండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు అవే మిమ్మల్ని కాపాడతాయేమో!” అని అన్నారు.
15అయితే ఇశ్రాయేలీయులు యెహోవాతో, “మేము పాపం చేశాము. మీ ఇష్ట ప్రకారం మాకు చేయండి, కాని ఇప్పుడు దయచేసి మమ్మల్ని కాపాడండి” అని విన్నవించుకున్నారు. 16తర్వాత ఇశ్రాయేలీయులు తమ మధ్యలో ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించి యెహోవాను సేవించారు. యెహోవా వారు అనుభవిస్తున్న శ్రమను ఇక సహించలేకపోయారు.
17ఆ సమయంలో అమ్మోనీయుల సైన్యాలు యుద్ధానికి సమావేశమై గిలాదులో బస చేశారు, ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో బస చేశారు. 18గిలాదు నాయకులు ఒకరితో ఒకరు, “అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మనలను ఎవరు నడిపిస్తారో, అతడు గిలాదు నివాసులందరి మీద అధికారిగా ఉంటాడు” అని అనుకున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
న్యాయాధిపతులు 10: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.