న్యాయాధిపతులు 11
11
1గిలాదు వంశానికి చెందిన యెఫ్తా బలమైన యోధుడు. యెఫ్తా తండ్రి గిలాదు; అతని తల్లి ఓ వేశ్య. 2గిలాదుకు అతని భార్య కుమారులను కన్నది, వారు పెద్దవారైనప్పుడు యెఫ్తాను తరిమేశారు. “నీవు ఇతర స్త్రీకి పుట్టిన వాడవు కాబట్టి మా కుటుంబంలో నీకు ఆస్తి వాటా రాదు” అని వారు అతనితో అన్నారు. 3కాబట్టి యెఫ్తా తన సోదరుల దగ్గర నుండి వెళ్లి టోబు దేశంలో స్థిరపడ్డాడు, అక్కడ పోకిరీల గుంపు అతనితో ఉంటూ అతన్ని వెంబడించారు.
4-5కొంతకాలం తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో పోరాడుతున్నప్పుడు, గిలాదు పెద్దలు టోబు దేశంలో ఉన్న యెఫ్తాను తీసుకురావడానికి వెళ్లారు. 6యెఫ్తాతో వారు, “రా, వచ్చి మా దళాధిపతిగా ఉండు, అప్పుడు మేము అమ్మోనీయులతో పోరాడగలం” అన్నారు.
7యెఫ్తా గిలాదు పెద్దలతో అన్నాడు, “మీరు నన్ను ద్వేషించి, నా తండ్రి ఇంటి నుండి నన్ను తరిమి వేయలేదా? ఇప్పుడు మీకు కష్టం వచ్చిందని నా దగ్గరకు ఎందుకు వచ్చారు?”
8గిలాదు పెద్దలు అతనితో, “అయినాసరే, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాము; అమ్మోనీయులతో పోరాడడానికి మాతో రా, నీవు గిలాదులో మా అందరికి అధిపతిగా ఉంటావు” అని యెఫ్తాతో అన్నారు.
9యెఫ్తా గిలాదు పెద్దలకు జవాబిస్తూ, “ఒకవేళ నేను అమ్మోనీయులతో పోరాడడానికి నన్ను మీరు తీసుకుంటే, యెహోవా నాకు వారిని ఇస్తే, అప్పుడు నేను మీ అధిపతిగా ఉంటానా?” అని అడిగాడు.
10అందుకు గిలాదు పెద్దలు, “యెహోవా మాకు సాక్షి; నీవు చెప్పినట్లు తప్పకుండ మేము చేస్తాము” అని యెఫ్తాతో అన్నారు. 11కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో వెళ్లాడు, ప్రజలు అతన్ని ప్రధానిగా, దళాధిపతిగా నియమించారు. అతడు మిస్పాలో యెహోవా సన్నిధిలో తన మాటలన్నీ తిరిగి తెలిపాడు.
12తర్వాత యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరకు ఈ ప్రశ్నను అడగడానికి దూతలను పంపాడు: “నా దేశం మీద దాడి చేయడానికి నీకు నాకు విరుద్ధంగా ఉన్నది ఏంటి?”
13అమ్మోనీయుల రాజు యెఫ్తా దూతలతో, “ఇశ్రాయేలు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు, వారు అర్నోను నుండి యబ్బోకు వరకు, యొర్దాను వరకు ఉన్న నా దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు నాకు సమాధానంతో దానిని తిరిగి ఇచ్చేయాలి” అన్నాడు.
14యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరకు దూతలను తిరిగి పంపించి,
15“యెఫ్తా చెప్పేది ఇది: ఇశ్రాయేలు మోయాబు దేశాన్ని లేదా అమ్మోనీయుల దేశాన్ని తీసుకోలేదు. 16ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు, వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేషుకు వచ్చారు. 17అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు దగ్గరకు దూతలను పంపి, ‘మీ దేశం గుండా వెళ్లడానికి మమ్మల్ని అనుమతించండి’ అని అడిగినప్పుడు, ఎదోము రాజు వినలేదు. వారు మోయాబు రాజును కూడా అడిగారు, అతడు తిరస్కరించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు కాదేషులో నివాసం ఉన్నారు.
18“తర్వాత వారు అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఎదోము, మోయాబు దేశాల చుట్టూ తిరిగి, మోయాబుకు తూర్పుదిక్కు దాటి అర్నోను అవతలి వైపున మకాం వేశారు. అర్నోను మోయాబుకు సరిహద్దు కాబట్టి వారు మోయాబు సరిహద్దులోనికి ప్రవేశించలేదు.
19“తర్వాత ఇశ్రాయేలీయులు హెష్బోనులో ఏలే అమోరీయుల రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపి, ‘మా స్థలానికి వెళ్లడానికి మీ దేశం గుండా మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని అడిగారు. 20అయినప్పటికీ సీహోను ఇశ్రాయేలు తమ సరిహద్దు గుండా వెళ్లడం నమ్మలేదు. అతడు తన సైన్యాన్ని సమకూర్చుకొని, యహజు దగ్గర శిబిరం ఏర్పరచుకొని, అక్కడినుండి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు.
21“అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సీహోనును, అతని సైన్యమంతటిని ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించారు, వారు వారిని ఓడించారు. ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశమంతటిని, ఆ దేశంలో నివసించేవారిని స్వాధీనం చేసుకుని, 22అర్నోను నుండి యబ్బోకు వరకు, అరణ్యం నుండి యొర్దాను వరకు అమోరీయుల భూభాగాన్ని ఆక్రమించుకున్నారు.
23“కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన ప్రజలైన ఇశ్రాయేలు ఎదుట తరిమివేశారు, ఇప్పుడు దానిని తీసుకోవడానికి నీకు ఏమి హక్కు ఉంది? 24మీ దేవుడైన కెమోషు మీకు ఇచ్చేది మీరు తీసుకోరా? అలాగే మా దేవుడైన యెహోవా మాకు ఏది ఇచ్చినా దానిని మేము స్వాధీనం చేసుకుంటాము. 25మోయాబు రాజైన సిప్పోరు కుమారుడైన బాలాకు కంటే నీవు గొప్పవాడివా? అతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనా వాదన కాని పోరాటం కాని చేశాడా? 26మూడువందల సంవత్సరాలు ఇశ్రాయేలు హెష్బోను, అరోయేరు, చుట్టుప్రక్కల స్థావరాలను, అర్నోనులో ఉన్న అన్ని పట్టణాలను ఆక్రమించింది. ఆ సమయంలో మీరు వాటిని ఎందుకు తిరిగి తీసుకోలేదు? 27నేను నీ పట్ల తప్పు చెయ్యలేదు, నీవే నా మీదికి యుద్ధానికి వస్తూ నా పట్ల తప్పు చేస్తున్నావు. న్యాయాధిపతియైన యెహోవా ఈ రోజు ఇశ్రాయేలీయులకు, అమ్మోనీయులకు న్యాయం తీర్చును గాక.”
28అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనకు పంపిన వర్తమానాన్ని లెక్కచేయలేదు.
29తర్వాత యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి వచ్చినప్పుడు, అతడు గిలాదు, మనష్షే నుండి దాటి, గిలాదు యొక్క మిస్పే నుండి వెళ్లి అక్కడినుండి అమ్మోనీయుల మీదికి వెళ్లాడు. 30అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మ్రొక్కుబడి చేశాడు: “మీరు అమ్మోనీయులను నా చేతికి అప్పగిస్తే, 31నేను అమ్మోనీయుల దగ్గర నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, నా ఇంటి నుండి నన్ను కలుసుకోడానికి మొదలు ఏది బయటకు వస్తే, అది యెహోవాకు చెందినది, దానిని నేను దహనబలిగా అర్పిస్తాను.”
32తర్వాత యెఫ్తా అమ్మోనీయులతో పోరాడడానికి వెళ్లాడు, యెహోవా వారని అతని చేతికి అప్పగించారు. 33అతడు అరోయేరు నుండి మిన్నీతు వరకు, అలా ఆబేల్-కెరామీము వరకు ఇరవై పట్టణాలను నాశనం చేశాడు. ఇలా ఇశ్రాయేలు అమ్మోనును లోబరచుకుంది.
34యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు, అతని కుమార్తె తంబురలతో నాట్యం చేస్తూ అతన్ని ఎదుర్కోడానికి వచ్చింది. అతనికి ఆమె ఒక్కతే కుమార్తె. ఆమె తప్ప అతనికి కుమారుడు కాని కుమార్తె కాని లేరు. 35అతడు ఆమెను చూడగానే తన బట్టలు చింపుకొని ఏడుస్తూ, “ఓ నా బిడ్డా, నన్ను కృంగదీశావు, నేను నాశనం అయిపోయాను. నేను యెహోవాకు మ్రొక్కుబడి చేశాను, దానిని మీరలేను” అన్నాడు.
36ఆమె అతనితో, “నా తండ్రి, నీవు యెహోవాకు మాట ఇచ్చావు. నీవు ప్రమాణం చేసిన ప్రకారం నాకు చేయు, ఎందుకంటే యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగతీర్చుకున్నారు. 37అయితే ఈ ఒక్క కోరిక తీర్చు. నేను ఇక పెళ్ళి చేసుకోను, కాబట్టి రెండు నెలలు నా స్నేహితులతో కొండల్లో సంచరిస్తూ ప్రలాపించనివ్వు.”
38అందుకతడు, “నీవు వెళ్లవచ్చు” అని ఆమెతో అన్నాడు. రెండు నెలల వరకు అతడు ఆమెను వెళ్లనిచ్చాడు. ఆమె తన స్నేహితులతో కొండల్లోకి వెళ్లి తాను ఇక పెళ్ళి చేసుకోలేదని ప్రలాపించింది. 39ఆ రెండు నెలల తర్వాత ఆమె తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చింది, అతడు తన మ్రొక్కుబడి ప్రకారం ఆమెకు చేశాడు. ఆమె కన్యగానే ఉండిపోయింది.
దీని నుండి ఇశ్రాయేలీయుల వచ్చిన ఆచారం ఏంటంటే 40ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు యువతులు నాలుగు రోజులపాటు బయటకు వెళ్లి, గిలాదు వంశస్థుడైన యెఫ్తా కుమార్తె జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
న్యాయాధిపతులు 11: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapistaging.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.