యిర్మీయా 13
13
నారబట్టతో చేసిన నడికట్టు
1యెహోవా నాతో ఇలా అన్నారు: “నీవు వెళ్లి నార పట్టీ కొని నీ నడుముకు పెట్టుకో, అయితే అది నీళ్లతో తడపవద్దు.” 2కాబట్టి నేను యెహోవా ఆజ్ఞాపించినట్లే నడుముకు నార పట్టీ పెట్టుకున్నాను.
3రెండవసారి యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా చెప్పింది: 4“నీవు కొనుక్కుని నడుముకు పెట్టుకున్న పట్టీని తీసుకుని నీవిప్పుడు పేరతు#13:4 లేదా బహుశ యూఫ్రటీసు నది 5-7 వచనాల్లో కూడా ఉంది నది ఒడ్డుకు వెళ్లి, అక్కడ బండ సందులో దాన్ని దాచి పెట్టు.” 5కాబట్టి యెహోవా నాకు చెప్పినట్లే నేను వెళ్లి పేరతు దగ్గర దాన్ని దాచి పెట్టాను.
6చాలా రోజుల తర్వాత యెహోవా నాతో ఇలా అన్నారు: “ఇప్పుడే నీవు పేరతు నది ఒడ్డుకు వెళ్లి అక్కడ దాచిపెట్టుమని నేను చెప్పిన పట్టీని తెచ్చుకో.” 7కాబట్టి నేను పేరతు నది ఒడ్డుకు వెళ్లి త్రవ్వి దాచిపెట్టిన స్థలంలో నుండి ఆ పట్టీని తీసుకున్నాను, కానీ ఇప్పుడు అది పాడై, పూర్తిగా పనికిరాకుండా పోయింది.
8అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 9“యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను యూదా గర్వాన్ని, యెరూషలేము గొప్ప అహంకారాన్ని కూడా అదే విధంగా నాశనం చేస్తాను. 10నా మాటలు వినకుండ, తమ హృదయాల మొండితనాన్ని అనుసరించి, ఇతర దేవుళ్ళను సేవించే, ఆరాధించే ఈ దుష్ట ప్రజలు ఈ పట్టీలా ఎందుకు పనికిరానివారిగా ఉంటారు! 11నడుముకు పట్టీ కట్టినట్లు నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ, యూదా ప్రజలందరినీ, నా కీర్తి, స్తుతి ఘనత కోసం నా ప్రజలుగా ఉండడానికి నాకు కట్టుకున్నాను. కానీ వారు వినలేదు’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
ద్రాక్ష తిత్తులు
12“వారితో ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ప్రతి ద్రాక్ష తిత్తి ద్రాక్షరసంతో నింపబడాలి.’ ఒకవేళ వారు నీతో, ‘ప్రతి ద్రాక్ష తిత్తి ద్రాక్షరసంతో నింపబడాలని మాకు తెలీదా?’ అని అంటే, 13వారితో ఇలా చెప్పు, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: దావీదు సింహాసనం మీద ఆసీనులైన రాజులు, యాజకులు, ప్రవక్తలు, యెరూషలేములో నివసిస్తున్న వారందరితో సహా ఈ దేశంలో నివసించే వారందరినీ నేను మత్తులో మునిగేలా చేయబోతున్నాను. 14అప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అలాగే అందరిని ఒకరిపై ఒకరు పడేలా చేస్తాను, వారిపై దయ కరుణ కనికరం లేకుండా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
చెరను గురించిన బెదిరింపు
15వినండి శ్రద్ధ వహించండి,
గర్వపడకండి, అని యెహోవా చెప్తున్నారు.
16చీకటి కమ్ముతున్న కొండలమీద
మీ పాదాలు తడబడక ముందే,
మీ దేవుడైన యెహోవా చీకటి తేక ముందే
మీ దేవుడైన యెహోవాను మహిమపరచండి.
మీరు వెలుగు కోసం ఎదురుచూస్తారు,
కానీ ఆయన దానిని పూర్తిగా చీకటిగా
గాఢమైన చీకటిగా మారుస్తారు.
17మీరు వినకపోతే
మీ గర్వాన్ని బట్టి
నేను రహస్యంగా ఏడుస్తాను;
యెహోవా మంద చెరగా కొనిపోబడుతుంది
కాబట్టి నా కళ్లు ఎంతగానో ఏడుస్తాయి,
కన్నీరు కారుస్తాయి.
18రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు,
“మీర మీ సింహాసనాలు దిగిరండి,
ఎందుకంటే మీ దివ్యమైన కిరీటాలు
మీ తలల నుండి పడిపోతాయి.”
19దక్షిణ వైపు ఉన్న పట్టణాలు మూసివేయబడతాయి,
వాటిని తెరవడానికి పట్టించుకునేవారే ఉండరు.
యూదా వారంతా బందీగా కొనిపోబడతారు,
ఏమి మిగులకుండ పూర్తిగా కొనిపోబడతారు.
20కళ్లు పైకెత్తి
ఉత్తరం నుండి వస్తున్న వారిని చూడండి.
నీకు అప్పగించబడిన మంద,
నీవు గొప్పలు చెప్పుకున్న గొర్రెలు ఎక్కడ?
21నీ ప్రత్యేక మిత్రులుగా నీవు చేసుకొన్న వారిని
యెహోవా నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేమంటావు?
ప్రసవిస్తున్న స్త్రీ పడే బాధలాంటి
బాధ నీకు కలుగదా?
22“నాకే ఎందుకు ఇలా జరిగింది?”
అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే
నీ అనేక పాపాల కారణంగానే
నీ వస్త్రాలు చింపబడ్డాయి
నీ శరీరం అసభ్యంగా తాకబడింది.
23కూషీయుడు తన చర్మాన్ని మార్చుకోగలడా?
చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా?
అలాగే చెడు చేయడం అలవాటైన
మీరు మంచి చేయలేరు.
24“ఎడారి గాలికి కొట్టుకుపోయే పొట్టులా
నేను నిన్ను చెదరగొడతాను.
25ఇదే నీ భాగం,
నేను నీకు నియమించిన భాగం,
ఎందుకంటే నీవు నన్ను మరచిపోయి
అబద్ధ దేవుళ్ళపై నమ్మకం ఉంచావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
26“నీ అవమానం కనబడేలా
నీ ముఖం మీది బట్టను నేను లాగివేస్తాను.
27నీ వ్యభిచారాలు, కామపు సకిలింపులు,
నీ సిగ్గులేని వ్యభిచారం!
కొండలమీద, పొలాల్లో
నీ హేయమైన పనులు నేను చూశాను.
యెరూషలేమా, నీకు శ్రమ!
నీవు ఎంతకాలం అపవిత్రంగా ఉంటావు?”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 13: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.