యిర్మీయా 23

23
నీతి కొమ్మ
1“నా పచ్చిక బయళ్లలోని గొర్రెలను నాశనం చేసి చెదరగొట్టే కాపరులకు శ్రమ!” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 2కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలను మేపుతున్న గొర్రెల కాపరులతో ఇలా అంటున్నారు: “మీరు నా మందను చెదరగొట్టి వాటిని తరిమివేసి వాటిని పట్టించుకోనందున, మీరు చేసిన దుర్మార్గానికి నేను మీకు శిక్ష విధిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 3“నేను వాటిని తరిమికొట్టిన దేశాలన్నిటిలో నుండి నా మందలో మిగిలిన వాటిని నేనే పోగుచేసి, వాటి పచ్చిక బయళ్లకు తిరిగి వాటిని తీసుకువస్తాను, అక్కడ అవి ఫలించి వృద్ధిచెందుతాయి. 4వాటిని మేపడానికి నేను గొర్రెల కాపరులను నియమిస్తాను, అవి ఇకపై భయపడవు, బెదిరిపోవు, వాటిలో ఒక్కటి కూడా తప్పిపోదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
5“రాబోయే రోజుల్లో,
నేను దావీదుకు నీతి అనే చిగురును పుట్టిస్తాను,
జ్ఞానయుక్తంగా పరిపాలించే రాజు,
దేశంలో నీతి న్యాయాలు జరిగించేవాన్ని” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
6అతని పరిపాలనలో యూదాకు కాపుదల ఉంటుంది
ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తుంది.
యెహోవా మన నీతిమంతుడైన రక్షకుడు
అని పిలువబడతాడు.
7యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “రాబోయే రోజుల్లో, ఇకపై ప్రజలు, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట అని చెప్పరు’ 8అయితే, ‘ఇశ్రాయేలీయుల సంతానాన్ని ఉత్తర దేశంలో నుండి, ఆయన వారిని బహిష్కరించిన అన్ని దేశాల నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట’ అని వారు చెప్తారు. అప్పుడు వారు వారి స్వదేశంలో నివసిస్తారు.”
అబద్ధ ప్రవక్తలు
9ప్రవక్తల గురించి:
యెహోవాను బట్టి
ఆయన మాట్లాడిన మాటలనుబట్టి
నా హృదయం నాలో పగిలిపోయింది;
నా ఎముకలన్నీ వణుకుతున్నాయి.
త్రాగిన మత్తులో ఉన్నవాడిలా,
ద్రాక్షరసానికి లొంగిపోయిన బలవంతునిలా ఉన్నాను,
10దేశమంతా వ్యభిచారులతో నిండిపోయింది;
శాపం కారణంగా భూమి ఎండిపోయింది
అరణ్యంలో పచ్చికబయళ్లు ఎండిపోయాయి.
ప్రవక్తలు చెడు మార్గం అనుసరిస్తారు
తమ అధికారాన్ని అన్యాయంగా ఉపయోగిస్తారు.
11“ప్రవక్త యాజకుడు ఇద్దరూ భక్తిహీనులే;
నా మందిరంలో కూడా వారి దుర్మార్గాన్ని నేను చూస్తున్నాను”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
12“కాబట్టి వారి దారి జారే నేలలా అవుతుంది;
వారు చీకటిలోకి వెళ్లగొట్టబడతారు
అక్కడ వారు పడిపోతారు.
వారు శిక్షించబడే సంవత్సరంలో
నేను వారి మీదికి విపత్తు రప్పిస్తాను,”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
13“సమరయ ప్రవక్తల్లో
నేను ఇలాంటి అసహ్యకరమైన దాన్ని చూశాను:
వారు బయలు పేరిట ప్రవచించి
నా ప్రజలైన ఇశ్రాయేలీయులను తప్పుదారి పట్టించారు.
14యెరూషలేము ప్రవక్తల్లో
భయంకరమైనది నేను చూశాను:
వారు వ్యభిచారం చేస్తారు, అబద్ధాలతో జీవిస్తారు.
వారు దుర్మార్గుల చేతులను బలపరుస్తారు,
వారిలో ఒక్కరు కూడా తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టరు.
వారందరూ నాకు సొదొమలాంటివారు;
యెరూషలేము ప్రజలు గొమొర్రా వంటివారు.”
15కాబట్టి సైన్యాల యెహోవా ప్రవక్తలను గురించి ఇలా అంటున్నారు:
“నేను వారిని చేదు ఆహారం తినేలా చేస్తాను,
విషపూరితమైన నీళ్లు త్రాగేలా చేస్తాను,
ఎందుకంటే యెరూషలేము ప్రవక్తల
భక్తిహీనత దేశమంతటా వ్యాపించింది.”
16సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు:
“ప్రవక్తలు మీకు చెప్పే ప్రవచనాలను వినవద్దు;
అవి మిమ్మల్ని భ్రమ పెడతాయి.
వారి సొంత మనస్సులోని దర్శనాలు చెప్తారు,
కాని యెహోవా నోటి నుండి వచ్చినవి కాదు.
17‘మీకు సమాధానం కలుగుతుంది యెహోవా చెప్తున్నారు’
అని నన్ను తృణీకరించే వారితో అంటారు.
‘మీకు హాని జరగదు’
అని వారు హృదయ కాఠిన్యం గలవారితో అంటారు.
18అయితే ఆయనను చూడడానికి, ఆయన మాట వినడానికి
వారిలో ఎవరు యెహోవా సభలో నిలబడి ఉన్నారు?
ఆయన మాటను ఎవరు విన్నారు ఎవరు ఆలకించారు?
19చూడండి, యెహోవా ఉగ్రత
తుఫానులా విరుచుకుపడుతుంది,
అది సుడిగాలిలా
దుష్టుల తలలపైకి దూసుకెళ్తుంది.
20యెహోవా తన హృదయ ఉద్దేశాలను
పూర్తిగా నెరవేర్చే వరకు
ఆయన కోపం తగ్గదు.
ఈ విషయాన్ని రాబోయే రోజుల్లో
మీరు స్పష్టంగా గ్రహిస్తారు.
21నేను ఈ ప్రవక్తలను పంపలేదు,
అయినాసరే వారు తమ సొంత సందేశంతో పరుగెత్తుకు వచ్చారు;
నేను వారితో మాట్లాడలేదు,
అయినాసరే వారు ప్రవచించారు.
22కానీ ఒకవేళ వారు నా సభలో నిలబడి ఉంటే,
వారు నా ప్రజలకు నా మాటలు ప్రకటించి
వారి చెడు మార్గాల నుండి
వారి చెడు పనుల నుండి వారిని తప్పించి ఉండేవారు.
23“నేను దగ్గరగా ఉంటేనే దేవుణ్ణా,
దూరంగా ఉంటే నేను దేవున్ని కానా?
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
24నాకు కనబడకుండ ఎవరైనా
రహస్య ప్రదేశాల్లో దాచుకోగలరా?”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
“నేను ఆకాశంలో భూమి మీద అంతటా లేనా?”
అని యెహోవా ప్రకటిస్తున్నారు.
25“నా పేరిట అబద్ధాలు చెప్పే ప్రవక్తలు చెప్పేది నేను విన్నాను. వారు, ‘నాకొక కల వచ్చింది! నాకొక కల వచ్చింది!’ అని అంటారు. 26తమ మనస్సులోని భ్రమలను ప్రవచించే ఈ అబద్ధాల ప్రవక్తల హృదయాల్లో ఇలా ఎంతకాలం కొనసాగుతుంది? 27తమ పూర్వికులు బయలును ఆరాధించి నా పేరును మరచిపోయినట్లే, వీరు ఒకరికొకరు చెప్పుకునే కలలు నా ప్రజలు నా పేరును మరచిపోయేలా చేస్తాయని వీరు అనుకుంటున్నారు. 28కలలు కనే ప్రవక్తలు వారి కలలను చెప్పవచ్చు, నా సందేశాన్ని పొందుకున్న వారు ఆ సందేశాన్ని నమ్మకంగా చెప్పవచ్చు. పొట్టుకు ధాన్యంతో ఏమి సంబంధం?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 29“నా మాట అగ్నిలాంటిది కాదా, బండను ముక్కలు చేసే సుత్తిలాంటిది కాదా? అని యెహోవా ప్రకటిస్తున్నారు.
30“కాబట్టి,” యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఒకరి నుండి నా మాటలను దొంగిలించే ప్రవక్తలకు నేను వ్యతిరేకిని. 31అవును” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “తమ నాలుకలతో తమ స్వంత మాటలు మాట్లాడుతూ ‘యెహోవా ప్రకటిస్తున్నారు’ అనే చెప్పే ప్రవక్తలకు నేను వ్యతిరేకిని. 32నిజానికి, తప్పుడు కలలను ప్రవచించే వారికి నేను వ్యతిరేకిని” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “వారు తమ మోసపూరితమైన అబద్ధాలతో నా ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తారు, నేను వారిని పంపలేదు వారిని నియమించలేదు. వారి వల్ల ఈ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
అబద్ధ ప్రవచనం
33“ఈ ప్రజలు గాని ఒక ప్రవక్త గాని యాజకుడు గాని, ‘యెహోవా నుండి ఏం సందేశం వచ్చింది?’ అని నిన్ను అడిగినప్పుడు, ‘ఏ సందేశం? నేను మిమ్మల్ని విడిచిపెడతాను అని యెహోవా చెప్తున్నారు’ అని చెప్పు. 34ఒకవేళ ప్రవక్త గాని యాజకుడు గాని లేదా ఇంకెవరైనా, ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని చెప్పినట్లయితే, నేను వారిని వారి ఇంటివారిని శిక్షిస్తాను. 35మీరు మీ స్నేహితులతో ఇతర ఇశ్రాయేలీయులతో, ‘యెహోవా జవాబేంటి? యెహోవా ఏమి చెప్పారు?’ అని అనాలి. 36కానీ మీరు ‘యెహోవా సందేశం’ అని చెప్పకూడదు, ఎందుకంటే ఎవరి మాట వారికి సందేశం అవుతుంది. మీరు సజీవుడైన దేవుని మాటలను, మన దేవుడైన సైన్యాల యెహోవా మాటలను తారుమారు చేశారు. 37మీరు ప్రవక్తతో ఇలా చెప్పాలి: ‘యెహోవా నీకు ఇచ్చిన జవాబేంటి? యెహోవా ఏమి చెప్పారు?’ 38‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని మీరు చెబితే, యెహోవా ఇలా చెప్తున్నారు: ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని మీరు చెప్పకూడదని నేను మీతో చెప్పినా సరే, ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని మీరు చెప్పారు. 39కాబట్టి, నేను మిమ్మల్ని పూర్తిగా మరచిపోతాను, నేను మీకు మీ పూర్వికులకు ఇచ్చిన పట్టణంతో పాటు మిమ్మల్ని నా సన్నిధిలో నుండి వెళ్లగొడతాను. 40నేను నీ మీదికి ఎన్నటికీ మరచిపోలేని శాశ్వతమైన అవమానాన్ని రప్పిస్తాను.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 23: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి