యిర్మీయా 41

41
1ఏడవ నెలలో, రాజవంశానికి చెందిన వాడు, రాజు అధికారులలో ఒకడైన ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొని మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరకు వచ్చాడు. అక్కడ వారు కలిసి భోజనం చేస్తుండగా, 2నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతనితో ఉన్న పదిమంది మనుష్యులు లేచి, బబులోను రాజు ఆ దేశం మీద అధిపతిగా నియమించిన షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గంతో కొట్టి చంపారు. 3అంతటితో ఆగక, మిస్పాలో గెదల్యా దగ్గర ఉన్న యూదులందరిని, బబులోనీయుల#41:3 లేదా కల్దీయుల సైనికులను ఇష్మాయేలు చంపివేశాడు.
4గెదల్యా హత్య జరిగిన మరుసటిరోజు, ఆ విషయం ఎవరికీ తెలియకముందే, 5తమ గడ్డాలు గీసుకుని, బట్టలు చింపుకుని, తమను తాము గాయపరచుకున్న ఎనభైమంది షెకెము, షిలోహు, సమరయ నుండి భోజనార్పణలు, ధూపం తీసుకుని యెహోవా ఆలయానికి వచ్చారు. 6నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని కలుసుకోడానికి మిస్పా నుండి ఏడుస్తూనే వెళ్లాడు. అతడు వారిని కలుసుకున్నప్పుడు, అతడు వారితో, “అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరికి రండి” అని అన్నాడు. 7వారు పట్టణంలోకి వెళ్లినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతనితో ఉన్న మనుష్యులు వారిని చంపి గోతిలో పడేశారు. 8అయితే వారిలో పదిమంది ఇష్మాయేలుతో, “మమ్మల్ని చంపకు! మా దగ్గర గోధుమలు, యవలు, ఒలీవనూనె తేనె ఉన్నాయి, వాటిని పొలంలో దాచిపెట్టాము” అని అన్నారు. కాబట్టి అతడు వారిని మిగతా వారితోపాటు చంపలేదు. 9అతడు గెదల్యాతో పాటు చంపిన మనుష్యులందరి మృతదేహాలను పడవేసిన గోతిని గతంలో రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయెషా నుండి కాపాడుకోడానికి త్రవ్వించాడు. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దానిని మృతదేహాలతో నింపాడు.
10ఇష్మాయేలు మిస్పాలో ఉన్న మిగిలిన ప్రజలందరినీ రాజకుమార్తెలతో పాటు అక్కడ మిగిలిపోయిన వారందరినీ బందీలుగా చేశాడు. రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను వారి మీద అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడు. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని బందీలుగా తీసుకుని అమ్మోనీయుల దగ్గరకు బయలుదేరి వెళ్ళాడు.
11కారేహ కుమారుడైన యోహానాను, అతనితో ఉన్న సైన్య అధికారులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన నేరాల గురించి విని, 12తమ సైనికులందరిని తీసుకుని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధం చేయడానికి వెళ్లారు. వారు గిబియోనులోని పెద్ద కొలను దగ్గర అతన్ని పట్టుకున్నారు. 13ఇష్మాయేలు అతనితో ఉన్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానాను అతనితో ఉన్న సైన్య అధికారులను చూసినప్పుడు, వారు సంతోషించారు. 14మిస్పాలో ఇష్మాయేలు బందీలుగా పట్టుకున్న ప్రజలంతా తిరిగి కారేహ కుమారుడైన యోహానాను దగ్గరికి వెళ్లారు. 15అయితే నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతని ఎనిమిది మంది మనుష్యులు యోహానాను నుండి తప్పించుకుని అమ్మోనీయుల దగ్గరకు పారిపోయారు.
ఈజిప్టుకు పారిపోవుట
16అప్పుడు, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను హత్యచేసిన తర్వాత కారేహ కుమారుడైన యోహానాను అతనితో ఉన్న సైన్య అధికారులందరూ మిస్పాలో ఇష్మాయేలు దగ్గర ప్రాణాలతో మిగిలి ఉన్న ప్రజలందరినీ అనగా గిబియోను నుండి ఇష్మాయేలు తీసుకెళ్లిన సైనికులను, స్త్రీలను, పిల్లలను ఆస్థాన అధికారులను తిరిగి తీసుకువచ్చారు. 17వారు బబులోనీయుల నుండి తప్పించుకోవడానికి వారు ఈజిప్టుకు వెళ్లే మార్గంలో బేత్లెహేము సమీపంలోని గెరూత్-కిమ్హాము దగ్గర ఆగారు. 18వారు బబులోను రాజు దేశానికి అధిపతిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపాడు కాబట్టి వారు బబులోనీయులకు భయపడ్డారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 41: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి