యిర్మీయా 42

42
1అప్పుడు కారేహ కుమారుడైన యోహానాను, హోషయా కుమారుడైన యెజన్యాతో#42:1 కొ.ప్ర.లలో అజర్యా; అలాగే 43:2 లో కూడా ఉంది సహా సైన్య అధికారులందరూ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరూ, 2యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి, “దయచేసి మా విన్నపం విని, ఈ మిగిలిన వారందరి కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు. ఎందుకంటే నీవిప్పుడు చూస్తున్నట్లుగా, మేము ఒకప్పుడు చాలా మందిమే అయినప్పటికీ, ఇప్పుడు కొద్ది మందిమి మాత్రమే మిగిలి ఉన్నాము. 3మేము ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో మాకు తెలియజేయమని నీ దేవుడైన యెహోవాకు ప్రార్థించు” అని అన్నారు.
4“నేను నీ మాట విన్నాను, మీరు కోరినట్లే నేను మీ దేవుడైన యెహోవాకు తప్పక ప్రార్థిస్తాను; యెహోవా చెప్పినదంతా నేను మీకు చెప్తాను మీ నుండి ఏమీ దాచను” అని యిర్మీయా ప్రవక్త జవాబిచ్చాడు.
5అప్పుడు వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీ దేవుడైన యెహోవా నీ ద్వారా మాకు తెలియజేసిన మాటల ప్రకారం మేము చేయకపోతే, యెహోవాయే మాకు వ్యతిరేకంగా నిజమైన, నమ్మకమైన సాక్షిగా ఉండును గాక. 6అది మాకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మేము నిన్ను పంపుతున్న మా దేవుడైన యెహోవాకు లోబడతాము. మా దేవుడైన యెహోవాకు లోబడితే మాకు మంచే జరుగుతుంది.”
7పది రోజుల తర్వాత యిర్మీయాకు యెహోవా వాక్కు వచ్చింది. 8కాబట్టి అతడు కారేహ కుమారుడైన యోహానానును, అతనితో ఉన్న సైన్య అధికారులందరినీ, సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రజలందరినీ పిలిచాడు. 9అతడు వారితో, “మీ విన్నపాన్ని తెలియజేయడానికి మీరు ఎవరి దగ్గరకు నన్ను పంపించారో ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: 10‘మీరు ఈ దేశంలోనే ఉంటే, నేను మిమ్మల్ని కడతాను, కూల్చివేయను; నేను మిమ్మల్ని నాటుతాను, పెరికివేయను, ఎందుకంటే నేను మీకు కలిగించిన విపత్తు గురించి బాధపడ్డాను. 11ఇప్పుడు మీరు ఎవరికైతే భయపడుతున్నారో ఆ బబులోను రాజుకు మీరు భయపడవద్దు. అతనికి భయపడవద్దు, అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని రక్షిస్తాను అతని చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. 12నేను మీమీద కనికరం చూపిస్తాను, అప్పుడు అతడు మీమీద కనికరం చూపి, మిమ్మల్ని మీ దేశానికి తిరిగి పంపుతాడు.’
13“అయితే, ‘మేము ఈ దేశంలో ఉండము’ అని చెప్పి, మీ దేవుడైన యెహోవాకు అవిధేయత చూపితే, 14ఒకవేళ మీరు, ‘వద్దు, మేము ఈజిప్టుకు వెళ్లి అక్కడ నివసిస్తాము. మేము యుద్ధం చూడం, బూరధ్వని వినం, రొట్టెల కోసం ఆకలితో ఉండం’ అని అంటే, 15యూదాలో మిగిలి ఉన్నవారలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘ఒకవేళ మీరు ఈజిప్టుకు వెళ్లి, అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొని ఉంటే, 16మీరు ఏ ఖడ్గానికి భయపడతారో అది అక్కడ మిమ్మల్ని పట్టుకుంటుంది, మీరు భయపడే కరువు ఈజిప్టులోకి కూడా మిమ్మల్ని వెంటపడుతుంది, అక్కడే మీరు చనిపోతారు. 17నిజానికి, ఈజిప్టుకు వెళ్లి అక్కడ స్థిరపడాలని నిశ్చయించుకొనిన వారందరూ ఖడ్గం, కరువు, తెగులు వల్ల చస్తారు; నేను వారి మీదికి తెచ్చే విపత్తు నుండి వారిలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు, ప్రాణాలతో బయటపడలేరు.’ 18ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘యెరూషలేములో నివసించేవారి మీద నా కోపం, ఉగ్రత ఎలా కుమ్మరించానో, మీరు ఈజిప్టుకు వెళ్లినప్పుడు కూడా నా కోపం మీమీద అలాగే కుమ్మరిస్తాను. మీరు శాపగ్రస్తులుగా,#42:18 అంటే, మీ పేరు ఇతరులను శపించడానికి వాడబడుతుంది; (యిర్మీయా 29:22 చూడండి); లేదా ఇతరులు మీరు శపించబడాలని చూస్తారు. భయానకంగా, శాపంగా, నిందగా అవుతారు; మీరు ఈ స్థలాన్ని మళ్ళీ చూడలేరు.’
19“యూదాలో మిగిలి ఉన్నవారలారా, ‘ఈజిప్టుకు వెళ్లవద్దు’ అని యెహోవా మీతో చెప్పారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి: 20మీరు నన్ను మీ దేవుడైన యెహావా దగ్గరకు పంపి, ‘మాకోసం మా దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి, ఆయన చెప్పే ప్రతిదీ మాతో చెప్పు, మేము అలాగే చేస్తాము’ అని చెప్పి మీరు ఘోరమైన తప్పు చేశారని గుర్తుంచుకోండి. 21ఈ రోజు నేను మీతో చెప్పాను, కానీ మీకు చెప్పమని నన్ను పంపిన వాటన్నిటిలో దేనికి మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు. 22కాబట్టి ఇప్పుడు ఈ విషయం తప్పక గుర్తుంచుకోండి: మీరు ఎక్కడికి వెళ్లి స్థిరపడాలనుకున్నా మీరు ఖడ్గం, కరువు, తెగులు వల్ల చనిపోతారు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 42: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి