Akara Njirimara YouVersion
Akara Eji Eme Ọchịchọ

యోహాను 7

7
యేసు పర్ణశాలల పండుగకు వెళ్లుట
1ఆ తర్వాత, యేసు గలిలయల ప్రాంతంలోనే తిరుగుతున్నారు. యూదా నాయకులు ఆయనను చంపాలని ఎదురు చూస్తున్నారని యేసు యూదయ ప్రాంతాలకు వెళ్లకూడదనుకున్నారు. 2కానీ యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడినప్పుడు, 3యేసుని సహోదరులు ఆయనతో, “గలిలయల వదిలి యూదయకు వెళ్లు. అప్పుడు అక్కడ ఉన్న నీ శిష్యులు నీవు చేసిన కార్యాలు చూస్తారు. 4అందరిలో ప్రసిద్ధి పొందాలని కోరుకొనే వారెవరు రహస్యంగా కార్యాలను చేయరు. నీవు ఈ కార్యాలను చేస్తున్నావు, లోకానికి నిన్ను నీవు కనపరచుకో” అన్నారు. 5ఎందుకంటే ఆయన సొంత సహోదరులు కూడా ఆయనను నమ్మలేదు.
6అందుకని యేసు వారితో, “నా సమయం ఇంకా రాలేదు; కానీ మీ సమయం ఎప్పుడైనా ఉంటుంది. 7ఈ లోకం మిమ్మల్ని ద్వేషించదు, కానీ నేను దాని పనులు చెడ్డవని సాక్ష్యమిస్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తుంది. 8మీరు పండుగకు వెళ్లండి. నా సమయం సంపూర్ణం కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే రాను” అని చెప్పారు. 9ఇది చెప్పిన తర్వాత ఆయన గలిలయలో ఉన్నారు.
10అయితే తన సహోదరులు పండుగకు వెళ్లిన తర్వాత, బహిరంగంగా కాకుండా, రహస్యంగా ఆయన కూడా వెళ్లారు. 11పండుగలో యూదా నాయకులు యేసుని వెదకుతూ, “ఆయన ఎక్కడ?” అని అడుగుతున్నారు.
12ఆ జనసమూహంలో ఆయన గురించి చాలా ఎక్కువగా గుసగుసలు చెప్పుకొంటూ ఉన్నారు. వారిలో కొందరు, “అతడు మంచివాడు” అన్నారు.
మరికొందరు, “కాదు, అతడు ప్రజలను మోసం చేస్తున్నాడు” అన్నారు. 13అయితే యూదా నాయకులకు భయపడి ఎవరు ఆయన గురించి బహిరంగంగా ఏమి మాట్లాడలేదు.
పండుగ సమయంలో యేసు బోధించుట
14పండుగ ఉత్సవాలు సగం రోజులు పూర్తియైన తర్వాత యేసు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు. 15అక్కడ ఉన్న యూదులు ఆశ్చర్యపడి, “చదువుకోని వానికి ఇంతటి పాండిత్యం ఎలా వచ్చింది?” అని అడిగారు.
16అందుకు యేసు, “నా బోధ నా సొంతం కాదు. నన్ను పంపినవాని నుండి అది వచ్చింది. 17దేవుని చిత్తాన్ని చేయాలని ఎంచుకొన్నవారు, నా బోధలు దేవుని నుండి వచ్చాయా లేక నా సొంతంగా మాట్లాడుతున్నానా అనేది గ్రహిస్తారు. 18సొంతగా మాట్లాడేవాడు తన ఘనత కొరకే అలా చేస్తాడు, కాని తనని పంపినవాని ఘనత కొరకు చేసేవాడు సత్యవంతుడు; ఏ అబద్ధానికి అతనిలో చోటు ఉండదు. 19మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? అయితే మీలో ఎవ్వరూ ధర్మశాస్త్రాన్ని పాటించడంలేదు. మీరు ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు?” అన్నారు.
20అందుకు జనసమూహం “నీకు దయ్యం పట్టింది, నిన్ను ఎవరు చంపాలని ప్రయత్నిస్తున్నారు?” అన్నారు.
21యేసు వారితో, “నేను ఒక అద్బుతాన్ని చేశాను, అందుకు మీరు ఆశ్చర్యపోయారు. 22అయితే మోషే మీకు సున్నతి ఆచారాన్ని ఇచ్చాడు. వాస్తవానికి అది మోషే నుండి రాలేదు, కాని మీ పితరుల నుండి వచ్చింది. అయినా సబ్బాతు దినాన మీరు ఒక మగ శిశువుకు సున్నతి చేస్తారు. 23మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి మీరు సబ్బాతు దినాన ఒక మగ శిశువుకు సున్నతి చేస్తే, నేను సబ్బాతు దినాన ఒక వ్యక్తి దేహాన్నంతటిని బాగుచేసినందుకు నాపై ఎందుకు కోప్పడుతున్నారు? 24కేవలం పైరూపాన్ని చూసి విమర్శించడం మాని, న్యాయంగా తీర్పు తీర్చండి” అని అన్నారు.
యేసు ఎవరనే దానిపై విభేదం
25ఆ సమయంలో యెరూషలేము ప్రజలలో కొందరు, “యూదులు చంపాలని చూస్తుంది ఇతన్ని కాదా? 26ఇక్కడ ఈయన, బహిరంగంగా మాట్లాడుతున్నాడు, కానీ వాళ్ళు ఇతన్ని ఒక్క మాటకూడ అనడంలేదు. ఈయన నిజంగా క్రీస్తు అని అధికారులు తెలుసుకొన్నారా? 27అయితే ఈయన ఎక్కడివాడో మనకు తెలుసు; కానీ క్రీస్తు#7:27 క్రీస్తు అనగా మెస్సీయ వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వస్తాడో ఎవరికీ తెలియదు” అని అనుకున్నారు.
28అప్పుడు యేసు ఇంకా దేవాలయ ఆవరణంలో బోధిస్తూ బిగ్గరగా, “అవును, నేను మీకు తెలుసు, నేను ఎక్కడివాడనో తెలుసు. అయినా నా అంతట నేను నా సొంత అధికారంతో ఇక్కడికి రాలేదు, అయితే నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన మీకు తెలియదు, 29నేను ఆయన దగ్గరి నుండి వచ్చాను కనుక ఆయన నాకు తెలుసు, ఆయనే నన్ను పంపారు” అని అన్నారు.
30ఈ మాటలకు వారు ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ, ఆయన సమయం ఇంకా రాలేదు కనుక ఎవ్వరూ ఆయన మీద చేయి వేయలేకపోయారు. 31అయినా, సమూహంలోని అనేకమంది ఆయనను నమ్మారు. వారు, “క్రీస్తు వచ్చినప్పుడు, ఈయన కన్నా ఎక్కువ అద్బుతాలను చేస్తాడా?” అని అడిగారు.
32ఆయన గురించి ఈ విషయాలను ఆ జనసమూహంలో గుసగుసలాడడం పరిసయ్యులు విన్నారు. అప్పుడు ముఖ్య యాజకులు మరియు పరిసయ్యులు ఆయనను బంధించడానికి దేవాలయ సంరక్షకులను పంపించారు.
33యేసు, “నేను మీతో కేవలం కొంతకాలమే ఉంటాను, తర్వాత నన్ను పంపినవాని దగ్గరకు నేను వెళ్తాను. 34మీరు నా కొరకు వెదకుతారు కాని, కనుగొనలేరు; నేను ఉన్న చోటికి మీరు రాలేరు” అని చెప్పారు.
35అప్పుడు యూదులు ఒకరితో ఒకరు, “మనం కనుగొనలేని ఏ స్థలానికి ఇతడు వెళ్లబోతున్నాడు? గ్రీసు దేశస్థుల మధ్య చెదరిపోయి జీవిస్తున్న మన ప్రజల దగ్గరకు ఆయన వెళ్లి, గ్రీసు దేశస్థులకు బోధిస్తాడా? 36‘మీరు నన్ను వెదకుతారు కాని కనుగొనలేరు; నేను ఉన్న చోటికి మీరు రాలేరు’ అని ఈయన చెప్పిన దానికి అర్థం ఏమిటి?” అని చెప్పుకొన్నారు.
37పండుగలోని గొప్ప రోజైన చివరి రోజున, యేసు నిలబడి, “ఎవరైనా దప్పిగొంటే నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకొండి. 38లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రకారం, నన్ను నమ్మేవారి అంతరంగంలో నుండి జీవజలధారలు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పారు. 39ఆయనను నమ్మినవారు తర్వాత పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాటలను చెప్పారు. యేసు ఇంకా మహిమ పరచబడలేదు గనుక ఆత్మ అప్పటికి ఇంకా ఇవ్వబడలేదు.
40ఆయన మాటలను విన్న తర్వాత, ప్రజలలో కొందరు, “ఈయన నిజంగానే ప్రవక్త” అని చెప్పుకొన్నారు.
41మరికొందరు, “ఈయనే క్రీస్తు” అన్నారు.
అయినప్పటికి ఇంకా కొందరు, “క్రీస్తు గలిలయ నుండి ఎలా వస్తాడు? 42క్రీస్తు దావీదు కుటుంబంలో నుండి మరియు దావీదు నివసించిన బేత్లెహేమనే ఊరి నుండి వస్తాడని లేఖనాలలో వ్రాయబడలేదా?” అని చెప్పుకొంటున్నారు. 43ఈ విధంగా క్రీస్తును గురించి ప్రజలలో విభేదాలు ఏర్పడ్డాయి. 44కొందరు ఆయనను పట్టుకోవాలని అనుకున్నారు, కాని ఎవ్వరూ ఆయన మీద చేయి వేయలేకపోయారు.
యూదా నాయకులలో అవిశ్వాసం
45చివరికి దేవాలయ సంరక్షకులు తిరిగి ముఖ్య యాజకులు మరియు పరిసయ్యుల దగ్గరకు వెళ్లినప్పుడు, వారు “అతన్ని మీరెందుకు తీసుకురాలేదు?” అని వారిని అడిగారు.
46ఆ సంరక్షకులు, “ఆయన మాట్లాడే విధంగా ఇంతకు ముందు ఎవ్వరూ మాట్లాడలేదు” అని చెప్పారు.
47పరిసయ్యులు, “అంటే మిమ్మల్ని కూడా అతడు మోసగించాడా? అని అన్నారు. 48అధికారులలో లేదా పరిసయ్యులలో ఎవరైనా ఆయనను నమ్మారా? 49లేదు! ధర్మశాస్త్రం గురించి ఏమి తెలియని ఈ గుంపు నమ్ముతున్నారు, వారి మీద శాపం ఉంది” అన్నారు.
50ఇంతకు ముందు యేసు దగ్గరకు వెళ్లిన నీకొదేము, వారిలో ఒక సభ్యుడు కూడా. అతడు వారితో, 51“ఒకడు చెప్పేది వినకుండా, అతడు ఏమి చేశాడో కనుక్కోకుండ, మన ధర్మశాస్త్రం తీర్పు తీర్చుతుందా?” అని అడిగాడు.
52అందుకు వారు, “నీవు కూడ గలిలయకు చెందినవాడివా? ఇదిగో, గలిలయ నుండి ఏ ప్రవక్త రాడు కదా!” అన్నారు.
[53తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.]#7:53 ప్రాచీన ప్రతులలో మరియు పురాతన ఆధారాలలో యోహాను 7:53–8:11 వరకు లేదు. కాని కొన్ని వ్రాతప్రతులలో ఉన్నది.

Nke Ahọpụtara Ugbu A:

యోహాను 7: TCV

Mee ka ọ bụrụ isi

Kesaa

Mapịa

None

Ịchọrọ ka echekwaara gị ihe ndị gasị ị mere ka ha pụta ìhè ná ngwaọrụ gị niile? Debanye aha gị ma ọ bụ mee mbanye