మత్తయి సువార్త 5
5
కొండ మీది ప్రసంగం
1యేసు ఆ జనసమూహాన్ని చూసి కొండ మీదికి వెళ్లి కూర్చుని ఉండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. 2అప్పుడు ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు.
ధన్యతలు
ఆయన ఇలా బోధించారు:
3“ఆత్మ కోసం దీనులైన వారు ధన్యులు,
పరలోక రాజ్యం వారిదే.
4దుఃఖించే వారు ధన్యులు,
వారు ఓదార్చబడతారు.
5సాత్వికులు ధన్యులు,
వారు భూమిని స్వతంత్రించుకుంటారు.
6నీతి కోసం ఆకలిదప్పులు కలవారు ధన్యులు,
వారు తృప్తిపొందుతారు.
7కనికరం చూపేవారు ధన్యులు,
వారు కనికరం పొందుతారు.
8హృదయశుధ్ధి కలవారు ధన్యులు,
వారు దేవుని చూస్తారు.
9సమాధానపరిచేవారు ధన్యులు,
వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు.
10నీతి కోసం హింసల పాలయ్యేవారు ధన్యులు,
పరలోక రాజ్యం వారిదే.
11“నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని అవమానించి, హింసించి మీరు చెడ్డవారని మీమీద అపనిందలు వేసినప్పుడు మీరు ధన్యులు. 12సంతోషించి ఆనందించండి. ఎందుకంటే పరలోకంలో మీ బహుమానం గొప్పది, మీకన్నా ముందు వచ్చిన ప్రవక్తలను కూడా వారు ఇలాగే హింసించారు.
ఉప్పు, వెలుగు
13“మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. కాని ఉప్పు తన సారం కోల్పోతే అది తిరిగి సారవంతం కాగలదా? ఇక అది దేనికి పనికిరాదు, బయట పారవేయబడి త్రొక్కబడడానికే తప్ప మరి దేనికి పనికిరాదు.
14“మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కొండమీద కట్టబడిన పట్టణం కనపడకుండా ఉండలేదు. 15అలాగే ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని పాత్ర క్రింద పెట్టరు, కాని దానిని దీపస్తంభం మీద పెడతారు. అప్పుడే ఇంట్లో ఉన్నవారందరికి వెలుగు ఇస్తుంది. 16అదే విధంగా, ఇతరులు మీ మంచి పనులను చూసి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మహిమపరిచేలా ఇతరుల ముందు మీ వెలుగును ప్రకాశింపనివ్వండి.
ధర్మశాస్త్ర నెరవేర్పు
17“నేను ధర్మశాస్త్రాన్ని లేదా ప్రవక్తల మాటలను రద్దు చేయడానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని నెరవేర్చడానికే కాని రద్దు చేయడానికి రాలేదు. 18ఆకాశం భూమి గతించిపోకముందు, ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అందులో నుండి ఒక పొల్లు కానీ, ఒక సున్నా కానీ తప్పిపోదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 19కాబట్టి ఈ ఆజ్ఞలలో అతి చిన్నదైన ఒకదాన్ని చేయకుండ ఇతరులకు వాటిని బోధించేవారు పరలోకరాజ్యంలో చాలా తక్కువగా ఎంచబడతారు, అయితే ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ బోధించేవారు పరలోకరాజ్యంలో గొప్పవారిగా గుర్తించబడతారు. 20ధర్మశాస్త్ర ఉపదేశకుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే, మీ నీతి అధికంగా లేకపోతే మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
హత్య
21“ ‘మీరు హత్య చేయకూడదు. ఎవరైనా హత్య చేస్తే, వారు శిక్షకు గురవుతారు’#5:21 నిర్గమ 20:13 అని మీ పూర్వికులకు చెప్పిన మాట మీరు విన్నారు కదా. 22కాని నేను చెప్పేదేంటంటే, తన సహోదరుని మీద కాని సహోదరి మీద కాని కోప్పడేవారు తీర్పుకు గురవుతారు. అంతేకాక తన సహోదరుని కాని సహోదరిని కాని చూసి ద్రోహి అని పలికేవారు న్యాయస్థానం ఎదుట నిలబడాలి. ‘వెర్రివాడ లేదా వెర్రిదాన!’ అనే వారికి నరకాగ్నికి తప్పదు.
23“కాబట్టి మీరు బలిపీఠం దగ్గర కానుకను అర్పిస్తూ ఉండగా మీ సహోదరునికైనా సహోదరికైనా మీమీద ఏదైన విరోధం ఉందని జ్ఞాపకం వస్తే, 24మీ కానుకను అక్కడ బలిపీఠం ముందే పెట్టి, మొదట వెళ్లి మీ సహోదరునితో లేక సహోదరితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించాలి.
25“మీలో ఎవరైనా మీ విరోధితో నీకున్న వివాదం విషయంలో మీరిద్దరు న్యాయస్థానానికి వెళ్తున్నట్లయితే ఇంకా దారిలో ఉండగానే సమాధానపడడం మంచిది. లేకపోతే మీ విరోధి మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు, ఆ న్యాయాధిపతి మిమ్మల్ని అధికారికి అప్పగించి చెరసాలలో వేయించవచ్చు. 26అప్పుడు జరిగేదేంటంటే చివరి పైసా చెల్లించే వరకు మీరు బయట పడలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను.
వ్యభిచారం
27“ ‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పిన మాట మీరు విన్నారు కదా.#5:27 నిర్గమ 20:14 28అయితే నేను మీతో చెప్పేదేంటంటే, ఒక వ్యక్తి స్త్రీని కామంతో చూస్తేనే అతడు తన మనస్సులో ఆమెతో వ్యభిచారం చేసినట్టు. 29మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడికన్ను కారణమైతే, దాన్ని పెరికి పారవేయడం మేలు. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే, మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా. 30మీరు పొరపాట్లు చేయడానికి ఒకవేళ మీ కుడి చేయి కారణమైతే దాన్ని నరికి పారవేయండి. ఎందుకంటే మీ శరీరమంతా నరకంలో పడవేయబడటం కంటే మీ శరీరంలో ఒక అవయవాన్ని పోగొట్టుకోవడం మీకు మేలు కదా.
విడాకులు
31“ ‘తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెకు ధృవీకరణ పత్రం వ్రాసివ్వాలి’#5:31 ద్వితీ 24:1 అని చెప్పబడింది. 32కానీ నేను మీతో చెప్పేదేంటంటే, ఒక్క వ్యభిచార విషయంలో తప్ప తన భార్యను విడిచిపెట్టేవాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నట్టే. విడిచిపెట్టబడిన స్త్రీని పెళ్ళి చేసుకునేవాడు ఆమెతో వ్యభిచారం చేస్తున్నట్టే.
ప్రమాణాలు
33“అంతేగాక, ‘మీరు మాట ఇస్తే తప్పకూడదు. చేసిన ప్రమాణాలను ప్రభువును బట్టి నిలబెట్టుకోవాలి’ అని పూర్వికులతో చెప్పిన మాట మీరు విన్నారు. 34అయితే నేను మీతో చెప్పేదేంటంటే, అసలు మీరు ఒట్టు పెట్టుకోవద్దు: ఆకాశంతోడని అనవద్దు, ఎందుకంటే ఆకాశం దేవుని సింహాసనం; 35భూమి తోడని అనవద్దు, ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం; యెరూషలేము తోడని అనవద్దు, ఎందుకంటే యెరూషలేము మహారాజు పట్టణం. 36మీ తలమీద ప్రమాణం చేయవద్దు, ఎందుకంటే మీరు కనీసం ఒక్క వెంట్రుకనైనా తెల్లగా కాని నల్లగా కాని చేయలేరు కదా. 37మీరు కేవలం ‘అవునంటే అవును కాదంటే కాదు’ అని చెప్పాలి; దీనికి మించి ఏమి చెప్పినా అది దుష్టుని నుండి వచ్చినట్టే.
కంటికి కన్ను
38“ ‘కంటికి కన్ను, పంటికి పన్ను’#5:38 నిర్గమ 21:24; లేవీ 24:20; ద్వితీ 19:21 అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. 39అయితే నేను మీతో చెప్పేదేంటంటే, దుష్టుని ఎదిరించకూడదు, ఎవరైనా మిమ్మల్ని కుడిచెంప మీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి. 40ఎవరైనా మీతో వివాదం పెట్టుకోవాలని మీ అంగీ తీసుకుంటే, వారికి మీ పైవస్త్రాన్ని కూడా ఇవ్వండి. 41ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని మిమ్మల్ని బలవంతం చేస్తే వారితో మీరు రెండు మైళ్ళు వెళ్లండి. 42ఎవరైనా మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. మిమ్మల్ని అప్పు అడగాలనుకున్న వారి నుండి మీరు తప్పించుకోవద్దు.
శత్రువుల పట్ల ప్రేమ
43“ ‘మీ పొరుగువారిని ప్రేమించాలి, మీ శత్రువును ద్వేషించాలి’#5:43 లేవీ 19:18 అని చెప్పిన మాటలను మీరు విన్నారు కదా. 44-45అయితే నేను మీతో చెప్పేదేంటంటే, మీరు పరలోకంలోని మీ తండ్రికి పిల్లలవాలంటే మీరు మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని బాధించే వారి కోసం ప్రార్థించాలి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నారు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నారు. 46ఒకవేళ మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే, మీకు ఏం లాభం? పన్ను వసూలు చేసేవారు కూడా అలాగే చేస్తారు కదా! 47ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే ఇతరులకు మీకు తేడా ఏంటి? దేవుని ఎరుగనివారు కూడా అలాగే చేస్తారు కదా! 48మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు, మీరు కూడ పరిపూర్ణులై ఉండండి.
Nke Ahọpụtara Ugbu A:
మత్తయి సువార్త 5: TSA
Mee ka ọ bụrụ isi
Kesaa
Mapịa
Ịchọrọ ka echekwaara gị ihe ndị gasị ị mere ka ha pụta ìhè ná ngwaọrụ gị niile? Debanye aha gị ma ọ bụ mee mbanye
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.