సామెతలు 20

20
1మద్యం సేవించేవారు అపహాసకులు బీరు సేవించేవారు కలహప్రియులు;
వాటి ద్వార తూలేవారు జ్ఞానం లేనివారు.
2రాజు వలన కలుగు భయము సింహగర్జన వంటిది;
రాజునకు కోపం పుట్టించు వారు తమకు ప్రాణహాని తెచ్చుకుంటారు.
3తగవులకు దూరముగా ఉండడం మనుష్యులకు ఘనత,
మూర్ఖులు జగడాన్నే కోరును.
4విత్తనం వేసే సమయంలో సోమరి దున్నడు;
కోత సమయంలో పంటను గురించి వాడు తెలుసుకునేసరికి వానికేమియు ఉండదు.
5మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది,
వివేకం గలవాడు దాన్ని పైకి చేదుకుంటాడు.
6తమకు ఎడతెగని ప్రేమ ఉందని చాలామంది చెప్పుకుంటారు,
కానీ నమ్మకమైన మనుష్యులు ఎవరికి కనబడతారు?
7నీతిమంతులు నిందలేని జీవితాలు జీవిస్తారు;
వారి తర్వాత వారి పిల్లలు ధన్యులు.
8న్యాయసింహాసనంపై కూర్చున్న రాజు,
తన కంటి చూపులతో చెడుతనమంతయు చెదరగొడతారు.
9“నా హృదయాన్ని స్వచ్ఛమైనదిగా ఉంచుకున్నాను;
పాపం లేకుండ నేను శుద్ధునిగా ఉన్నాను” అని అనదగిన వారెవరు?
10తప్పుడు తూనిక రాళ్లు తప్పుడు త్రాసులు,
ఈ రెండును యెహోవాకు అసహ్యం.
11చిన్న పిల్లలు తమ ప్రవర్తన స్వచ్ఛమైనదో కాదో యథార్థమైనదో కాదో
తమ చేష్టల ద్వారా తెలియజేస్తారు.
12వినుటకు చెవి చూచుటకు కన్ను
ఈ రెండును యెహోవా కలుగజేసినవే.
13నిద్రను ప్రేమించకు దరిద్రుడవవుతావు;
నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం మిగులుతుంది.
14కొనేవాడు, “అది బాగోలేదు ఇది బాగోలేదు” అని అంటూ బేరమాడతాడు
కాని కొన్న తర్వాత తాను బేరమాడిన దాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటాడు.
15బంగారం ఉంది సమృద్ధిగా ముత్యాలు ఉన్నాయి,
కాని తెలివితో మాట్లాడే పెదవులు అరుదైన ఆభరణం.
16అపరిచితునికి భద్రత కల్పించే వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకోండి;
ఒకవేళ అది బయటి వ్యక్తి కోసం చేస్తే దానిని ప్రతిజ్ఞలో ఉంచండి.
17మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుష్యులకు బహు తీపిగా ఉంటుంది.
తర్వాత వాని నోరు మట్టితో నింపబడుతుంది.
18ప్రణాళికలు ఆలోచనచేత బలపరచబడతాయి,
మంచిచెడులనెరిగిన నాయకుడవై పోరాడాలి.
19పుకార్లు చెప్తూ తిరిగేవారు నమ్మకద్రోహం చేసేవారు
కాబట్టి ఎక్కువగా మాట్లాడేవారిని దూరం ఉంచాలి.
20తన తండ్రినైనను తల్లినైనను తిట్టేవాని
దీపం కటిక చీకటిలో ఆరిపోతుంది.
21జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం
అంతంలో దీవించబడదు.
22కీడుకు తిరిగి కీడు చేయాలనుకోవద్దు,
యెహోవా కోసం వేచియుండు ఆయన నిన్ను రక్షిస్తారు.
23మోసపు తూనిక రాళ్లు యెహోవాకు అసహ్యం,
దొంగత్రాసు ఆయనకు అయిష్టం.
24ఒక వ్యక్తి అడుగులను నిర్దేశించేవారు యెహోవా,
అలాంటప్పుడు తమ మార్గాన్ని వారు ఎట్లు గ్రహించగలరు?
25మనుష్యులు తొందరపడి దేవునికి మ్రొక్కుబడి చేయడం ఒక ఉచ్చులాంటిది,
తర్వాత తెలుస్తుంది దాని మూల్యం ఎంత అనేది.
26జ్ఞానంగల రాజు దుష్టులను చెదరగొడతాడు
అతడు వారి మీదికి చక్రం దొర్లిస్తాడు.
27నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం
అది లోపలి భాగాలన్నిటినీ శోధిస్తుంది.
28దయ, సత్యాలు రాజును కాపాడతాయి
దయ వలన అతడు తన సింహాసనాన్ని నిలుపుకుంటాడు.
29బలము యవ్వనస్థుల కీర్తి
నెరసిన వెంట్రుకలు ముసలివారికి సౌందర్యం.
30బాధపరిచే సంగతులు హృదయంలోకి వెళ్లి
చెడుతనాన్ని తొలగిస్తాయి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

సామెతలు 20: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి