సామెతలు 21
21
1యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ
ఆయనకు ఇష్టులైన వారివైపు దాని త్రిప్పుతారు.
2ఒకడు తన సొంత మార్గాలు సరియైనవి అనుకుంటాడు,
కాని యెహోవా హృదయాలను పరీక్షిస్తారు.
3మనం బలులు అర్పించడం కంటే
మనం సరియైనది, న్యాయమైనది చేయడమే యెహోవాకు ఎక్కువ ఇష్టము.
4అహంకారపు చూపు గర్వ హృదయం
దుష్ట క్రియలన్నీ పాపమే.
5శ్రద్ధగలవారి ప్రణాళికలు లాభాన్ని కలిగిస్తాయి,
తొందరపాటుతనం దారిద్ర్యానికి దారితీస్తుంది.
6అబద్ధమాడే నాలుక ద్వారా వచ్చే ఐశ్వర్యం
క్షణికమైన ఆవిరి ఘోరమైన ఉచ్చు.
7దుష్టుల దౌర్జన్యం వారిని లేకుండ తుడిచివేస్తుంది,
ఎందుకంటే వారు సరియైనది చేయడానికి తిరస్కరిస్తారు.
8అపరాధి యొక్క మార్గం వంకర,
అయితే నిర్దోషుల ప్రవర్తన యథార్థమైనది.
9గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే,
మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు.
10దుష్టుని హృదయం కీడు చేయాలని కోరుతుంది;
తన పొరుగువారి మీద వాడు దయచూపించడు.
11ఎగతాళి చేసేవాడు శిక్షించబడినప్పుడు, సామాన్యుడు జ్ఞానాన్ని పొందుతాడు;
జ్ఞానుల పట్ల శ్రద్ధ చూపడం ద్వారా వారు తెలివి సంపాదిస్తారు.
12నీతిమంతుడు దుష్టుల ఇంటిని గమనించి,
దుష్టులను నాశనం చేస్తాడు.
13బీదల మొర వినకుండ చెవులు మూసుకునేవాడు,
తాను మొరపెట్టినప్పుడు జవాబు రాదు.
14చాటున ఇచ్చిన బహుమానం కోపాన్ని చల్లార్చుతుంది,
ఒడిలో ఉంచబడిన లంచం పగను సమాధానపరుస్తుంది.
15న్యాయమైన పనులు చేయడం నీతిమంతులకు సంతోషకరం
కాని చెడు చేసేవారికి అది భయంకరము.
16వివేకమైన మార్గం నుండి తొలగిపోయే వ్యక్తి
మృతుల గుంపులో అంతమవుతాడు.
17సుఖభోగాలపై ప్రేమ గలవానికి లేమి కలుగుతుంది;
ద్రాక్షారసాన్ని, సుగంధ తైలాన్ని కోరుకునేవానికి ఐశ్వర్యం కలుగుతుంది.
18నీతిమంతుల కోసం భక్తిలేనివారు,
అలాగే యథార్థవంతులకు నమ్మకద్రోహులు క్రయధనమవుతారు.
19ప్రాణం విసిగించే గయ్యాళి భార్యతో కాపురం చేయడం కంటే
అడవిలో నివసించడం మంచిది.
20జ్ఞానుల నివాసంలో కోరదగిన నిధి ఒలీవనూనె ఉంటాయి,
కానీ బుద్ధిలేని మనుష్యులు తాము పొందుకున్నదంతా ఖర్చు చేస్తారు.
21నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడు
ప్రాణాన్ని, వృద్ధిని, ఘనతను పొందుతాడు.
22జ్ఞానియైనవాడు బలవంతుల పట్టణం మీదికి వెళ్లి
వారు నమ్ముకున్న బలమైన కోటను కూల్చివేయగలడు.
23నోటిని నాలుకను భద్రం చేసుకునేవారు
కష్టాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకుంటారు,
24అహంకారం, గర్వం గలవారికి అపహాసకులని పేరు
వారు మిక్కిలి గర్వంతో నడుచుకుంటారు.
25సోమరుల కోరికలు వారిని చంపుతాయి,
ఎందుకంటే వారి చేతులు పని చేయడానికి నిరాకరిస్తాయి.
26పగలంతా వారు మరింత కావాలని కోరుకుంటారు,
కాని నీతిమంతులు మిగుల్చుకోకుండ ఇస్తారు.
27దుష్టుల బలులు అసహ్యం,
చెడు ఉద్దేశంతో అర్పిస్తే ఇంకెంత అసహ్యమో!
28అబద్ధ సాక్షులు నశిస్తారు,
కాని జాగ్రత్తగా వినేవారు నిరాటంకంగా సాక్ష్యమిస్తారు.
29దుష్టులు తమ ముఖంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు,
కాని యథార్థవంతులు తమ మార్గాల గురించి ఆలోచిస్తారు.
30యెహోవాకు వ్యతిరేకంగా సఫలం కాగల
జ్ఞానం గాని, అంతరార్థం గాని, ప్రణాళిక గాని లేదు.
31యుద్ధ దినానికి గుర్రాలు సిద్ధపరచబడతాయి,
కాని విజయం యెహోవా దగ్గర ఉంది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 21: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.