లూకా 19:28-48
లూకా 19:28-48 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు ఈ మాటలను చెప్పి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్లారు. ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బెత్పగే, బేతనియ గ్రామాల సమీపంలో ఉన్నప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ, “మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి, దానిలో మీరు ప్రవేశించగానే, ఇంతవరకు ఎవ్వరూ ఎక్కని ఒక గాడిదపిల్ల కట్టబడి మీకు కనబడుతుంది. దానిని విప్పి ఇక్కడికి తీసుకురండి. ‘మీరు ఎందుకు దాన్ని విప్పుతున్నారు?’ అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి” అని చెప్పి వారిని పంపారు. ఆయన పంపినవారు వెళ్లి, వారితో చెప్పినట్లే దానిని చూసారు వారు ఆ గాడిద పిల్లను విప్పుతుంటే, దాని యజమానులు, “మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు. అందుకు వారు, “ఇది ప్రభువుకు కావాలి” అని చెప్పారు. వారు దానిని యేసు దగ్గరకు తీసుకొనివచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ వస్త్రాలను వేశారు, యేసు దానిపై కూర్చున్నారు. ఆయన వెళ్తుంటే, ప్రజలు దారి పొడుగున తమ బట్టలను పరిచారు. ఒలీవల కొండ నుండి దిగే చోటికి ఆయన సమీపించినప్పుడు, శిష్యుల సమూహమంతా వారు చూసిన అద్బుతాలన్నింటిని బట్టి తమ స్వరాలతో బిగ్గరగా సంతోషంతో: “ప్రభువు పేరట వచ్చే రాజు స్తుతింపబడునుగాక!” “ఉన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ పరలోకంలో సమాధానం కలుగును గాక!” అని దేవుని స్తుతించారు. ఆ జనసమూహంలో ఉన్న పరిసయ్యులు కొందరు యేసుతో, “బోధకుడా, నీ శిష్యులను గద్దించు!” అన్నారు. ఆయన వారితో, “నేను చెప్తున్నాను, వీరు ఊరుకుంటే ఈ రాళ్లు కేకలు వేస్తాయి” అన్నాడు. ఆయన యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు దానిని చూసి దాని గురించి ఏడుస్తూ, “నీకు దేని ద్వార సమాధానం కలుగుతుందో నీవు తెలుసుకొని ఉంటే బాగుండేది, కాని ఇప్పుడది నీ కళ్ళ నుండి దాచబడి ఉంది. ప్రభువు నిన్ను దర్శించినప్పుడు నీవు గ్రహించుకోలేదు కనుక నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా ఒక గట్టు కట్టి అన్ని వైపుల నిన్ను ముట్టడి వేసి అన్ని వైపుల నుండి నిన్ను అరికట్టి, నీ గోడల లోపల ఉన్న నీ పిల్లలతో పాటు నిన్ను భూమిలోకి నలిపి నీలో ఒక రాయి మీద ఇంకొక రాయి నిలబడకుండ చేసే దినాలు వస్తాయి” అని చెప్పారు. యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి, అక్కడ అమ్ముకొనే వారిని తరమడం ప్రారంభించారు. “ ‘నా గృహం ప్రార్థన గృహము’ అని వ్రాయబడి ఉంది, కానీ మీరు దానిని ‘దొంగల గుహగా’ చేశారు” అని అన్నారు. ఆయన ప్రతి రోజు దేవాలయంలో బోధిస్తూ ఉండేవారు. అయితే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రజానాయకులు ఆయనను చంపాలని ప్రయత్నించారు. అయినా ప్రజలందరు ఆయన చెప్పే మాటలను వినాలని ఆయననే హత్తుకుని ఉన్నారు, కనుక వారేమి చేయలేకపోయారు.
లూకా 19:28-48 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు ప్రయాణమై సాగిపోయాడు. ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనీ అనే గ్రామాల సమీపానికి వచ్చినపుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు. “మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. దానిలో మీరు ప్రవేశించగానే కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాని మీద ఇంతవరకూ ఎవ్వరూ కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకు రండి. ఎవరైనా ‘దీన్ని ఎందుకు విప్పుతున్నారు’ అని మిమ్మల్ని అడిగితే ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి” అని చెప్పి వారిని పంపించాడు. ఆయన పంపిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే దాన్ని చూశారు. ఆ గాడిద పిల్లను విప్పుతుంటే దాని యజమానులు, “మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని వారినడిగారు. దానికి వారు, “ఇది ప్రభువుకు కావాలి” అన్నారు. తరువాత యేసు దగ్గరికి దాన్ని తోలుకు వచ్చారు. దానిపై తమ బట్టలు వేసి ఆయనను దానిపై కూర్చోబెట్టారు. ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు. ఒలీవ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. “ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు. ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, “బోధకా, నీ శిష్యులను గద్దించు” అని ఆయనతో అన్నారు. ఆయన, “వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. ఆయన యెరూషలేము పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని విషయం విలపించాడు. “నువ్వు కూడా కనీసం ఈ రోజైనా శాంతి కోసం కావలసిన విషయాలను తెలుసుకుంటే నీకు ఎంత మేలు! కాని ఇప్పుడు అవి నీ కళ్ళకు కనిపించడం లేదు. ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టిదిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు. నీలో ఒక రాయిపై మరొక రాయి ఉండకుండాా కూల్చివేసే రోజు వస్తుంది” అన్నాడు. అప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ అమ్మకాలు చేసేవారితో, “‘నా మందిరం ప్రార్థన మందిరం’ అని రాసి ఉంది. కాని మీరు దాన్ని దొంగల గుహగా చేశారు” అంటూ వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడం ప్రారంభించాడు. ఆయన ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ, ప్రజల్లో ముఖ్యులు ఆయనను అంతం చేయాలని చూస్తూ వచ్చారు. కాని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను విడిచి పెట్టకుండా ఆయన మాటలు వింటూ ఉన్నారు.
లూకా 19:28-48 పవిత్ర బైబిల్ (TERV)
యేసు ఈ ఉపమానం చెప్పి యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. వాళ్ళు ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ గ్రామాలను చేరుకొన్నాక యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరా గ్రామాన్ని ప్రవేశించగానే స్థంభానికి కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దాని మీద యిదివరకు ఎవ్వరూ ఎక్కలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి. ఎవరైనా ‘ఎందుకు విప్పుతున్నారు?’ అని అడిగితే, ఇది ప్రభువుకు కావాలని చెప్పండి” అని అన్నాడు. వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పిన విధంగా గాడిద స్థంభానికి కట్టబడి ఉండటం చూసారు. వాళ్ళు దాన్ని విప్పుతుండగా దాని యజమానులు వచ్చి, “గాడిదను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు. ఇది “ప్రభువుకు కావాలి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళు దాన్ని యేసు దగ్గరకు తీసుకు వచ్చి తమ వస్త్రాల్ని దానిపై పరిచి, దాని మీద యేసును ఎక్కించారు. ఆయన వెళ్తుండగా, ప్రజలు తమ వస్త్రాల్ని దారి మీద పరిచారు. ఆయన ఒలీవల కొండమీద నుండి క్రిందికి దిగే స్థలాన్ని చేరుకున్నాడు. శిష్యుల గుంపంతా తాము మహత్యాలు చూసినందుకు ఆనందంతో బిగ్గరగా యిలా దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు: “‘ప్రభువు పేరిట రానున్న రాజు ధన్యుడు!’ పరలోకంలో శాంతి! మహోన్నత స్థలాల్లో దేవునికి మహిమ!” గుంపులో ఉన్న కొందరు పరిసయ్యులు యేసుతో, “బోధకుడా! మీ శిష్యుల్ని అదుపులో పెట్టుకో!” అని అన్నారు. యేసు, “వాళ్ళు గొంతెత్తి మాట్లాడటం ఆపితే, రాళ్ళు గొంతెత్తి మాట్లాడటం మొదలు పెడతాయి” అని సమాధానం చెప్పాడు. ఆయన యెరూషలేము సమీపిస్తూ ఆ పట్టణాన్ని చూసి ఈ విధంగా విలపించ సాగాడు: “శాంతిని స్థాపించటానికి ఏమి కావాలో నీకు ఈ రోజైనా తెలిసుంటే బాగుండేది. కాని అది నీకిప్పుడు అర్థం కాదు. నీ శత్రువులు నీ చుట్టూ గోడకట్టి నాలుగు వైపులనుండి ముట్టడి చేసే రోజులు రానున్నాయి. వాళ్ళు నిన్ను, నీ ప్రజల్ని నేల మట్టం చేస్తారు. దేవుని రాకను నీవు గమనించలేదు. కనుక వాళ్ళు ఒక రాయి మీద యింకొక రాయి ఉండకుండా చేస్తారు.” ఆ తర్వాత ఆయన మందిరంలోకి ప్రవేశించి అక్కడ అమ్ముతున్న వ్యాపారస్తుల్ని తరిమి వేయటం మొదలు పెట్టాడు. వాళ్ళతో, “నా ఆలయం ప్రార్థనా ఆలయం. కాని మీరు దాన్ని ‘దొంగలు దాగుకొనే స్థలంగా’ మార్చారు!” అని చెప్పబడిందని అన్నాడు. ఆయన ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ ఉండే వాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజా నాయకులు ఆయన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కాని ప్రజలు యేసు మాటలు శ్రద్ధతో వింటూ ఉండటంవల్ల ఆయన్ని ఏ విధంగా చంపాలో వాళ్ళకు బోధపడలేదు.
లూకా 19:28-48 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ల వలెనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవలకొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి –మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడు కూర్చుండలేదు; దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైననుమీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్ము నడిగినయెడల–ఇది ప్రభువునకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడినవారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిదపిల్లను విప్పుచుండగా దాని యజమానులు–మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారి నడిగిరి. అందుకు వారు–ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి, ఆ గాడిదపిల్లమీద తమ బట్టలువేసి, యేసును దానిమీద ఎక్కించి, ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగునపరచిరి. ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించు చున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు –ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహా శబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు–బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి–వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి –నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. (ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతోకూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో –నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను. ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించు చున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.